వరుసగా ఐదో విడత రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం జగన్..
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. వరుసగా ఐదో విడత రైతు భరోసా నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. ఇప్పటి వరకు రైతు భరోసా కింద 34, 288 కోట్ల రూపాయలను చెల్లించామని ఆయన తెలిపారు. మొత్తం 53. 58 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఎగొట్టిన బకాయిలను తామే చెల్లించామన్నారు. ఎన్నికల సమయంలో పెట్టుబడి సాయం కింద 12,500 రూపాయలు ఇస్తామని చెప్పాం.. కానీ అధికారంలోకి వచ్చాక పెట్టుబడి సాయాన్ని పెంచి ఇచ్చామని తెలిపారు. రైతులకు 9 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు. అలాగే, రైతుల తరపున పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది అని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ భారతదేశంలో బీమా ప్రీమియం చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనన్నారు. ఆక్వా రైతులకు రూపాయిన్నరకే కరెంట్ ఇస్తున్నామనే విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. అలాగే, గతంలో చంద్రబాబు రుణాలు మాఫీ చేస్తామంటే నమ్మి ఓటేశారు.. కానీ, అధికారంలోకి వచ్చాక రుణమాఫీ సంగతి మరిచిపోయారు.. చంద్రబాబు చివరికి సున్నా వడ్డీ పథకాన్ని సైతం ఎగ్గొట్టారు ఆరోపించారు. అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలను మన ప్రభుత్వం వచ్చాక చెల్లించామని సీఎం జగన్ పేర్కొన్నారు.
వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి మరో ఎంపీ రాజీనామా
ఎన్నికల వేళ అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది.. ప్రకాశం జిల్లాలో కీలక నేతగా ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి.. పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.. అయితే, వచ్చే ఎన్నికల్లో మాగుంటకు వైసీపీ నుంచి టికెట్ లేదనే సంకేతాలు వెళ్లాయట.. దీంతో.. గత కొంత కాలంగా సైలెంట్‌గా ఉన్న ఆయన.. టీడీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లారనే ప్రచారం సాగుతూ వచ్చింది.. మొత్తంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. ఈ రోజు ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి.. మాగుంట కుటుంబం 34 ఏళ్లుగా ఒంగోలులో రాజకీయాలు చేస్తోంది.. మాగుంట కుటుంబాన్ని ప్రకాశం జిల్లా ప్రజలు అక్కున చేర్చుకున్నారు.. ప్రకాశం జిల్లా వాసులను కుటుంబ సభ్యులుగా భావిస్తూ వస్తున్నాం.. మాగుంట కుటుంబానికి, ప్రజలకు అవినాభావ సంబంధాలు ఉన్నాయన్నారు. ఇక, ఈ 33 ఏళ్లలో 8 సార్లు పార్లమెంట్ కి, ఒకసారి ఎమ్మెల్సీగా పోటీ చేశాం.. మా కుటుంబం కోరుకునేది కేవలం గౌరవం మాత్రమే అన్నారు ఎంపీ మాగుంట.. మాకు ఇగోలు లేవు.. రాబోయే ఎన్నికల్లో మా కుటుంబం ఓ నిర్ణయం తీసుకుంది.. మా కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని పోటీలో ఉంచాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రంలో, జిల్లాలో ప్రస్తుత పరిణామాలు బాధాకరంగా ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం.. అనివార్య పరిస్థితుల్లో వైసీపీని వీడాలనుకుంటున్నాం అని స్పష్టం చేశారు.. ఇక, ఈ ఐదేళ్లలో సీఎం వైఎస్ జగన్ నుంచి కూడా సహాయ సహకారాలు అందాయి.. ఇప్పటివరకు సహకరించిన సీఎం జగన్‌కు, పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ఎంతో బాధతో పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నా.. ఇవాళ వైసీపీకి రాజీనామా చేస్తున్నాను అని ప్రకటించారు. ఇక, త్వరలో తమ రాజకీయ భవితవ్యంపై నిర్ణయం తీసుకుంటాం.. అన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తాం అన్నారు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి.. ఇంకా మీడియా ఆయన ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
ఏపీకి ద్రోహం చేసిన బీజేపీకి ఈ ఎన్నికల్లో తిరస్కారం తప్పదు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అడుగడుగునా ద్రోహం చేసిన బీజేపీకి ఈ ఎన్నికల్లో తిరస్కారం ఖాయం అన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో కేంద్ర మంత్రుల పర్యటన, వారి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.. అసలు దేశానికి, రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందన్న ప్రశ్నకు ఏపీ బీజేపీ నేతలు సమాధానం చెప్పగలరా? అని సవాల్ చేశారు. ఏపీలో సమావేశాలు పెట్టి, సొంత భజన చేసుకునేందుకు బీజేపీకి సిగ్గుండాలి అంటూ ఫైర్ అయ్యారు.. బీజేపీ ఎంతో చేసేసిందని బాకాలు ఊదుతున్న నేతలకు ఏపీకి ద్రోహం చేసిన విషయం తెలియదా? అని నిలదీశారు. దేశంలో పేదరికం, నిరుద్యోగం, అధిక ధరలు ఇసుమంతైనా తగ్గించారా? అని ప్రశ్నించారు. ఇక, తిరుపతి వెంకన్న సాక్షిగా నరేంద్ర మోడీ హామీ ఇచ్చి పదేళ్లయినా అమలు నోచుకోలేదే? అని ప్రశ్నించారు రామకృష్ణ.. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్ట హామీలను బీజేపీ మూటగట్టి అటకెక్కించలేదా? అని విమర్శించారు.. రాష్ట్ర ప్రజలకు అడుగడుగునా ద్రోహం చేసిన బీజేపీకి ఈ ఎన్నికల్లో తిరస్కారం ఖాయం అని వ్యాఖ్యానించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. కాగా, ఏపీలో తమ ఓటు బ్యాంక్ పెరిగిందనే.. భవిష్యత్‌లో ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ బీజేపీ నేతలు చెబుతున్న విషయం విదితమే.. ఇక, టీడీపీ-జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళ్తుండగా.. బీజేపీ నిర్ణయం కోసం ఇంత కాలం వేచిచూసి.. తొలి జాబితాను విడుదల చేశారు. ఈ రోజు ఉమ్మడిగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైన విషయం విదితమే.
వైసీపీ ప్రభుత్వంలో మనం కోరుకుంది వేరు.. జరుగుతుంది వేరు..!
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మనం కోరుకుంది వేరు, జరుగుతుంది మరోటి అన్నారు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ రాష్ట్రంలో వైసీపీ విముక్త పాలన రావాలి.. అందుకే టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని తెలిపారు. వైసీపీ పాలనలో ప్రజలు స్వేచ్ఛగా గాలి కూడా పీల్చుకొలేక పోతున్నారని విమర్శించారు. లక్షలాది మందితో ఈ రోజు వైసీపీ విముక్త అజెండాతో జెండా సభ నిర్వహిస్తున్నాం అన్నారు బాలశౌరి. ఇక, పోలవరం మీద గడిచిన ఐదేళ్లుగా ఐదు శాతం పనులు కూడా చేయలేకపోయారని ఆరోపించారు ఎంపీ బాలశౌరి.. జలజీవన్ పథకాలకు మాచింగ్ గ్రాంట్ లు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేక పోయిందన్న ఆయన.. అందుకే అభివృద్ధి చేయలేని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. మరోవైపు.. మచిలీపట్నం – రేపల్లె మధ్య రైలు మార్గాన్ని రాబోయే ఐదేళ్లలో పూర్తి చేసేలా పనిచేస్తా అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మనం కోరుకుంది వేరు, జరుగుతుంది వేరు అంటూ మండిపడ్డారు. వైసీపీ పాలనలో అధర్మం నాలుగు పాదాల మీద తాండవిస్తుంది అంటూ ఆరోపణలు చేవారు.. ధర్మం అనే మాట వైసీపీ పాలనలో లేదని.. అందుకే ప్రజలు, ప్రజా ప్రతినిదులు వైసీపీకి దూరం అవుతున్నారని పేర్కొన్నారు జనసేన నేత, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి.
కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి టీడీపీ హైకమాండ్ నుంచి పిలుపు..
కేంద్రమంత్రి మాజీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది.. దీంతో ఆయన హూటాహూటిన విజయవాడకు బయల్దేరి వెళ్లారు. ఇప్పటికే డోన్ సీటును కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డికి ఖరారు చేసింది టీడీపీ అధిష్టానం.. ఇక, డోన్ ఇంఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డిని టీడీపీ అభ్యర్థిగా గతంలో ప్రకటించారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. కానీ, కొన్ని రాజకీయ పరిస్థితులను బేరీజు చేసిన తర్వాత.. ఇప్పుడు అభ్యర్థిని మార్చి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి పేరును ఖరారు చేస్తోంది.. మరోవైపు.. డోన్ ఇంఛార్జ్‌గా ఉన్న ధర్మవరం సుబ్బారెడ్డికి టీడీపీ అధిష్టానం నచ్చ చెప్పింది. ఇక, కోట్ల కుటుంబం కర్నూలు ఎంపీ స్థానంతో పాటు ఆలూరు అసెంబ్లీ సీటు కోరింది. కానీ, టీడీపీ అధిష్టానం మాత్రం డోన్ సీటు ఖరారు చేసిందట.. దీనిని అధికారికంగా ప్రకటించే ముందు కోట్లతో చర్చించేందుకు పిలిచినట్టుగా చెబుతున్నారు.. డోన్ ప్రస్తుత ఇంచార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డిని కలుపుకొని వెళ్లే విషయంపై టీడీపీ హైకమాండ్ కీలక ఆదేశాలు ఇవ్వనుందని సమాచారం.. మొత్తంగా ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న కొద్దీ.. ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతూ పోతోంది..
నా ఆత్మగౌరవానికి భంగం కలిగింది.. నా రాజీనామాను ఆమోదించండి..
అనుకున్నట్టే అయ్యింది.. టీడీపీకి దూరంగా జరిగి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరైన సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు.. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈ మేరకు రాజీనామా లేఖను పంపించారు.. ఆ లేఖలో తన రాజకీయ ప్రస్థానాన్ని మొత్తం రాసుకొచ్చారు.. 1981 నుంచి కొత్తపేట సమితి అధ్యక్షునిగా క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించాను.. స్వర్గీయ ఎన్టీఆర్ మరియు వైఎస్‌ఆర్ మంత్రివర్గాల్లో సభ్యునిగా రాష్ట్ర ప్రజలకు సేవలందించాను.. 2014 నుంచి 2019 వరకు శాసన సభ్యునిగా మీకు గానీ, పార్టీకి గాని ఏవిధమైన ఇబ్బంది కలిగించకుండా టీడీపీ గౌరవాన్ని నిలిపిన విషయం మీకు తెలుసు.. 2019 నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, రాజోలు నియోజకవర్గ ఇంచార్జ్‌గా ప్రతికూల పరిస్థితిలో కూడా రాష్ట్ర పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని నిబద్ధతో, క్రమశిక్షణతో అనుసరించి పార్టీ ప్రతిష్టను నిలబెట్టాను అంటూ లేఖ ద్వారా గుర్తు చేశారు గొల్లపల్లి.. అయితే, మీరు 94 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో ప్రకటించి తొలి జాబితాలో.. నన్ను అభ్యర్థిగా ప్రకటించే అర్హతలు ఉన్నప్పటికీ నా పేరును పరిగణలోనికి తీసుకోకపోవడం నాకు అత్యంత బాధ కలిగించింది అంటూ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు గొల్లపల్లి సూర్యావు.. నా ఆత్మగౌరవానికి భంగం కలిగిన ఇటువంటి పరిస్థితిలో పార్టీలో కొనసాగలేనని నేను తెలుగుదేశం పార్టీ పదవులకు మరియు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. నా రాజీనామాను వెంటనే ఆమోదించవలసింది కోరుతున్నాను అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు.. కాగా, విజయవాడలోని కేశినేని భవన్‌లో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, ఎంపీ కేశినేని నానితో చర్చలు జరిపిన గొల్లపల్లి.. వైసీపీలో చేరేందుకు సిద్ధమైన విషయం విదితమే.. సీఎం వైఎస్ జగన్‌ను కలిసి ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు.
ప్రజా సమస్యలను వదిలేసి.. ప్రధాని రాజకీయాలు మాట్లాడుతున్నారు!
ప్రజా సమస్యలను వదిలేసి ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయాలు మాట్లాడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేశారు. రైతులు ఆందోళనలో ఉంటే జంతువులను వేటాడినట్లు వేటాడుతున్నారని, అన్నదాతలపై యుద్ధం సరికాదన్నారు. దేవుళ్లను కలిసే మోడీ.. సమస్యల్లో ఉన్న ప్రజలను ఎందుకు కలవరు? అని ప్రశ్నించారు. విగ్రహాలు తెచ్చానని గొప్పలు చెప్పుకునే మోడీ.. లక్షల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వాళ్లను ఎందుకు వెనక్కి తీసుకురాలేకపోతున్నాడో బీజేపీ సమాధానం చెప్పాలని నారాయణ డిమాండ్ చేశారు. ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను వాడి.. విపక్షాలపై దాడులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖుని చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ… ‘ఎన్డీయే కూటమి బలహీనపడుతుంది. ఇండియా కూటమి బలపడుతుంది. బీహార్‌లో నితీష్ కుమార్ పోయిన కూటమి బలోపేతం అవుతుంది. పొత్తులో భాగంగా వయనాడులో డి రాజా భార్య ఆని రాజా పోటీ చేస్తుంది. బీజేపీకి వ్యతిరేకంగా మా పోరాటం ఉంటుంది.కేరళలో కాంగ్రెస్- కమ్యూనిస్టు పార్టీలే ఉన్నాయి. అక్కడ ఎవరు గెలిచినా.. కేంద్రంలో బీజేపీ రాకూడదన్నదే మా లక్ష్యం. ప్రజా సమస్యలను వదిలేసి ప్రధాని రాజకీయాలు మాట్లాడుతున్నారు. రైతులు ఆందోళనలో ఉంటే జంతువులను వేటాడినట్లు వేటాడుతున్నారు. అన్నదాతలపై యుద్ధం సరికాదు.రాముడిని, కృష్ణుడిని అడ్డంపెట్టుకుని ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. దేవుళ్లను కలిసే మోడీ సమస్యల్లో ఉన్న ప్రజలను ఎందుకు కలవరు. విగ్రహాలు తెచ్చానని గొప్పలు చెప్పుకునే మోడీ.. లక్షల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వాళ్లను ఎందుకు వెనక్కి తీసుకురాలేకపోతున్నాడో బీజేపీ సమాధానం చెప్పాలి?. ప్రజలకు మేలు చేసి ఉంటే ఇన్ని జిమ్మిక్కులు చెయ్యాల్సిన అవసరం వచ్చేదికాదు’ అని అన్నారు.
యూఏఈకి చెందిన ముగ్గురు ఇంజనీర్ల అద్భుతం..ఖర్జూరంతో విద్యుత్
నాచురల్ స్వీట్ పండులో కర్జూరం ఒకటి. ఖర్జూర పండ్లు ఇష్టపడని వారు ఉండరు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే నేరుగా చెట్ల నుంచి ఖర్జూర పండ్లను సేకరించి తింటారు. ఇక పట్టణ, నగరాల్లో ప్రజలు కొనుగోలు చేసి తింటారు. చాలా మంది తమ రోజువారీ ఆహారంలో ఖర్జురను తప్పక తింటారు. ఖర్జూర పండును తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అలాంటి ఖర్జూరం సాయంతో యూఏఈకి చెందిన ముగ్గురు ఇంజనీర్లు అద్భుతం చేశారు. ఖర్జూరం నుంచి విద్యుత్ తయారు చేశారు. ఎమిరాటీ ఇంజనీర్లు, కళాకారుల బృందం విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి సాంప్రదాయ ఖర్జూరాలను వాడారు. ఈ ప్రయోగం ఎవరు ఎలా చేశారో తెలుసుకుందాం. ఈ ఆవిష్కరణ ఘనత ముగ్గురు వ్యక్తులకు చెందుతుంది. వారి పేర్లు డాక్టర్ అల్ అత్తార్, ఒమర్ అల్ హమ్మదీ, మొహమ్మద్ అల్ హమ్మదీ. ముగ్గురూ మజ్దూల్ ఖర్జూరాలను ఉపయోగించారు. ఈ ఖర్జూరం ప్రత్యేకత ఏమిటంటే ఇది పరిమాణంలో చిన్నది. రాగి పలకలను గట్టిగా పట్టుకోగలదు. ఈ ప్రక్రియ ఉద్దేశ్యం ఖర్జూరంలో ఉండే సహజ చక్కెరను సహజ శక్తిగా మార్చడం.
ఆగ్రహించిన సుప్రీంకోర్టు.. రూ.2300కోట్లు పోగొట్టుకున్న బాబా రామ్ దేవ్
బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలికి సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. ఆ తర్వాత బుధవారం ఉదయం పతంజలి ఫుడ్స్ షేర్లలో దాదాపు 4 శాతం క్షీణత కనిపించింది. డ్రగ్స్ ప్రకటనలలో తప్పుదారి పట్టించే వాదనలు చేయబోమని వాగ్దానం చేసినందుకు రామ్‌దేవ్ పతంజలి ఆయుర్వేద్, దాని మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు సుప్రీంకోర్టు మంగళవారం ధిక్కార నోటీసు పంపింది. దీని ప్రభావం స్టాక్ మార్కెట్‌లో లిస్టయిన కంపెనీల షేర్లలో కనిపిస్తోంది. కేవలం 105 నిమిషాల్లోనే రామ్‌దేవ్ కంపెనీకి దాదాపు రూ.2300 కోట్ల నష్టం వాటిల్లింది. మంగళవారం సుప్రీంకోర్టు ఏం చెప్పిందో, ఆ తర్వాత కంపెనీ షేర్ల గణాంకాలు మార్కెట్‌లో ఎలా కనిపిస్తున్నాయో చూద్దాం. గుండె జబ్బులు, ఆస్తమా వంటి వ్యాధులను నయం చేస్తాయంటూ పతంజలి ఉత్పత్తులను ప్రచారం చేయకుండా సుప్రీంకోర్టు నిషేధించింది. భారతీయ వైద్య సంఘం (ఐఎంఎ) కోర్టులో పతంజలి ప్రకటనతో సహా, ది హిందూ వార్తాపత్రికలో చేసిన ప్రకటన, యోగా సహాయంతో మధుమేహం, ఆస్తమాను పూర్తిగా నయం చేస్తుందని కంపెనీ విలేకర్ల సమావేశంలో పేర్కొన్న సాక్ష్యాలను కోర్టులో సమర్పించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. తప్పుదారి పట్టించే ప్రకటనలు జారీ చేయకుండా.. తప్పుదారి పట్టించే దావాలు చేయకుండా పతంజలిని నిలువరించిన మునుపటి కోర్టు ఉత్తర్వులను సదరు కంపెనీ ఉల్లంఘించినట్లు కోర్టు గుర్తించింది.
ఎట్టకేలకు వ్యూహం సినిమాకి గ్రీన్ సిగ్నల్
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన వ్యూహం సినిమాకి ఆన్ని అడ్డంకులు తొలిగాయి. వైఎస్ జగన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. అయితే ఈ సినిమాకి ప్రకటించిన నాటి నుంచే అడ్డంకులు ఎదురవుతూ వచ్చాయి. సినిమా సెన్సార్ చేయక ముందే ఈ సినిమా మీద తెలుగుదేశం పార్టీ కేసులు వేసింది. ఒకసారి సెన్సార్ పూర్తయిన తర్వాత కూడా మరోసారి నారా లోకేష్ కేసు వేయడంతో సెన్సార్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేశారు. మొత్తం మీద టీడీపీ అభ్యంతరాలతో 3 సార్లు సెన్సార్ కు వెళ్లిన వ్యూహం సినిమాకి ఇప్పుడు ఎట్టకేలకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చింది. సెన్సార్ సభ్యులు సూచించిన మార్పులు మేరకు సినిమాలో 22 చోట్ల మ్యూట్ లు, రెండు సన్నివేశాల తొలగించారు. అలాగే సినిమాలో పాత్రలకు పెట్టిన చంద్రబాబు, పవన్, జగన్ పేర్లను సైతం అలా ఉండకూడదు అని చెప్పి సెన్సార్ బోర్డు మార్పించింది. జగన్ రాజకీయ జీవితాన్ని వ్యూహం పేరుతో ఆర్జీవీ తెరకెక్కించారు. సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా రెండు సార్లు వాయిదా పడ్డ వ్యూహం సినిమా విడుదలకి ఇప్పుడు లైన్ క్లియర్ అయింది. మార్చి 2న ఆర్జీవీ వ్యూహం సినిమా విడుదల చేస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమాతో పాటు శపథం అనే సినిమాను దీనికి సీక్వెల్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. అయితే ఈ సినిమాకే ఇన్ని ఇబ్బందులు ఎదురైతే ఆ సినిమాకి కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలకు వైసీపీ నేత దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరించాడు.
అబ్బా ఏమి అందం.. సారా అందానికి కుర్రకారు ఫిదా..
భారత మాజీ క్రికెటర్ సంచిన్ టెండూల్కర్ గురించి తెలియని వాళ్లు ఉండరు.. ఆయన కూతురు సారా గురించి అందరికీ తెలుసు.. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది.. వ్యక్తిగత విషయాలతో నిత్యం వార్తలలో నిలుస్తుంటుంది.. లవ్, డేటింగ్ గురించి సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వైరలవుతుంటాయి.. కానీ ఆ రూమర్స్ గురించి ఎప్పుడూ పట్టించుకోదు.. అందుకే పెద్దగా స్పందించదు.. సారా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. ఆన్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వక పోయిన స్టార్ హీరోయిన్ కన్నా ఎక్కువగానే ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. బంగారు డాలీ జె లెహాంగాలో మరింత అందంగా కనిపిస్తుంది సారా. థ్రెడ్‌వర్క్ తో ఉన్న లెహాంగాలో లైట్ మేకప్ లో చాలా అందంగా ఉంది.. సారా షేర్ చేసిన ఫోటోలకు ఒక గంటలోపే 3 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. సారా డాషింగ్ ఫోటోలపై నెటినజ్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే సారా చేసిన ఫోటో షూట్ ఓ పంజాబీ సాంగ్ కోసం అని తెలుస్తోంది. ఆ ఫోటోలను షేర్ చేస్తూ సాంగ్ కోసం రెడీ అంటూ ఒక క్యాప్షన్ కూడా పెట్టింది..ఇక త్వరలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతుందని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. చాలాకాలంగా ఆమె క్రికెటర్ శుభ్ మాన్ గిల్ తో ప్రేమలో ఉందని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.. వాటి పై ఇద్దరు స్పందించలేదు..
మరో మలయాళ బ్లాక్ బస్టర్ కూడా తెలుగులోకి.. ఆరోజే రిలీజ్?
మలయాళ సినీ పరిశ్రమలో 2024 ఫిబ్రవరి ఒక మరపురాని ఘట్టంగా నిలవనుంది. ఎందుకంటే ఈ నెలలో రిలీజ్ అయిన సినిమాలు ఒకదాని తర్వాత మరొకటి చర్చనీయాంశంగా మారాయి. అద్భుతమైన టాక్ తెచ్చుకోవడమే కాదు మైండ్ బ్లాక్ అయ్యే కలెక్షన్లు కూడా రాబట్టి ఈ సినిమాలు కేరళ బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు, టాలీవుడ్‌ని కూడా ఆకర్షించాయి. మలయాళంలో వచ్చిన భ్రమ యుగం సినిమాను ఇప్పటికే తెలుగులో రిలీజ్ చేశారు. ఇక ప్రేమలు హైదరాబాద్‌లో ఘనవిజయం సాధిస్తున్న క్రమంలో దాన్ని మార్చి 8, 2024న తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ ఈ చిత్రాన్ని తెలుగులో మన ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు మరో మలయాళంలో హిట్ అయిన మంజుమ్మెల్ బాయ్స్ తెలుగులోకి డబ్ అయ్యే సమయం వచ్చేసింది. మంజుమ్మెల్ బాయ్స్ తెలుగు విడుదల తేదీ ఇప్పుడు లాక్ అయింది. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ సీట్ ఎడ్జ్ సర్వైవల్ థ్రిల్లర్ తెలుగులోకి డబ్ చేయబడుతోంది. దీనిని మార్చి 15, 2024న విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తునాన్రు. ఈ చిత్రం డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఓ ప్రముఖ నిర్మాత ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్‌ని కొనుగోలు చేశారని, రానున్న రోజుల్లో ప్రమోషనల్ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అంటే ఈ లెక్కన రాబోయే రెండు వారాల పాటు, మలయాళ చిత్రాలు ప్రేమలు ఆలాగే మంజుమ్మెల్ బాయ్స్ భీమా – గామి వంటి రెగ్యులర్ తెలుగు సినిమాలతో పోటీ పడనున్నాయి. మంజుమ్మెల్ బాయ్స్ అనేది కొడైకెనాల్‌కు వెళ్లి గుణ గుహను చూడాలని అనుకుని ఇబ్బందుల్లో పడే స్నేహితుల బృందం కథ. 2006లో నిజంగా జరిగిన ఘటనను ఆధారంగా చేసుకుని చిదంబరం ఎస్ పొదువాల్ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే దాదాపు 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది.