శ్రీశైలానికి వరద ఉధృతి.. ఆరోసారి గేట్లు ఎత్తిన అధికారులు
కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది.. దీంతో.. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు నీటితో కళకళలాడుతున్నాయి.. ఇప్పటికే శ్రీశైలం జలాశయం గేట్లు ఐదు సార్లు ఎత్తి.. దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేసిన అధికారులు.. మరోసారి శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తారు.. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుండగా.. ఈ సంవత్సరంలో 6వ సారి రేడియల్ క్రెస్టు గేట్లను ఎత్తారు.. శ్రీశైలం డ్యామ్ ఒక గేటును 10 అడుగులు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.. ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్‌కు ఇన్ ఫ్లో రూపంలో 1,96,177 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. ఒక గేటు ద్వారా.. జలవిద్యుత్ కేంద్రాల నుంచి మొత్తంగా ఔట్ ఫ్లో రూపంలో 95,802 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.90 అడుగులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 215.3263 టీఎంసీలుగా ఉంది.. ఇక, కుడి గట్టు జల విద్యుత్ కేంద్రంతో పాటు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలోనూ విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తు్న్నారు అధికారులు.. అయితే, ఆ తర్వాత 3 గేట్లు 10 అడుగులు మేర ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు.. దీంతో.. ఔట్ ఫ్లో 1,51,860 క్యూసెక్కులకు చేరింది..
అల్లిక కళ.. స్వాప్నికకు గిన్నిస్ బుక్‌లో చోటు
అల్లికల కళలో ఏపీకి చెందిన స్వాప్నికకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది.. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన స్వాప్నిక.. తన అమ్మమ్మ వద్ద అల్లికలను నేర్చుకొని వాటికి సంబంధించిన మెళకువలను అవలీలగా పసిగట్టి కొత్త అల్లికల గురించి ఆలోచించేది, వాటికి సంబంధించిన కొత్త రికార్డు గురించి తెలుసుకోవడం అంటే స్వాప్నికకు ఇష్టం.. క్రిస్మస్ డెకరేషన్.. మొదలైన వాటితో రికార్డ్ సృష్టించారు. ఎంఐక్యూ’ లాంటి సంస్థల రికార్డుల గురించి తెలుసుకునే క్రమంలో స్వాప్నికకు రికార్డ్ లపై ఆసక్తిమొదలైంది. ‘గిన్నిస్ బుక్ రికార్డ్’ అంటే ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ఉండాలని దృష్టి పెట్టింది. విశాఖపట్టణానికి చెందిన ‘మహిళా మనో వికాస్ క్రాఫ్స్ అండ్ క్రియేషన్’ సంస్థ క్రోచెట్సు (అల్లిక)కు సంబంధించి నిర్ణీత వ్యవధిలో అత్యధిక కళాకృతులు తయారు చేయాలని సవాలు ఇచ్చింది.
తీవ్ర రూపం దాల్చిన దానా తూఫాన్..
దానా తూఫాన్ తీవ్ర రూపం దాల్చింది.. తీవ్ర తూఫాన్ గా మారి ముంచుకొస్తుంది.. రేపు వేకువజామున తీరం దాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ముంచుకొస్తున్న తీవ్ర తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది.. రేపు వేకువజామున పూరీ-సాగర్ ఐలాండ్స్ మధ్య భితార్కానికా మరియు ధమ్రా సమీపంలో తీరం దాటనుంది. ప్రస్తుతానికి పారాదీప్ కు 280 కిలోమీటర్లు.. సాగర్ ఐలాండ్స్ కు 370 కిలో మీటర్లు.. ధమ్రాకు 310 కిలోమీటర్ల దూరంలో దానా తీవ్ర తుప్‌న్ కేంద్రీకృతం అయిఉంది.. దానా దాటికి అన్ని ప్రధాన ఓడరేవుల్లో ఇప్పటికే రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు..తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 120 కిమీ వేగంతో ఈదురు గాలులు భీభత్సమ్ సృష్టించనున్నాయి.. మరోవైపు దానా తీవ్ర తుఫాన్ ఎఫెక్ట్‌తో తూర్పు కోస్తా రైల్వే అప్రమత్తమైంది.. ఈ రోజు విశాఖ నుండి భువనేశ్వర్, కోక్‌కతావైపు బయలుదేరే 42 రైళ్లు రద్దు రద్దు చేసింది.. ఇక, రేపు 26 ట్రైన్స్ రద్దు చేసినట్టు తూర్పుకోస్తా రైల్వే ప్రకటించింది.. తుఫాన్ తీవ్రతను బట్టి మరిన్ని రైళ్లు రద్దు చేసే ఆవకాశం ఉందంటున్నారు అధికారులు.. అయితే, రైళ్లు రద్దు చేయడంతో స్టేషన్ వద్ద పడిగాపులు కాస్తున్నారు ప్రయాణికులు..
గనుల్లో తవ్వకాలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్.. షరతులు వర్తిసాయి..!
గనుల్లో తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అక్రమాలు జరగని గనుల్లో తవ్వకాలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. చిన్నపాటి అక్రమాలు జరిగితే పెనాల్టీలు విధించి తవ్వకాలకు పర్మిషన్లు ఇవ్వాలని పేర్కొంది ప్రభుత్వం. భవిష్యత్తులో అక్రమాలకు ఆస్కారం లేకుండా సీసీ కెమెరాలు, నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించింది.. నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న తర్వాతే గనుల్లో తవ్వకాలకు పర్మిషన్లు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.. గనుల్లో తవ్వకాలు పూర్తిగా నిలిచిపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని ప్రభుత్వానికి నివేదికలు అందాయి.. ముడి సరుకు నిలిచిపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. అయితే, గత ప్రభుత్వంలో గనుల్లో తవ్వకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో రాష్ట్ర వ్యాప్తంగా గనుల్లో తవ్వకాలను నిలిపివేసింది కూటమి ప్రభుత్వం.. సిలికా, క్వార్ట్జ్ గనుల తవ్వకాల్లో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై విచారణ చేపట్టింది.. అయితే, అధికారుల నుంచి నివేదిక అందిన తర్వాత.. అక్రమాలు జరగని గనుల్లో తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది..
యూపీ ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులు సైకిల్ గుర్తుపై పోటీ..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉప ఎన్నికలపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. రాబోయే బై ఎన్నికల్లో మొత్తం తొమ్మిది స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు అందరూ తమ పార్టీ ఎన్నికల గుర్తు ‘సైకిల్’పైనే పోటీ చేస్తారని వెల్లడించారు. కూటమి నిర్ణయాన్ని సీట్ల పంపకానికి సంబంధించిన విషయమేమీ తెలియదు.. విజయం సాధించడం ఒకటే కీలకమని పేర్కొన్నారు. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు ఐక్యంగా ముందుకు వెళ్తున్నాయి.. భారీ విజయం కోసం తాము కలిసి పోరాటం చేస్తున్నాం.. ఈ ఉప ఎన్నికలో ఇండియా కూటమి విజయం కొత్త అధ్యాయాన్ని లిఖించబోతుందన్నారు. అందరి మద్దతుతో ఉప ఎన్నికలో అన్ని సీట్లలో గెలుస్తామని అఖిలేష్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
అవమానంగా భావిస్తున్న.. ఖర్గే, రాహుల్ గాంధీ లకు జీవన్ రెడ్డి లేఖ..
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను జీర్ణించుకోలేకపోతున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను నమ్మ్ముకున్న నా కాంగ్రెస్ పార్టీ నుండి తనకు ఇంత అగౌరవం.. అవమానకరంగా భావిస్తున్న అన్నారు. గాంధీభవన్‌లో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు లేఖ రాసినట్లు జీవన్‌రెడ్డి తెలిపారు. నేను మానసిక వేదనలో ఉన్నాను.. తీవ్ర మానసిక వేదనతో లేఖ రాస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడకుండా నైతిక విలువను పాటించాలన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ఫలితాలను జీర్ణించుకోలేకపోతున్నారు. సంఖ్యాబలంతో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ ఇచ్చారు. అయినా కూడా తాము పార్టీ ఫిరాయింపులేనని జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుత పరిణామాలు జీర్ణించుకోలేక మానసిక ఆవేదనలో ఉన్న అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎంఎల్ఏ లకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంఎల్ఏ ల అందరూ పార్టీని ఫిరాయింపు లో కీలకంగా పనిచేసిన పోచారం శ్రీనివాసరెడ్డి నీ కూడా పార్టీలో చేర్చుకున్నారని తెలిపారు.
మూసీ పేరుతో భారీ అవినీతి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్..
మూసీ బాధితులపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరును కేంద్ర మంత్రి బండి సంజయ్ తప్పు బట్టారు. మూసీ పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున అవినీతికి తెరదీసిందని మండిపడ్డారు. మూసీ బాధితుల పక్షాన కోసం రేపు (25)న ఇందిరాపార్క్ వద్ద బీజేపీ మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్ల కూల్చివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. మూసీ పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున అవినీతికి తెరదీసిందని మండిపడ్డారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ పార్టీ రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి ఏటీఎంలా వాడుకుందని ఆరోపించారు. రూ.లక్షన్నర కోట్లు అప్పు చేసి కాంగ్రెస్ కు ఏటీఎంలాగా మార్చాలనుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందన్నారు. గత పాలకులు చేసిన దాదాపు రూ.6 లక్షల కోట్ల పైచిలుకు అప్పులకు 10 నెలల్లోనే రూ.60 వేల కోట్లు వడ్డీల రూపంలో చెల్లిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.
సల్మాన్ ఖాన్ బెదిరింపుల కేసులో కూరగాయల వ్యాపారి అరెస్ట్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ఇటీవల కాలంలో వరుస హత్య బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో ఇటీవల జరిగిన బిగ్ బాస్ షో షూటింగ్ సమయంలో కూడా సల్మాన్ ఖాన్ భారీ భద్రత నడుమ పాల్గొన్నారు. ఈ సమయంలో 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. వచ్చిన మెసేజ్ పై ముంబై పోలీసులు దర్యాప్తు చేయగా.. అది కూరగాయల వ్యాపారి చేసిన పని అని వెల్లడైంది. ఝార్ఖండ్ లోని జంషెడ్ పూర్ కు చెందిన 24 ఏళ్ల కూరగాయల వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కష్టపడకుండా తక్కువ టైంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో అతను ఈ పని చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, నటుడు సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలంటే.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తప్పించుకోవలనుకుంటే.. రూ.5 కోట్లు ఇవ్వాల్సిందే.. లేకపోతే.. మాజీ మంత్రి బాబా సిద్ధిఖీకి పట్టిన గతే సల్మాన్ కు పడుతుంది. ఈ బెదిరింపుల్ని లైట్ తీసుకోవద్దని సదరు కూరగాయల వ్యాపారి హెచ్చరికలతో కూడిన మెసేజ్ ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ నెంబర్ కు పంపించాడు. ఆ తర్వాత తాను కావాలని బెదిరింపుల మెసేజ్ చేయలదేని.. అనుకోకుండా అలా చేశాను.. క్షమించాలని మరో మెసేజ్ పెట్టాడు. ఇక, విచారణను వేగవంతం చేసిన పోలీసులు.. ఝార్ఖండ్ పోలీసుల సహాయంతో జంషెడ్ పూర్ కు చెందిన 24 ఏళ్ల కూరగాయల వ్యాపారిని అరెస్ట్ చేశారు.
సౌత్ కొరియా అధ్యక్షుడి కార్యాలయ పరిసరాల్లో చెత్త బెలూన్.. కిమ్పై ఆగ్రహం
ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం కొనసాగుతుంది. అలాంటిది ఇరు దేశాల సరిహద్దులో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. అక్కడ ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే, గత కొద్దికాలంగా ఇరు దేశాల మధ్య ‘చెత్త బెలూన్ల’ ఘర్షణ కొనసాగుతుంది. తాజాగా కిమ్ జోంగ్ ఉన్ సర్కార్ వదిలిన చెత్త బెలూన్ ఏకంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని అధ్యక్ష కార్యాలయ ప్రాంగణంలో పడిందని అధికారులు తెలిపారు. సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యెల్, ఆయన సతీమణిని అపహాస్యం చేసేలా అందులో కరపత్రాలు ఉన్నాయని స్థానిక మీడియా కథనాలు ప్రసారం చేసింది. ఇక, గతంలో కూడా దక్షిణ కొరియా అధ్యక్షుడి కార్యాలయంపై ఉత్తర కొరియా వ్యర్థాలతో కూడిన బెలూన్లు జార విడిచింది. వాటి వల్ల ఏలాంటి ప్రమాదం సంభవించనప్పటికి.. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా పీపీఈ కిట్లు ధరించిన సిబ్బంది ఆ చెత్తను అక్కడి నుంచి తొలగించారు. ఈ వరుస ఘటనలతో సౌత్ కొరియా తీవ్ర స్థాయిలో నార్త్ కొరియా అధనేత కిమ్ జోంగ్ ఉన్ పై మండిపడింది. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవల్సి వస్తుందని చెప్పుకొచ్చారు.
ఫ్లిప్‌కార్ట్‌లో క్రేజీ ఆఫర్.. 12 వేలకే ‘టెక్నో పోవా 6 నియో’!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. ‘బిగ్ దీపావళి’ పేరుతో సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 21 మొదలైన ఈ సేల్.. అక్టోబర్ 31 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల వస్తువులపై ఫ్లిప్‌కార్ట్ కళ్లు చెదిరే డిస్కౌంట్స్ అందిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు ఉంది. టెక్నో కంపెనీకి చెందిన పోవా 6 నియో ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. టెక్నో పోవా 6 నియోపై ఉన్న ఆఫర్, ఫీచర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్లిప్‌కార్ట్‌లో టెక్నో పోవా 6 నియో స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియెంట్ అసలు ధర రూ.15,999గా ఉంది. బిగ్ దీపావళి సేల్ సందర్భంగా ఈ ఫోన్‌పై 18 శాతం తగ్గింపు ఉంది. తగ్గింపు అనంతరం రూ.12,999కి పోవా 6 నియోని సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ను ఎస్‌బీఐ బ్యాంక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. గరిష్టంగా రూ.750 మీకు లభిస్తుంది. దీంతో ఈ ఫోన్‌ను దాదాపుగా రూ.12 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్ కూడా ఉంది.
చరిత్ర సృష్టించిన రవిచంద్రన్ అశ్విన్.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా రికార్డు!
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా యాష్ రికార్డుల్లోకెక్కాడు. పూణే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అశ్విన్ రెండు వికెట్స్ పడగొట్టడంతో ఈ రికార్డు సొంతమైంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అశ్విన్.. ఇప్పటి వరకు డబ్ల్యూటీసీ మ్యాచుల్లో 188 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ జాబితాలో ఇప్పటి వరకు తొలి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లైయన్ (187)ను ఆర్ అశ్విన్ అధిగమించాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా పేసర్లు పాట్ కమిన్స్ (175), మిచెల్ స్టార్క్ (147) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. స్టువర్ట్ బ్రాడ్ (134) ఐదవ స్థానంలో కొనసాగుతున్నాడు. టాప్-5లో ముగ్గురు ఆసీస్ ప్లేయర్లే కావడం గమనార్హం. 2019లో డబ్ల్యూటీసీని ఐసీసీ ప్రారంభించగా.. 39 టెస్టులు ఆడిన అశ్విన్ 188 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 11 సార్లు 5 వికెట్లు సాధించాడు. లైయన్ 43 టెస్టుల్లో 187 వికెట్లు పడగొట్టాడు.
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు..
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోణలు నేపథ్యంలో నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిన విషయమే. ముంబైలోని ఓ హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారం చేసాడని, ఈ విషయాన్ని బయటికి ఎవరికీ చెప్పవద్దు అంటూ బెదిరించడని, మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చెసాడని నార్సింగి పోలీసులకు జానీ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసే యువతి కేసు పెట్టింది. ఈ ఆరోపణలు నేపథ్యంలో జానీ మాస్టర్ ను కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి జానీని తొలగించారు. దిల్లీలో జాతీయ అవార్డు తీసుకునేందుకు రంగారెడ్డి ఫోక్సోకోర్టులో జానీ మాస్టర్ పిటిషన్ దాఖలు చేయగా. ఈనెల 6 నుంచి 9వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసు నమోదు కావడంతో జానీ మాస్టర్ కు ఇవ్వవలసిన నేషనల్ అవార్డును రద్దు చేశారు. దీంతో ఆయన బెయిల్ రద్దయింది. తాను కూడా మధ్యంతర బెయిల్ తీసుకోబోనంటూ జానీ మాస్టర్ కూడా కోర్టులో మెమో దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు చేసింది. లైంగిక ఆరోపణల నేపథ్యంలో సెప్టెంబరు 15 న జానీ మాస్టర్ పై FIR నమోదు చేసారు. సెప్టెంబరు 19 న జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యాడు. మొత్తంగా 35 రోజులుగా జైల్ లో ఉన్న జాని మాస్టర్, బెయిల్ మంజూరు కావడంతో చంచల్ గూడా జైలు నుండి విడుదల కానున్నారు.
ప్రభాస్ నెక్ట్స్ 5 సినిమాలు.. 5 విభిన్న కథలు..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఒకరకంగా చుస్తే ప్రభాస్ ఉన్నంత బిజీగా టాలీవుడ్ లో ఇతర హీరోలు ఎవరు లేరంటే అతిశయోక్తి కాదు, అంత బిజీగా ఉన్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ వరుస సినిమాలను ఓకే చేశారు. సాహూ, రాధేశ్యామ్. ఆదిపురుష్, సలార్ సినిమాలతో ఏడాదికి ఒక సినిమా చొప్పున రిలీజ్ చేసుకుంటూ వచ్చాడు డార్లింగ్. ఈ ఏడాది స్టార్టింగ్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమాను రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కాగా ప్రభాస్ ప్రస్తుతం 5 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొన్ని సినిమాలు సెట్స్ మీద ఉండగా మరికొన్ని ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉన్నాయి. ఒకసారి ఆ సినిమాల వివరాలు పరిశీలిస్తే ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ది రాజసాబ్ సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్. కెరీర్ లో తొలిసారి హారర్ కామెడీ నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో రజాకార్ల నాటి కాలానికి చెందిన కథ నేపథ్యం ఉన్న సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ చేస్తున్నాడు. ఇక నాలుగవ సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ సలార్ – 2, ఐదవ సినిమాగా కల్కి -2 భారతీయ పురాణాల ఇతిహాసాల నేపథ్యంలో తెరకెక్కనుంది. ఇలా రాబోవు 5 ఇనిమలు 5 విభిన్న కథలను ఎంచుకుని సరికొత్త పంధాలో సాగుతున్నాడు ప్రభాస్.