నేడు చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ:
ఇన్నర్ రింగ్ రోడ్ ( ఐఆర్‌ఆర్) భూకుంభ కోణం కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ (సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఈ కేసులో విచారణను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారించబోతుంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు నాయుడుకి ఈనెల(జనవరి) 10వ తేదీన ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అనర్హత పిటిషన్‌లపై ఏపీ స్పీకర్ విచారణ:
అనర్హత పిటిషన్‌లపై ఇవాళ విచారణ జరగనుంది. నేడు వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్లను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని వ్యక్తిగతంగా విచారించనున్నారు. ఇక, ఎమ్మెల్సీలను శాసనమండలి ఛైర్మన్ విచారించనున్నారు. ఎమ్మెల్యేలకు స్పీకర్ ఎమ్మెల్సీలకు మండలి ఛైర్మన్ ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఇక, వైసీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ముందు ఇవాళ హాజరు కావడంపై ఉత్కంఠ నెలకొంది. నేడు ముగ్గురు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరుకాబోతున్నారు.
నేడు టీటీడీ పాలకమండలి సమావేశం:
ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం కాబోతుంది. 2024-25 వార్షిక బడ్జెట్‌కు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలుపనుంది. 5 వేల కోట్ల రూపాయల అంచనాతో వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉండగా.. గత ఏడాదితో పోలిస్తే హుండీ ఆదాయం దాదాపు 100 కోట్ల రూపాయలు తగ్గినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. కాగా, 2023-2024 ఏడాదికి గానూ 4 వేల 411 కోట్లు బడ్జెట్‌ను టీటీడీ కేటాయించింది. ఈ ఏడాది బడ్జెట్ ఎంత ప్రవేశపెడతారన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో పాటు ఫిబ్రవరి 16న నిర్వహించనున్న రథసప్తమి ఏర్పాట్లపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే, ఈ భేటీలోనే టీటీడీ విశ్రాంతి ఉద్యోగుల ఇళ్ల స్థలాల మంజూరుపై ఓ ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.
మళ్లీ పంజా విసరనున్న చలి:
తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో మరలా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 16 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు హైదరాబాద్ వాసులు సైతం మరోసారి చలికాలం చలిని చవిచూడాల్సి వస్తోంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక ప్రకారం.. దాదాపు అన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉన్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా పడిపోవడంతో శీతాకాలపు చలి తిరిగి వస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో జనవరి 30 వరకు రాత్రి ఉష్ణోగ్రతలు 17-20 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉంది.
వాళ్ల కోసం స్పెషల్ బస్సులు:
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో టీఎస్ ఆర్టీసీ శుభవార్త అందించింది. త్వరలోనే.. 2,375 కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఈ బస్సుల్లో దివ్యాంగుల కోసం కొన్ని స్పెషల్ బస్సులను కేటాయించేలా నిర్ణయం తీసుకుంటామని సజ్జనార్ తెలిపారు. దివ్యాంగులకు కూడా అనౌన్స్ మెంట్, ఎంక్వైరీ రూం ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తామని సజ్జనార్ హామీ ఇచ్చారు. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం ద్వారా బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
సీఎం నితీష్ కుమార్ మానసిక స్థితి బాగాలేదు:
సీఎం నితీష్ కుమార్ ఇండియా కూటమి, బీహార్‌లో ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి నుంచి బయటకు వచ్చి మళ్లీ ఎన్డీయేతో జతకట్టాడు. బీజేపీ మద్దతుతో నిన్న 9వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన నితీష్.. ఎన్డీయేలో చేరడం కూటమి జీర్ణించుకోలేకపోతోంది. ఇదిలా ఉంటే ఆ కూటమిలోని కీలక పార్టీలైన కాంగ్రెస్, డీఎంకే వంటి పార్టీలు ఇప్పటికే నితీష్ కుమార్, బీజేపీలపై విమర్శలు ఎక్కుపెట్టాయి. తాజాగా శివసేన(యూబీటీ) నేత, ఎంపీ సంజయ్ రౌత్ కూడా సీఎం నితీష్ టార్గెట్‌గా విమర్శలు చేశారు. నితీష్ కుమార్ పేరును ఇండియా కూటమిలో ముఖ్యస్థానం కోసం ఎప్పుడూ చర్చించలేదని ఆదివారం ఆయన అన్నారు. ఎన్డీయేలో చేరిన తర్వాత ఆయనపై రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నితీష్ కుమార్ ఇండియా కూటమిలో ఎప్పుడూ ముందంజలో లేరు. సీఎం నితీష్ కుమార్, బీజేపీల మానసిక స్థితి బాగాలేదు. వారు రాజకీయ మైదానంలో ఇలాంటి గేమ్స్ ఆడకూడదు’అని రౌత్ అన్నారు.
అయోధ్య రాముడిని దర్శించుకున్న 19 లక్షల మంది భక్తులు:
అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఈ నెల 22న అట్టహాసంగా జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరై రామ మందిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ రంగాల్లోని ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. లక్షలాది మంది రామాలయ ప్రారంభోత్సవాన్ని చూశారు. ఇదిలా ఉంటే ప్రాణప్రతిష్ట తర్వాత రోజు జనవరి 23 నుంచి సాధారణ భక్తులకు ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. గత ఆరు రోజుల్లో ఏకంగా 19 లక్షల మంది భక్తులు అయోధ్య రాములోరిని దర్శించుకున్నారు. సగటు ప్రతీ రోజూ 2 లక్షల కన్నా ఎక్కువ మంది భక్తులు రాముడిని దర్శించుకున్నట్లు ఆలయ ట్రస్ట్ తెలిపింది. ఉత్తర్ ప్రదేశ్ నుంచే కాకుండా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. జనవరి 23న ఆలయాన్ని తెరిచిన తొలిరోజే ఐదు లక్షల మంది భక్తులు పూజలు చేయడంతో రద్దీ ఎక్కువగా ఉంది. తరువాతి రోజుల్లో ఈ సంఖ్య 2 నుండి 2.5 లక్షల వరకు ఉంది.
బ్రెజిల్‌లో కుప్పకూలిన విమానం:
బ్రెజిల్‌లో విమానం కుప్పకూలింది. చిన్న విమానం కుప్పకూలిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. బ్రెజిల్‌లోని ఆగ్నేయ మినాస్ గెరైస్ రాష్ట్రంలో ఆదివారం ఉదయం 10:30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. పొరుగున ఉన్న సావోపాలో రాష్ట్రంలోని క్యాంపినాస్ నగరం నుంచి బయల్దేరిన కాసేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు వెల్లడించారు. సింగిల్-ఇంజిన్ గల ఈ విమానం గాల్లో ఉండగానే ముక్కలై మైనింగ్ పట్టణంలోని ఇటాపెవాలో ఉదయం 10:30 గంటలకు కుప్పకూలినట్లు అగ్నిమాపక సిబ్బంది అక్కడి వార్తా సంస్థకి తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే విమానంలో ఉన్న ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మూడు మృతదేహాలను వారు బయటికి తీశారు. ఈ ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది. విమానం ఓ కొండపై పడిపోయినట్లు తెలుస్తోంది.
ప్రభాస్‌కు జోడిగా శ్రీలీల:
పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం సలార్ పార్ట్ 2, కల్కి 2898 ఏడీ, రాజా సాబ్ వంటి సినిమాలు చేస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగా, హను రాఘవపూడితో ప్రభాస్ సినిమాలు చేయనున్నాడు. సీతారామంతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న హను రాఘవపూడి.. ప్రభాస్ కోసం ఓ ప్రేమకథ రెడీ చేశారని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా యంగ్ హీరోయిన్ శ్రీలీలను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చర్చలు కొనసాగుతున్నాయని, దాదాపు ఒకే అయ్యినట్లు తెలుస్తుంది.
ఉత్తమ నటుడు రణ్‌బీర్ కపూర్:
బాలీవుడ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఫిల్మ్‌ఫేర్’ అవార్డుల జాబితా వచ్చేసింది. గుజరాత్‌లోని గాంధీనగర్ వేదికగా అట్టహసంగా జరిగిన ఈ వేడుకలో విజేతలను ప్రకటించారు. రణ్‌బీర్ కపూర్ ఉత్తమ నటుడు అవార్డు అందుకోగా.. అలియా భట్ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. యానిమల్ సినిమాలో తన నటనకు గానూ రణబీర్‌కు ఉత్తమ నటుడు అవార్డు లభించింది. రాకీ ఔర్ రాణి కియ్ ప్రేమ్ కహానీలో తన నటనకు అలియా ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. 2023లో విడుదలైన చిత్రాలకు సంబంధించి ఈ అవార్డులు ప్రకటించారు. 69వ ఎడిషన్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024లో ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన 12వ ఫెయిల్ ఆధిపత్యం చెలాయించింది. విక్రాంత్ ఉత్తమ నటుడు క్రిటిక్స్‌గా నిలవగా, విధు వినోద్ చోప్రా ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. 12వ ఫెయిల్ ఉత్తమ చిత్రంగా నిలిచింది. రాణి ముఖర్జీ, విక్రాంత్ మాస్సేలకు ఉత్తమ నటుల అవార్డులు దక్కాయి. విక్కీ కౌశల్, షబానా అజ్మీలకు ఉత్తమ సహాయ నటుల అవార్డులు దక్కాయి.
స్థిరంగా బంగారం ధరలు:
బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. శనివారం పెరిగిన పసిడి ధరలు.. వరుసగా రెండో రోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో సోమవారం (జనవరి 29) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,700గా ఉండగా… 24 క్యారెట్ల (999 గోల్డ్) 10 గ్రాముల బంగారం ధర రూ. 62,950గా ఉంది. నిన్నటితో పోలిచ్చుకుంటే.. పసిడి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,850 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 63,100గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ. 57,700 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 62,950గా కొనసాగుతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 62,950గా ఉంది. వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. కిలో వెండి ధర సోమవారం రూ. 76,000గా పలుకుతోంది.
మేం ఓటములకు భయపడం:
తాము ఓటములకు భయపడం అని, మైదానంలో దిగి సత్తాచాటుతామని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అన్నాడు. హైదరాబాద్ టెస్ట్ విజయం చాలా గొప్పదని తెలిపాడు. గాయం నుంచి కోలుకొని రీఎంట్రీ ఇచ్చిన మ్యాచ్‌లోనే ఓలీ పోప్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడని, ఉపఖండంలో ఒక ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్ ఇదే అని పేర్కొన్నాడు. ఎలాంటి అనుభవం లేకపోయినా టామ్ హార్ట్‌లీ అద్భుతంగా బౌలింగ్ చేశాడని స్టోక్స్ ప్రశంసించాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో టీమిండియాపై గెలిచింది. ఈ విజయంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో స్టోక్స్ సేన 1-0తో ఆధిక్యంలో నిలిచింది.