రేపు గ్రూప్ – 1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రిలిమినరీ కీ ని వెబ్‌సైట్‌లో పెట్టనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఈ నెల 9వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాథమిక కీతో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్ కూడా అందుబాటులో ఉంటుందన్నారు. అభ్యర్థులు తమ లాగిన్ ద్వారా లాగిన్ అయి.. కీని సరిచూసుకోవాలని సూచించింది టీజీపీఎస్సీ. ప్రాథమిక కీపై అభ్యంతరాలను 13వ తేదీ నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు టీజీపీఎస్సీ దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఈమెయిల్ ద్వారా వచ్చే అభ్యంతరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని టీజీపీఎస్సీ అధికారులు స్పష్టం చేశారు.