తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత రాష్ట్రం ఐటీ రంగంలో దూసుకెళ్తోంది. మొన్నటి దాకా ఐటీ సెక్టార్ అంటే కేవలం హైదరాబాద్ పేరు మాత్రమే వినిపించేది. కానీ ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు విస్తరించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఐటీ టవర్స్ ను ఏర్పాటు చేసి.. స్థానిక యువతకు ఉద్యోగాలను కల్పిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, సిద్దిపేట జిల్లాల్లో ఐటీ హబ్ లను ఏర్పాటు చేసింది. తాజాగా నిజామాబాద్ లోనూ ఐటీ టవర్ ను ఏర్పాటు చేసింది.
Read Also: Suryakumar Yadav: చెలరేగిన సూర్యకుమార్, మెరిసిన తిలక్.. మూడో టీ20లో భారత్ ఘన విజయం!
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేడు నిజామాబాద్ లో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐటీ టవర్ తో పాటు న్యాక్, మున్సిపల్ భవనాలను ఆయన ప్రారభించనున్నారు. మినీ ట్యాక్ బండ్, వైకుంఠ దామాలను ప్రారంభిస్తారు. పాలిటెక్నిక్ కళాశాలలో జరిగే బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తుండటంతో.. నిజామాబాద్ పట్టణాన్ని పార్టీ శ్రేణులు గులాబీమయంగా మార్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో.. మంత్రి కేటీఆర్ పర్యటనకు ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ దగ్గర ఏర్పాటు చేసిన ఐటీ టవర్స్ ను మంత్రి జిల్లా ప్రజలకు అంకితం చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 కోట్లతో ఐటీ టవర్ ను నిర్మించింది.
Read Also: Vishnu Stotram: అప్పుల బాధలు తక్షణమే పోవాలంటే ఇంట్లో ఈ స్తోత్రాలు వినండి
అయితే, దాదాపు 750 మంది ఉద్యోగులకు ప్రత్యక్షంగా 4వేల మందికి పరోక్షంగా ఉపాది కల్పించేలా ఈ ఐటీ టవర్స్ సిద్దం చేసినట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అయితే, ఇప్పటికే 15 సంస్థలతో ఒప్పందం పూర్తి చేసి.. 280 మంది ఉద్యోగులను నియామకం చేశారు. నిజామాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ ఐదు గంటల పాటు ఉండనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక హెలిక్యాప్టర్ లో నూతన కలెక్టరేట్ సముదాయంలోని హెలిప్యాడ్ లో ల్యాండ్ అవుతారు. అక్కడ నుంచి నేరుగా ఐటీ టవర్ ప్రారంభించి.. ఉద్యోగులతో కాసేపు మాట్లాడి.. అక్కడి నుంచి వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించి.. పాలిటెక్నిక్ మైదానంలో జరిగే బహిరంగ సభలో మాట్లాడతారు.