Venu Thottempudi Father Dies: టాలీవుడ్ హీరో వేణు తొట్టెంపూడి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. వేణు తండ్రి ప్రొఫెసర్ తొట్టెంపూడి వెంకట సుబ్బారావు (92) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో సోమవారం తెల్లవారుజామున ఆయన మరణించారు. తండ్రి మరణంతో వేణు ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. వెంకట సుబ్బారావు భౌతిక కాయాన్ని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీనగర్ కాలనీలోని స్టీల్ అండ్ మైన్స్ కాంప్లెక్స్ నందు సందర్శనార్ధం ఉంచనున్నారు. సుబ్బారావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
ఈ రోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ప్రొఫెసర్ తొట్టెంపూడి వెంకట సుబ్బారావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. వేణు ‘స్వయంవరం’తో తన కెరీర్‌ని 1999లో ప్రారంభించారు. 2013లో వచ్చిన ‘రామాచారి’ చిత్రం తర్వాత సినీ రంగానికి ఆయన దూరం అయ్యారు. ఇటీవల రవితేజ హీరోగా నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. ‘అతిథి’ అనే వెబ్ సిరీస్‌లోనూ నటించారు. ప్రస్తుతం మరికొన్ని ప్రాజెక్టులతో వేణు ఫుల్ బిజీగా ఉన్నారు.
Also Read: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్!
వేణు తొట్టెంపూడి టాలీవుడ్‌లో కామెడీ, ఫ్యామిలీ, ప్రేమకథా చిత్రాలతో సుదీర్ఘ కాలం పాటు ప్రేక్షకులను అలరించారు. స్వయంవరం, చిరునవ్వుతో, చెప్పవేచిరుగాలి, కల్యాణ రాముడు, శ్రీకృష్ణ, పెళ్లాం ఊరెళితే, హనుమాన్ జంక్షన్, ఖుషి ఖుషీగా, యమగోల మళ్లీ మొదలైంది, గోపి గోపిక గోదావరి లాంటి హిట్ సినిమాలు చేశారు. ముఖ్యంగా హనుమాన్ జంక్షన్, పెళ్లాం ఊరెళితే సినిమాలలో వేణు తనదైన కామెడీతో ఆకట్టుకున్నారు.