*తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే హవా..
తెలంగాణ ఇంటర్ పలితాలను విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్ర వెంకటేశం విడుదల చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ, ఒకేషనల్ పలితాలు ప్రకటించారు. మొదటి సంవత్సరంలో 2,87,261 మంది ఉత్తీర్ణులు కాగా..ఉత్తీర్ణత 60.01 శాతం. ఇక ద్వితీయ సంవత్సరంలో 3,22,432 మంది ఉత్తీర్ణులు కాగా.. ఉత్తీర్ణత శాతం 64.19% గా పేర్కొన్నారు. ఈసారి కూడా ఇంటర్ ఫలితాలల్లో బాలికలే ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్ లో ప్రథమ స్థానంలో ములుగు జిల్లా ఉంది. ఇక సాయంత్రం 5 గంటల నుండి మేమో లు అందుబాటులో ఉంచనున్నారు. రేపటి నుండి వచ్చే నెల 2 వరకు రీ వెరిఫికేషన్, రీ వాల్యుయేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వచ్చే నెల 24 నుండి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని వెల్లడించారు.
*సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ని స్వీకరించిన హరీష్ రావు
సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు స్వీకరించారు. సంగారెడ్డి జిల్లాలో హరీష్ రావు మాట్లాడుతూ.. సీఎం సవాల్ ని నేను స్వీకరిస్తున్నా అన్నారు. అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉందన్నారు. ఎల్లుండి అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం వద్దకి నేను వస్తా అన్నారు. ఆగస్ట్ 15 లోపు మీరు ఇచ్చిన అన్ని గ్యారెంటీలు అమలు చేస్తానని ప్రమాణం చెయ్యి అన్నారు. ఆగస్ట్ 15 లోపు పూర్తిగా రుణమాఫీ చెయ్యాలన్నారు. ఒకవేళ చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..మళ్ళీ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయనని తెలిపారు. మీరు చెయ్యకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా? అంటూ ప్రశ్నించారు. నాకు పదవి కంటే తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యమన్నారు. గతంలో కొడంగల్ లో ఓడిపోతే సన్యాసం తీసుకుంటానని చెప్పిన రేవంత్ రెడ్డి తోక ముడిచి మాట తప్పిన వ్యక్తి అంటూ ఆరోపించారు. ఆరు గ్యారెంటిలను డిసెంబర్ 9 నాడు అమలు చేస్తాం అని మాటతప్పింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఆరు గ్యారెంటీలను చట్టబద్ధత చేస్తానని చెప్పి మాట తప్పారన్నారు. మాట తప్పడం పూటకో పార్టీ మారడం మీ నైజం అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే పార్టీ రద్దు చేసుకుంటావా అని తొండి మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని సోనియాగాంధీ తల్లిగా లేఖ రాశారని తెలిపారు. 120 రోజులు దాటినా నీ గ్యారెంటీలు ఏమయ్యాయి అని మేము అడుగుతున్న? అని ప్రశ్నించారు. మహాలక్ష్మీ పథకంలో 2500 మహిళలకు ఎందుకు ఇవ్వలేదు, రైతులకు ఎకరానికి రైతు బంధు 15000 సహాయం ఇవ్వలేదు, ధాన్యానికి 500 బోనస్ ఏది..నిరుద్యోగులకు భృతి ఏదీ? అని ప్రశ్నించారు. కాగా.. నిన్న వరంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అని హరీష్ మాట్లాడుతుండని.. పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటావా? అని హరీష్ కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు.ఈ సవాల్ కు హరీష్ సిద్ధమా..? అని ప్రశ్నించిన విషయం తెలిసిందే.. అయితే ఇవాళ హరీష్ , సీఎం సవావ్ ను స్వీకరించడంతో పార్టీ వర్గంల్లో చర్చకు దారితీస్తోంది. మరి హరీష్ రావు సవాల్ సీఎం స్వీకరిస్తారా? ఎల్లుండి అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం వద్దకు సీఎం వెళతారా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
*హాట్ కేకుల్లా శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదల చేసిన కాసేపట్లోనే..
తిరుమల కొండపై కొలువై ఉన్న కలియుుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు నిత్యం ప్రపంచ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. అయితే.. నడిచి వెళ్లలేని వారికోసం టీటీడీ ప్రత్యేక దర్శన టికెట్లు జారీ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను.. టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. తాజాగా జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను నేడు ఉదయం 10 గంటలకు విడుదల చేయగా.. టికెట్లను హాట్ కేకుల్లా భక్తులు బుక్ చేసుకున్నారు. అంగప్రదక్షిణం టోకెన్లను విడుదల చేసిన 4 నిమిషాల్లోనే భక్తులు పొందారు. 20 నిముషాల వ్యవధిలో వయోవృద్దులు, వికలాంగుల దర్శన టికెట్లను భక్తులు బుక్ చేసుకున్నారు. గంటా 55 నిమిషాల వ్యవధిలో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు అన్ని అయిపోయాయి. అలాగే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొస్తారు. ఇక.. శ్రీవారి సేవ కోటాను 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ కోటాను మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.కాలినడకన వెళ్లలేని వారు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది. చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్నవారికి ఈ అవకాశం ఎంతో మేలు చేస్తుంది. మీరు టికెట్లు బుకు చేసుకోవాలని అనుకుంటే.. https://tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లండి. ఇందులో ప్రత్యేక దర్శన టికెట్లతో పాటు మరిన్ని సేవలూ బుక్ చేసుకోవచ్చు.
*కరీంనగర్ లో విషాదం.. ఈతకు వెళ్లి తండ్రి కొడుకులు మృతి
కరీంనగర్ లో విషాదం జరిగింది. ఈతకు వెళ్లి తండ్రి కొడుకులు మృతి చెందిన ఘటన కుటుంబంలో విషాదం నింపింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చునుర్ గ్రామంలో చాడ రంగారెడ్డి కుటుంబం నివాసం ఉంటుంది. చాడ రంగారెడ్డికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చాడ రంగారెడ్డి గుండ్లపల్లి లోని ఎస్ఆర్ కే స్కూల్ కరస్పాండెంట్ పనిచేస్తున్నాడు. పెద్ద కుమారుడు కుమార్ జయ కౌసిక్ రెడ్డి 8 వ తరగతి,చిన్న కుమారుడు ఓమ్ జయ్ చైతన్య ఆనంద రెడ్డి 4వ తరగతి చదువుతున్నారు. అయితే ఎండులు మండుతుండటంతో కుమారులిద్దరిని తీసుకుని లోయర్ మానేరు జలశయానికి తండ్రి తీసుకుని వెళ్లాడు. అక్కడ ఇద్దరు కొడుకులను తీసుకుని ఈత కోసం నీటిలో దిగాడు. అయితే కాసేపు బాగానే ఇద్దరి పిల్లలతో నీటిలో ఆడుతూ గడిపిన తండ్రికి ఇంతలోనే చిన్నకొడుకు చిన్న కుమారుడు ఓమ్ జయ్ చైతన్య ఆనంద రెడ్డి నీటిలో మునిగిపోతూ కేకలు వేశాడు. అక్కడే వున్న తండ్రి రంగారెడ్డి చిన్న కొడుకును కాపాడేందుకు వెళ్లాడు. అయితే కొడుకును కాపాడే ప్రయత్నంలో తండ్రి, కొడుకులు ఇద్దరు నీటిలో మునిగిపోయారు. అక్కడే వున్న పెద్ద కుమారుడు కుమార్ జయ కౌసిక్ రెడ్డి భయంతో ఈత కొడుతూ గడ్డవద్దకు చేరుకున్నాడు. నాన్న, తమ్ముడు అంటూ గట్టిగా కేకలు వేసినా అక్కడ పరిసర ప్రాంతంలో ఎవరు లేకపోవడంతో కాపాడేందుకు ఎవరు రాలేదు. దాంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తన కళ్ల ఎదుట తండ్రి, తమ్ముడు ప్రాణాలు కోల్పోతున్న కాపాడేలేక నిస్సాహాయ స్థితిలో పెద్ద కుమారుడు కౌసిక్ ఉండిపోయాడు. ఇక చేసేది ఏమీలేక కుంటుంబ సభ్యులకు ఫోన్ చేసి జరిగిన సంఘటన గురించి తెలిపాడు. దీంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన లోయర్ మానేరు వద్దకు చేరుకున్నారు. జలాశయంలో ఇద్దరు తండ్రి, కొడుకు విగతజీవిగా చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానిక సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
*రేపు రాష్ట్రానికి అమిత్ షా.. సిద్దిపేటలో బహిరంగ సభ
పార్లమెంట్ ఎన్నికలపై కమలం పార్టీ సీరియస్ ఫోకస్ పెట్టింది. బీజేపీ అగ్రనేతలు ఒకరి తర్వాత ఒకరు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో రేపు (గురువారం) కేంద్రమంత్రి అమిత్ షా రానున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేటలో భారీ బహిరంగ సభ జరగనుంది. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘానందరావుకు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. తెలంగాణలో ఐదు బహిరంగ సభల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. కేంద్రమంత్రి అమిత్ షా గురువారం తెలంగాణ పర్యటనకు వస్తున్నారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో గురు, శుక్రవారాల్లో బన్సాల్ పర్యటిస్తారని, పెద్దఎత్తున సభలు, సమావేశాల కంటే ఇంటింటి ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. మే 13 వరకు నిర్మాణాత్మకంగా ప్రచారం సాగుతుందని.. మరో రెండు వారాలు మాత్రమే ఉండడంతో తెలంగాణపై బీజేపీ హైకమాండ్ దృష్టి సారించింది. పార్టీ అగ్రనేతలు వరుసగా రాష్ట్రంలో పర్యటించనున్నారు. వారానికి మూడు లేదా నాలుగు సమావేశాలు జరగాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. సిద్దిపేటలో జరిగే భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ నెల 30, వచ్చే నెల 3, 4 తేదీల్లో తెలంగాణలో మోడీ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 30 న జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆందోల్ నియోజక వర్గంలో సభ, సాయంత్రం ఐటీ ఎంప్లాయీస్ తో శేరిలింగంపల్లి నియోజక వర్గంలో సమావేశంలో పాల్గొననున్నారు. 3న వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఒక సభ, భువనగిరి, నల్గొండ పార్లమెంట్ లను కలుపుతూ మరో సభ, వచ్చే నెల 4 న మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజక వర్గం నారాయణ్ పేట లో… చేవెళ్ల పార్లమెంట్ లో వికారాబాద్ లో సభలో మోడీ పాల్గొంటారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ నెలాఖరు లేదా మే 10న రాష్ట్రానికి వస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. జాతీయంగా ప్రచారానికి మోడీ, అమిత్ షా, నడ్డా, కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత సీఎంలు రాష్ట్రానికి రానుండటంతో.. 10 నుంచి 12 సీట్లు గెలుచుకోవడంపై నాయకత్వం దృష్టి సారించింది. కాగా, పార్టీ లోక్‌సభ అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమాలకు పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు హాజరుకానున్నారు.
*ఉక్రెయిన్‌కు సాయంగా.. రష్యాపైకి లక్షల సైన్యం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ తీవ్రరూపం దాల్చుతోంది. ఇప్పటి వరకు, పాశ్చాత్య దేశాలు, నాటో కూటమి ఉక్రెయిన్‌కు వెనుక నుండి సహాయం చేస్తున్నాయి. కానీ ఇప్పుడు NATO బహిరంగంగా రష్యాను ఎదుర్కోవడం ప్రారంభించింది. రష్యా సరిహద్దులో నాటో సైన్యం తన సైనిక ఉనికిని పెంచుకుంది. రష్యా, NATO మధ్య ముఖాముఖి ఘర్షణ ఎప్పుడైనా ప్రారంభం కావొచ్చు. దీనికి సంబంధించి రష్యా రక్షణ మంత్రి పెద్ద ప్రకటన చేశారు. రష్యా సరిహద్దులో 123,000 NATO సైనికులు ఉన్నారని తెలిపారు. ప్రమాదాన్ని చూసి రష్యా కూడా సన్నాహాలు పూర్తి చేసింది. నాటో సవాలును ఎదుర్కొనేందుకు, మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్ ప్రాంతాలను కూడా సైనిక జిల్లాలుగా అభివృద్ధి చేస్తున్నారు. తద్వారా ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా సులభంగా ఎదుర్కోవచ్చు. ఇటీవల, నాటో సభ్యులు ఫ్రాన్స్, జర్మనీ లిథువేనియాలో యుద్ధ విన్యాసాలు నిర్వహించాయి. దేశ సరిహద్దులో 33,000 మంది నాటో సైనికులు, 300 ట్యాంకులు, 800 సాయుధ వాహనాలు మోహరించినట్లు రష్యా రక్షణ మంత్రి సెర్గీ సోయిగు తన ప్రకటనలో తెలిపారు. కాగా 90,000 మంది నాటో సైనికులు వివిధ రకాల ఆధునిక ఆయుధాలతో కసరత్తుల పేరుతో లిథువేనియాకు వచ్చారు. NATO నుండి ఎలాంటి ముప్పు వచ్చినా ఎదుర్కోవడానికి మేము లెనిన్‌గ్రాడ్, సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో సైనిక జిల్లాను సృష్టించామని కూడా ఆయన తెలియజేశారు. లెనిన్‌గ్రాడ్-సెయింట్ పీటర్స్‌బర్గ్ ప్రాంతానికి 7000 ఆయుధాలను పంపినట్లు రష్యా రక్షణ మంత్రి సెర్గీ సోయిగు తెలిపారు. ఇది కాకుండా రష్యా రాజధాని మాస్కోలో కూడా 2400 ఆధునిక ఆయుధాలను మోహరించారు. అమెరికా ప్రతినిధుల సభ ఉక్రెయిన్‌కు 61 బిలియన్ డాలర్ల సాయం అందించాలని తీర్మానం చేసింది. ఆ తర్వాత చాలా మంది డెమొక్రాట్లు సభలో ఉక్రెయిన్ జెండాలు ఎగురవేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సహాయం నేరుగా రష్యాకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉక్రేనియన్ సైన్యానికి సహాయం చేస్తుంది.
*రేపు ఉప్పల్ లో ఐపీఎల్ మ్యాచ్.. మెట్రో, బస్సు సేవలు పొడిగింపు..
హైదరాబాద్ వాసులకు మెట్రో అధికారులు శుభవార్త అందించారు. రేపు (25న) ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ మైదానంలో రాయల్ ఛాలెంజర్ బెంగళూరు – సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. గురువారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ఉప్పల్ మార్గంలో మెట్రో రైలు సమయాన్ని పొడిగించారు. ఆ రోజు మెట్రో రైలు సర్వీసుల సమయాన్ని పొడిగించారు. నాగోల్, ఉప్పల్ స్టేడియం, ఎన్‌జీఆర్‌ఐ స్టేషన్ల నుంచి చివరి రైళ్లు మధ్యాహ్నం 12:15 గంటలకు బయలుదేరి 1:10 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని మెట్రో అధికారులు వెల్లడించారు. సాధారణంగా ఐపీఎల్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగినా హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక మరోవైపు ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు వచ్చే క్రికెట్ అభిమానుల రద్దీ దృష్ట్యా గురువారం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకు 60 అదనపు బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ బస్సులు అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులు ఏర్పాటు చేయనున్నారు.
*పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు!
ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు ఆల్‌టైం హైకి చేరిన విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా రూ. 75 వేల మార్క్‌కి చేరుకుంది. దీంతో కొనుగోలుదారులు పసిడి షాపుల వైవు చూడాలంటేనే భయపడిపోయారు. అయితే పెరుగుతూ పోయిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. గత నాలుగు రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. తగ్గుముఖం పట్టాయని సంతోషించే లోపే పసిడి రేట్స్ మళ్లీ షాక్ ఇచ్చాయి. మంగళవారం తులం బంగారంపై ఏకంగా రూ.1,400 తగ్గగా.. బుధవారం (ఏప్రిల్ 24) రూ.450 పెరిగింది. ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరూ. 66,600గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,650 వద్ద కొనసాగుతోంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,750గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,800 వద్ద కొనసాగుతోంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.66,600 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,650గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,300గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.73,420 వద్ద కొనసాగుతోంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.66,600 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,650గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,600గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,650గా కొనసాగుతోంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.66,600 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,650గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.66,600గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,650గా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,600 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,650 వద్ద కొనసాగుతోంది.
మరోవైపు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. బుధవారం కిలో వెండిపై రూ.100 తగ్గింది. నేడు బులియన్ మార్కెట్లో కిలో వెండి రూ.82,900గా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 82,900గా ఉంది. చెన్నైలో రూ.86,400 వద్ద వెండి ధర కొనసాగుతోంది. బెంగళూరులో కిలో వెండి రూ.82,500గా ఉండగా.. హైదరాబాద్, కేరళ, విజయవాడ, విశాఖపట్నంలో రూ.86,400 వద్ద కొనసాగుతోంది.