రేపే ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’.. అధికారులకు మంత్రి దిశా నిర్దేశం
రేపు ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్’ కార్యక్రమం నిర్వహణకు సిద్ధం అయ్యింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. దీనికి సంబంధించి సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ.. మున్సిపల్ కమిషనర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి నారాయణ.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, స్వచ్ఛఆంధ్ర ఎండీ అనిల్ కుమార్ రెడ్డి, అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. గత నాలుగు నెలలుగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి నెల మూడో శనివారం క్రమం తప్పకుండా ఒక్కొక్క థీమ్ తో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం.. రేపు ఇ – చెక్ అనే థీమ్ తో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు..
ఒక్క కేసు కాదు.. మరో 100 కేసులు పెట్టిన భయపడేది లేదు..
ఒక్క కేసు కాదు.. ఇలాంటివి మరో 100 కేసులు పెట్టిన నేను భయపడే వ్యక్తిని కాను అని స్పష్టం చేశారు టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి.. తనపై కేసులు పెట్టడంపై స్పందించిన ఆయన.. నాపై వ్యక్తిగత దాడులు, వ్యక్తిత్వ హననం చేస్తే భయపడతాం అనుకుంటే మీ భ్రమ.. మీ తప్పుల్ని ఎత్తి చూపుతూనే ఉంటా, ప్రజాస్వామ్య బద్ధంగా ప్రశ్నిస్తూనే ఉంటా.. తప్పుడు కేసులు పెట్టడం వల్ల భయపడిపోతాం అనేది మీ భ్రమ మాత్రమే అంటూ కౌంటర్ ఎటాక్ చేశారు.. కేసుల వల్ల నేను ధర్మం వైపు నిలబడకుండా పోవడం అన్నది ఎట్టి పరిస్థితుల్లో జరగు అన్నారు భూమన.. న్యాయం మా వైపు ఉంది, నాపై ఒక్క కేసు కాదు, ఇలాంటివి మరో 100 కేసులు పెట్టిన నేను భయపడే వ్యక్తిని కాను అన్నారు.
విద్యార్థులకు అలర్ట్.. ఏప్రిల్ 29 నుంచే ఈఏపీసెట్ పరీక్షలు
తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఎపిసెట్ (TG EAPCET) 2025 పరీక్షలు ఈ నెల ఏప్రిల్ 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు మే 4 వరకు కొనసాగనున్నాయి. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగాలకు సంబంధించిన ప్రవేశ పరీక్షలు ఏప్రిల్ 29, 30 తేదీల్లో నిర్వహించనుండగా.. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన పరీక్షలు మే 2 నుంచి 4 వరకు జరగనున్నాయి. ఈఎపిసెట్ పరీక్షలు ప్రతిరోజూ రెండు సెషన్లలో జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహించనున్నారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16 ప్రాంతాల్లో, 124 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలకు ఇంజనీరింగ్ విభాగానికి 2,19,420 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు 86,101 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ పరీక్షల కోసం హాల్ టికెట్లు విడుదల తేదీలు కూడా అధికారులు ప్రకటించారు. అగ్రికల్చర్, ఫార్మసీ అభ్యర్థులు ఏప్రిల్ 19 నుండి తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ అభ్యర్థుల హాల్ టికెట్లు ఏప్రిల్ 22 నుండి అందుబాటులో ఉంటాయి. ఈ సందర్భంగా అధికారులు విద్యార్థులకు సూచనలు చేశారు. “ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రానికి ప్రవేశం కల్పించము” అని వారు స్పష్టం చేశారు. కాబట్టి పరీక్షా కేంద్రానికి ముందుగా చేరుకునేలా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు అధికారులు.
భగవద్గీతకు యునెస్కో గుర్తింపు.. ప్రధాని మోడీ హర్షం
భగవద్గీత, నాట్య శాస్త్రాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్‌లో చోటు లభించింది. ఈ విషయంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయంగా పేర్కొన్నారు. భారతీయ మేధో మరియు సాంస్కృతిక గుర్తింపునకు స్తంభాలుగా అభివర్ణించారు. ఇది భారతీయులందరికీ గర్వకారణమైన క్షణం అని ప్రధాని స్పష్టం చేశారు. కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేసిన పోస్ట్‌ను ప్రధాని మోడీ రీట్వీట్ చేశారు. ‘భారత నాగరిక వారసత్వానికి ఒక చారిత్రాత్మక క్షణం’ అని షెకావత్ అభివర్ణించారు.
జిమ్మీ కార్టర్ మరణంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మాజీ అధ్యక్షుడి మరణంపై అనుచితంగా మాట్లాడారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలన గురించి మాట్లాడుతూ ఇటీవల మరణించిన మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మరణంపై ట్రంప్ అవహేళనగా మాట్లాడారు. జో బైడెన్ తన కంటే ‘చెత్త’ అధ్యక్షుడు అని తెలుసుకుని జిమ్మీ కార్టర్ సంతోషంగా కన్నుమూశారని వ్యాఖ్యానించారు. గురువారం ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో కలిసి ఓవల్ ఆఫీసులో విలేకర్లతో మాట్లాడుతూ ట్రంప్ ఈ అనుచిత వ్యాఖ్యలు చేశారు. జో బైడెన్ పరిపాలన చాలా భయంకరమైందన్నారు. ఎన్నికల్లో ప్రజలను మోసం చేయడంలో సమర్థులని వ్యాఖ్యానించారు. ఆ అసమర్థులు ప్రజలకు ఏమీ చేయలేకపోయారని ధ్వజమెత్తారు. అమెరికా చరిత్రలోనే బైడెన్‌ది చెత్త పరిపాలన అంటూ మండిపడ్డారు. జమ్మీ కార్టర్ కంటే బైడెన్ అధ్వానంగా పరిపాలించారని.. ఈ విషయం తెలుసుకుని కార్టర్ సంతోషంగా కన్నుమూశారని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా 39వ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ బాధ్యతలు నిర్వర్తించారు. గతేడాది డిసెంబరు 29న ఆయన మరణించారు. జనవరిలో జరిగిన అంత్యక్రియలకు ట్రంప్‌తో సహా పలువురు మాజీ అధ్యక్షుల దంపతులు హాజరయ్యారు.
యూఎస్ ఉద్యోగులపై వివక్ష ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన టీసీఎస్
దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా 40 ఏళ్లకు పైబడిన దక్షిణాసియా యేతర మాజీ ఉద్యోగులు టీసీఎస్ తీరుపై పక్షపాతంగా లే ఆఫ్‌లు అమలు చేస్తోందని పేర్కొంటున్నారు. హెచ్1 బీ వీసా కలిగిన భారతీయ ఎంప్లాయిస్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కాగా, ఈ ఆరోపణల్ని టీసీఎస్ తీవ్రంగా ఖండించింది. ఈ మాటల్లో వాస్తవం లేదని కేవలం తప్పుడు ఆరోపణలు మాత్రమే అని పేర్కొన్నారు. తాము అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నామని టాటా కన్సల్టెన్సీ వెల్లడించింది. కాగా, ఈ వివాదంపై అమెరికాలో సమాన ఉపాధి అవకాశాల కమిషన్ విచారణ కొనసాగిస్తుంది. కాగా, గతంలో బ్రిటన్‌లో ముగ్గురు టీసీఎస్ ఉద్యోగులు వయసు, జాతీయత ఆధారంగా వివక్షకు గురైనట్లు ది గార్డియన్ నివేదించింది. ఇదిలాఉండగా.. ఇప్పటికే ఫలితాలను ప్రకటించిన టీసీఎస్.. అమెరికా కార్యకలాపాల నుంచి వచ్చే ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 5.3 శాతం పెరిగి రూ.64,479 కోట్లకు చేరుకుంది. నాలుగో త్రైమాసికంలో ఉద్యోగుల తొలగింపు రేటు 13 శాతం నుంచి 13.3 శాతం పెరిగింది. యూఎస్ టారిఫ్‌ల కారణంగా వరల్డ్ వైడ్ గా తలెత్తిన అనిశ్చితితో 6.07 లక్షల మంది ఉద్యోగులకు వార్షిక వేతన పెంపును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
సంజు శాంసన్, ద్రవిడ్‌ల మధ్య లడాయి.. సీఎస్కేకు వచ్చేయ్ అంటూ కామెంట్స్..
రాజస్థాన్ రాయల్స్ జట్టులో అంతర్గత పోరు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ సంజూ శాంసన్‌ల మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనికి కారణం సూపర్ ఓవర్ ఫలితమని సమాచారం.ఐపీఎల్ 2025 సీజన్‌లో తొలి సూపర్ ఓవర్ రాజస్థాన్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది. ఈ సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్ కు రియాన్ పరాగ్, హెట్‌మయెర్ తొలుత బ్యాటింగ్ కు వచ్చారు. ఆ తర్వాత యశస్వి జైస్వాల్‌ను రెండో వికెట్‌గా పంపించారు. ఇక, ఢిల్లీ బౌలర్ మిచెల్ స్టార్క్ అద్భుతమైన బౌలింగ్‌తో కేవలం 11 పరుగులే ఇచ్చాడు. ఛేజింగ్ లో కేఎల్ రాహుల్ (7), స్టబ్స్ (6) పరుగులు చేయడంతో ఢిల్లీ సూపర్ విక్టరీ సాధించింది. అయితే, సూపర్ ఓవర్‌కు ముందు కోచ్ రాహుల్ ద్రవిడ్ జట్టు సభ్యులతో మాట్లాడుతూ కనిపించాడు. ఈ మీటింగ్ కు కెప్టెన్ సంజూ శాంసన్ దూరంగా ఉన్నాడు.. దగ్గరకు రమ్మని పిలిచిన అతడు వెళ్లలేదు. రియాన్ పరాగ్ ను హైలెట్ చేయడానికే ద్రావిడ్ కష్టపడుతున్నాడు.. అందుకే సంజూని ఇలా అవమానిస్తున్నాడని సోషల్ మీడియాలో అతడి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక, సంజూ శాంసన్ ను కెప్టెన్సీని వదిలేయమని సూచించడంతో పాటు జట్టును మారిపోవాలని వేడుకుంటున్నారు.
పవర్ ఆఫ్ మ్యానరిజమ్స్.. ‘బద్రి’ రీరిలీజ్ ప్లానింగ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ తొలినాళ్లలో వచ్చిన సినిమా బద్రి. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న టైమ్ లో పూరి జగన్నాథ్ ని దర్శకునిగా పరిచయం చేస్తూ చేసిన సినిమా బద్రి. 2000లో విడుదలైన ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి ముఖ్యంగా పవర్ స్టార్ చెప్పిన ‘నువ్వు నంద అయితే నేను బద్రి బద్రీనాధ్ అయితే ఏంటి అన్నటువంటి డైలాగ్స్ యూత్ లో మంచి క్రేజ్ ను తీసుకువచాయి. పవర్ స్టార్ బెస్ట్ సినిమాలో బద్రికి స్పెషల్ ప్లేస్ ఉంటుంది. కాగా ఇప్పుడు మరోసారి బద్రి తన మాస్ మ్యానరిజం చూపించేందుకు రెడీ అవుతున్నాడు. టాలీవుడ్ లో ఇటీవల రీరిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో బద్రి కూడా రిరిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రీరిలీజ్ కావాల్సి ఉంది కానీ అనుకోని కారణాల వలన వాయిదా పడుతూ వస్తుంది. కానీ ఈ ఏడాది పవన్ బర్త్ డే కానుకగా అనగా సెప్టెంబర్ 2కి రిరిలీజ్ చేసే ప్లానింగ్స్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ప్రింట్ పనులు జరుగుతున్నాయని సమాచారం. మంచి క్వాలిటీతో, పర్ఫెక్ట్ ఆడీయో క్వాలిటీతో ఈ సినిమాను రిలీజ్ తీసుకురానున్నారని టాక్. ఏదేమైనా బద్రి ఎప్పుడు వచ్చిన సరే రీరిలీజ్ లో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ రాబడుతున్న సినిమాల లిస్ట్ ఈ సినిమా చేరడం గ్యారెంటీ.