తెలంగాణలో 24 గంటల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య..
గాల్లో దీపాల్లా ఇంటర్ విద్యార్థుల జీవితాలు మారిపోయాయి. చదువు ఒత్తిళ్ళతో కొంత మంది, అనారోగ్య కారణాలతో మరి కొంత మంది స్టూడెంట్స్ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో ఇంటర్ విద్యార్ధులు తీసుకుంటున్న నిర్ణయాలతో తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రెండు వేర్వేరు కాలేజీల్లో ఒకే రోజు ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతుంది. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో హాస్టల్ విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. విద్యార్థుల ఆత్మహత్యల వెనక తల్లిదండ్రుల పాత్ర ఎంత వరకు ఉంది. స్టూడెుంట్స్ ఆత్మహత్యలకు తల్లిదండ్రుల తప్పు కూడా ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి. పేరెంట్స్ ఫాల్స్ ప్రెస్టేజ్ కు వెళ్లి.. పిల్లలను ఇబ్బంది పెడుతున్నారా?.. వాళ్ళ ఇష్టాలకు విలువ ఇవ్వకుండా.. పిల్లలను కన్విన్స్ చేయకుండా, ఒత్తిడి చేస్తున్నారా.? అనే అనుమానం కలుగుతుంది. ఇక, మేడ్చల్ పరిధిలోని అన్నోజిగూడలో గల నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ (ఎంపీసీ) చదువుతున్నాడు బనావత్ తనీష్. సోమవారం సాయంత్రం హాస్టల్ బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఉరి వేసుకున్నాడు. హుటాహుటీన సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. తనుష్ మృతితో కాలేజీ యాజమన్యంపై మృతుడి కుటుంబ సభ్యులు దాడి చేసేందుకు యత్నించారు. కాలేజీలో అధ్యాపకుల వేధింపుల కారణంగానే తమ కొడుకు ఆత్మహత్య చేసుకొని ఉంటాడని ఆరోపిస్తున్నారు. కాగా, నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం చిన్నతడం గ్రామానికి చెందిన ప్రజ్ఞారెడ్డి అనే స్టూడెంట్ ప్రగతినగర్‌లోని ఎన్‌ఎస్‌ఆర్ ఇంపల్స్ ఐఐటీ గల్స్ కళాశాలలో ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతుంది. అయితే, సోమవారం ఉదయం 9.30 గంటల సమయంలో సదరు విద్యార్థి తన హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని చనిపోయింది. విద్యార్థిని మృతిని దాచి పెట్టేందుకు యత్నించిన కాలేజీ యాజమాన్యం.. హుటా హుటిన ప్రజ్ఞారెడ్డి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించింది. దీంతో స్టూడెంట్ మృతిపై ఆమె తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేస్తున్నారు. ఒకే రోజు ఇద్దరు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంతో తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.
శ్రీశైలం దేవస్థానం ఈవో కీలక నిర్ణయం
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం ఈవో కీలక నిర్ణయం తీసుకున్నారు. రద్దీ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ సెలవులు, శని, ఆది, సోమ వారాల్లో అలంకార దర్శనం మాత్రమేనని ఆయన వెల్లడించారు. శని,ఆది, సోమ వారాల్లో, రద్దీ రోజుల్లో ఉదయాస్తమాన, ప్రదోషకాల, ప్రాతకాల, గర్భాలయ, సామూహిక అభిషేకాలు, స్పర్శ దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ ఉత్తర్వులు జారీ చేశారు. నిర్ధారించిన రోజులలో స్పర్శదర్శనం, అభిషేకాలు రద్దు వివరాలను వార్షిక క్యాలెండర్‌గా విడుదల చేయాలని నిర్ణయించారు.
టీడీపీలో చేరేందుకు ఆళ్ల నానికి లైన్ క్లియర్!
మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయ్యింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కీలకంగా వ్యవహరించిన ఆళ్ల నాని మూడు నెలల క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అప్పటినుంచి ఎవరికీ అందుబాటులో లేని ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆళ్ల నాని చేరికకు పార్టీ పెద్దలు అంగీకరించినట్లుగా సమాచారం. దీంతో నేడో ,రేపో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఏలూరు నుంచి నాలుగో సారి పోటీచేసి ఓటమి పాలైన ఆళ్ల నాని రాకను వేలూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2024ఎన్నికల్లో ఏలూరులో 60 వేలకు పైగా మెజారిటీతో గెలిచిన టీడీపీకి వైసీపీ నాయకుల అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. మరోపక్క నేడు, రేపు ఏలూరు జిల్లాలో ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలని టీడీపీ అధిష్ఠానం సూచించడంతో మాజీ మంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరిక తెలుగు తమ్ముళ్లలో కలవరం రేపుతోంది. ఇప్పటికే ఏలూరు నియోజకవర్గంలో వైసీపీని వీడి వచ్చిన నేతలు టీడీపీలోనే కొనసాగుతున్నారు. వైసీపీలో డిప్యూటీ సీఎంగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ,ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, విభజిత ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీగా పలు పదవులు గతంలో నిర్వహించారు.
అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి జంట ఆత్మహత్య
విశాఖలోని గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కిరెడ్డిపాలెంలో ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. వెంకటేశ్వర కాలనీలో అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి జంట ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా చెప్తున్నారు. మృతులు పిల్లి దుర్గారావు, సాయి సుష్మితలుగా గుర్తించారు. ఇద్దరూ అమలాపురానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అపార్ట్‌మెంట్ మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఏడాది నుండి వీరిద్దరు లివింగ్ రిలేషన్‌లో ఉంటున్నారు. గతంలో యువతి హైదరాబాద్‌లో ఫార్మా కంపెనీలో పని చేసేది. మృతుడు కేటరింగ్ ఓనర్‌గా చేస్తున్నాడు. మూడు నెలల క్రితం నుండి ఈ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండడంతో ఇరువురి మధ్య గొడవ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు పోలీసులు.
ప్రేమజంట ఆత్మహత్యకి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.. సూసైడ్ చేసుకోడానికి ముందు ఇద్దరు మధ్య వాగ్వాదం జరిగినట్లు సంఘటన స్థలంలో ఇంట్లో ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.. రూమ్‌లో మద్యం బాటిల్స్ ఉండడం, టీవీ రిమోట్, గాజు గ్లాస్ పగలగొట్టి ఉన్నాయి. ఏడాది నుండి లివింగ్ రిలేషన్ లో ఉండడం సడెన్‌గా సూసైడ్ చేసుకోవడం పట్ల పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఇద్దరు ఒకే సారి సూసైడ్ చేసుకున్నారా యువతి సూసైడ్‌కి పాల్పడిన తర్వాత యువకుడు భయంతో ఆత్మహత్య చేసుకున్నాడా, లేదంటే ఇంకేదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తమిళనాడులో ఫెంగల్ తుఫాన్ బీభత్సం.. సీఎం స్టాలిన్కి ప్రధాని మోడీ ఫోన్
తమిళనాడులోని విల్లుపురం, సేలం, తిరువన్నమలై, కడలూరులో ఫెంగల్ తుఫాన్ ధాటికి వరద బీభత్సం సృష్టిస్తుంది. ఈ వరదలకు ఊర్లకు ఊర్లో మునిగిపోయాయి. కోయంబత్తూరు నుంచి బెంగళూరుకు, సేలం నుంచి బెంగళూరుకు.. విల్లుపురం నుంచి బెంగళూరు- చెన్నై వెళ్లే జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తుంది. 8 గంటలుగా ఆయా జాతీయ రహదారులపై వేలాదిగా నిలిచిపోయిన వాహనాలు. కాగా, వాహనాలు గంటల తరబడి నిలిచిపోవడంతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక, ఆహారాన్ని అందించాలంటూ జాతీయ రహదారిపై ప్రయాణికులు ధర్నాకు దిగారు. మూడు రోజులుగా నీటలో ఉన్న సేలం, విల్లుపురం బస్టాండ్ లు.. వరదల కారణంగా లోతట్టు కాలనీల్లో ఇంకా పూర్తిస్థాయిలో కొనసాగని సహాయక చర్యలు. ఒకటిన్నర రోజుగా వరదలోనే మూడు జిల్లాల్లోని వేలాది మంది కుటుంబాలు ఉండిపోయాయి. ఇక, మరోవైపు.. తమిళనాడు సీఎం స్టాలిన్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో వరదల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. తమిళనాడుకు సహాయ, సహకారాలు అందిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.
చరిత్ర సృష్టించిన ఎలోన్ మస్క్.. తొలిసారిగా 350బిలియన్ డాలర్లు దాటిన సంపద
ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్త ఎలోన్ మస్క్. ప్రపంచంలోని ఏ ఇతర వ్యాపారవేత్త ఊహించని సంపదకు చేరుకున్నాడు. ఎలోన్ మస్క్ మొత్తం సంపద ఇప్పుడు 350 బిలియన్ డాలర్లు దాటింది. ఒక బిలియనీర్ సంపద రికార్డు దశకు చేరుకోవడం ఇదే తొలిసారి. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ డేటా ప్రకారం.. ఎలోన్ మస్క్ సంపదలో 10 బిలియన్ డాలర్లకు పైగా పెరుగుదల ఉంది. విశేషమేమిటంటే ప్రస్తుత సంవత్సరంలో అతని నికర విలువ 124 బిలియన్ డాలర్లు పెరిగింది. డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత, ఎలోన్ మస్క్ నికర విలువ వేగంగా విస్తరించింది. అప్పటి నుండి, అతని నికర విలువ 89 బిలియన్ డాలర్లు పెరిగింది. విశేషమేమిటంటే నవంబర్ 4 నుంచి ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా షేర్లు 47 శాతానికి పైగా పెరిగాయి. ఎలోన్ మస్క్ మొత్తం నికర విలువ 350 బిలియన్ డాలర్లకు మించి ఎంత పెరిగిందో కూడా చూద్దాం. ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్త ఎలోన్ మస్క్ సంపదలో పెరుగుదల కనిపించింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ డేటా ప్రకారం, అతని మొత్తం నికర విలువ ఇప్పుడు 353 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇప్పటి వరకు ఏ బిలియనీర్ కూడా దీన్ని చేయలేకపోయాడు. కొద్ది రోజుల క్రితం తన పాత రికార్డును బద్దలు కొట్టాడు. విశేషమేమిటంటే 300 బిలియన్ డాలర్ల మార్కును దాటిన ఏకైక వ్యక్తి ఎలోన్ మస్క్. అతను నవంబర్ 2021లో మొదటిసారి చేశాడు. ఇప్పుడు అతను నవంబర్ 2024లో చేసాడు. ఇదే జోరు కొనసాగితే ఈ ఏడాది చివరి నాటికి ఎలాన్ మస్క్ 400 బిలియన్ డాలర్ల బెంచ్‌మార్క్‌ను అధిగమించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ డేటా ప్రకారం.. సోమవారం ఎలోన్ మస్క్ మొత్తం సంపదలో 10.3 బిలియన్ డాలర్లు లేదా 4.3 శాతం పెరుగుదల ఉంది. అయితే, ప్రస్తుత సంవత్సరంలో అతని మొత్తం నికర విలువ 124 బిలియన్ డాలర్లు అంటే 54 శాతానికి పైగా పెరిగింది. గత ఒక నెల నుండి అంటే నవంబర్ 5 నుండి, ఎలోన్ మస్క్ మొత్తం నికర విలువలో 89 బిలియన్ డాలర్లు పెరిగాయి. నవంబర్ 5న, ఎలోన్ మస్క్ మొత్తం నికర విలువ $264 బిలియన్లు.
పాఠశాలలో టియర్ గ్యాస్ దాడి.. ఆస్పత్రిలో చేరిన 22 మంది పిల్లలు
జర్మనీ రాజధాని బెర్లిన్‌లోని ఒక ప్రాథమిక పాఠశాలలో గుర్తుతెలియని దాడి చేసిన వ్యక్తి టియర్ గ్యాస్ విడుదల చేయడంతో దాదాపు 22 మంది పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. స్థానిక మీడియా ప్రకారం.. ఈ దాడిలో ఒక పిల్లవాడి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం 43 మంది శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. వీబెన్సీ స్కూల్ ప్రాంతంలో నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఉదయం పాఠశాలలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు విషవాయువును పిచికారీ చేశారని పోలీసులను ఉటంకిస్తూ మీడియా కథనాలు చెబుతున్నాయి. దాడి చేసిన వ్యక్తి యువకుడా లేక చిన్నాడా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. క్లాస్ రూమ్ డోర్ నుంచి టియర్ గ్యాస్ స్ప్రే చేసినట్టు అగ్నిమాపక శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ బృందం వెంటనే పాఠశాల మొత్తాన్ని పరిశీలించి గాలిలో ఉన్న టియర్‌గ్యాస్‌ను తొలగించి తరగతులు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అంతకుముందు నవంబర్ నెలలో చైనాలోని ఓ పాఠశాలలో కత్తితో దాడి జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు. యిక్సింగ్ నగరంలోని వుక్సీ వొకేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీలో ఈ దాడి జరిగింది. ఘటనా స్థలంలోనే దాడి చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ సోమవారం ఉక్రెయిన్ పర్యటనకు వచ్చారు. రెండున్నర సంవత్సరాల తర్వాత అతను ఉక్రెయిన్ చేరుకున్నాడు. కొద్ది వారాల క్రితమే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో స్కోల్జ్ ఫోన్‌లో మాట్లాడినందుకు ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ విమర్శించారు. అమెరికాలో అధికార మార్పిడి జరిగి జనవరిలో డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో ఆయన ఈ చర్య తీసుకున్నారు.
ఫ్యాన్స్ ను కంగారు పెడుతున్న హీరో సూర్య నిర్ణయం
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఆయన నటించిన కంగువా సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఐతే ఆ సినిమా విడుదలకు ముందున్న అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. శివ డైరెక్షన్ లో రూపొందించిన కంగువ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఐతే ఆ సినిమా డిజాస్టర్ నుంచి వెంటనే తేరుకున్న సూర్య తన తదుపరి సినిమా మూడ్ లోకి వచ్చేశాడు. సూర్య 44వ సినిమా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. రెండేళ్ల తర్వాత పూజా హెగ్దే దక్షిణాది చిత్ర పరిశ్రమలో అందుకున్న ఆఫర్ ఇదే. ఇక ఈ సినిమా తర్వాత సూర్య 45వ సినిమా ఆర్.కె బాలాజి డైరెక్షన్ లో ఫిక్స్ చేసుకున్నాడు. వీజేగా అలరించిన బాలాజీ డైరెక్టర్ గా కూడా సక్సెస్ అయ్యాడు. సూర్యతో బాలాజీ చేస్తున్న సినిమా పై అభిమానులు భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు. ఐతే ఈ సినిమా తెలుగు సినిమా స్పూర్తితో వస్తుందని తెలుస్తోంది. అది కూడా ఒక ఫ్లాప్ సినిమా కథను అటు ఇటు మార్చి చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మాస్ మహరాజ్ రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమా వీర. 2011 లో విడుదల అయిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఐతే బాలాజీ సూర్య కాంబో సినిమా కాస్త అటు ఇటుగా ఇలాంటి కథతోనే వస్తున్నారని తెలుస్తోంది. మరి రవితేజ సినిమా ఫ్లాప్ అని తెలిసినా సరే మళ్లీ అలాంటి ప్రయత్నం అంటే ఈ సారి ప్లానింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవాచ్చు. సూర్య 45వ సినిమా అభిమానులను దృష్టిలో ఉంచుకుని వారికి ఫీస్ట్ అందించేలా ప్లాన్ చేస్తుంది చిత్రయూనిట్. కోలీవుడ్ స్టార్ సూర్యకు తెలుగులో కూడా ఫాన్ బేస్ ఉందన్న సంగతి తెలిసిందే. సూర్య చేసే ప్రతి సినిమా ఇక్కడ కూడా రిలీజ్ అవుతాయి. గజిని సినిమా నుంచి సూర్య తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. సూర్య సినిమా అంటే అయన తెలుగు ఫ్యాన్స్ అలర్ట్ గా ఉంటారు. ఐతే కొన్నాళ్లు కొత్త ప్రయోగాలు, సామాజిక స్పృహ ఉన్న సినిమాలు చేసిన సూర్య ఇక మీదట అభిమానులు కోరుకునే సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడట. అందుకే కార్తీక్ తో చేస్తున్న సినిమా కూడా ఫుల్ మాస్ అప్పీల్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. సూర్య కార్తీక్ సుబ్బరాజు కాంబో సినిమా నెక్ట్స్ ఇయర్ వేసవిలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఐతే బాలాజీ సినిమా కూడా 2025 ఎండింగ్ కి వస్తుందని టాక్.
అడిలైడ్ టెస్టు.. టీమిండియాకు గుడ్ న్యూస్!
భారత జట్టుకు శుభవార్త. వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వచ్చిన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లాడు. ప్రస్తుతం అడిలైడ్‌లో ఉన్న భారత జట్టుతో కలిశాడు. టీమిండియా ఆటగాళ్ల సన్నద్ధతను దగ్గరుండి చూసుకుంటున్నాడు. అదే సమయంలో రెండో టెస్టు తుది జట్టుపై ప్రణాళికలు మొదలు పెట్టాడు. యశస్వీ జైస్వాల్‌తో కలిసి ఎవరిని ఓపెనర్‌గా పంపాలని మల్లగుల్లాలు పడుతున్నాడు. అయితే ఈ విషయంలో ఇప్పటికే గంభీర్ ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెర్త్ టెస్టు ముగిసాక బీసీసీఐ అనుమతి తీసుకుని గౌతమ్ గంభీర్ భారత్‌కు వచ్చాడు. అడిలైడ్‌లో జరిగే డే/నైట్ టెస్టుకు ముందే తాను తప్పనిసరిగా అందుబాటులో ఉంటానని బీసీసీఐకి చెప్పాడు. చెప్పినట్టుగానే మూడు రోజుల ముందు ఆసీస్ చేరుకుని.. జట్టు సన్నాహకాలను పరిశీలించాడు. గౌతీ గైర్హాజరీలో ప్రైమ్ మినిష్టర్స్ XI తో జరిగిన వార్మప్ మ్యాచ్‌కు అసిస్టెంట్ కోచ్‌లు అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్.. బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్, ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ టీమ్ కోచింగ్ బాధ్యతలను చూసుకున్నారు. ఐదు టెస్టు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది. ఈ డే/నైట్ టెస్టు భారత కాలమాన ప్రకారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభం అవుతుంది. వ్యక్తిగత కారణాలతో రోహిత్ శర్మ, గాయంతో శుభ్‌మన్ గిల్ తొలి టెస్టుకు దూరం కాగా.. ఇద్దరు ఇప్పుడు అందుబాటులోకి వచ్చారు. యశస్వీ జైస్వాల్‌తో కలిసి రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లలో ఎవరు ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తారో చూడాలి. కోచ్ గౌతమ్ గంభీర్ తుది జట్టుపై ఏ నిర్ణయం తీసుకుంటాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
గోల్డ్ ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధర!
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నిత్యం మారుతుంటాయి. రేట్స్ ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, డాలర్ విలువ లాంటివి ధరలను ప్రభావితం చేస్తాయి. అయితే గత కొన్ని రోజులుగా గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. ఇటీవలి రోజుల్లో తగ్గుతూ పెరుగుతున్నాయి. నేడు గోల్డ్ ప్రియులకు షాక్ ఇస్తూ భారీగా పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.400 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.430 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (డిసెంబర్ 3) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,300 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.77,780గా ఉంది. మరోవైపు ఇటీవలి రోజుల్లో వెండి ధరల్లో పెద్దగా మార్పులు లేవు. గత కొన్ని రోజులుగా స్థిరంగా లేదా తగ్గుతూ వస్తోంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.91,000గా నమోదయింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.99,500గా ఉంది. అత్యల్పంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో రూ.91,000గా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.71,300
విజయవాడ – రూ.71,300
ఢిల్లీ – రూ.71,450
చెన్నై – రూ.71,300
బెంగళూరు – రూ.71,300
ముంబై – రూ.71,300
కోల్‌కతా – రూ.71,300
కేరళ – రూ.71,300
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.77,780
విజయవాడ – రూ.77,780
ఢిల్లీ – రూ.78,930
చెన్నై – రూ.77,780
బెంగళూరు – రూ.77,780
ముంబై – రూ.77,780
కోల్‌కతా – రూ.77,780
కేరళ – రూ.77,780
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.99,500
విజయవాడ – రూ.91,000
ఢిల్లీ – రూ.91,000
ముంబై – రూ.91,000
చెన్నై – రూ.99,500
కోల్‌కతా – రూ.91,000
బెంగళూరు – రూ.91,000
కేరళ – రూ.99,500