Today Business Headlines 29-03-23:
కొత్త యాక్టివా లాంఛ్
యాక్టివాలో కొత్త వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. అప్డేట్ చేసిన ఇంజన్‌తో దీన్ని రూపొందించినట్లు హోండా మోటర్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తెలిపింది. ఏప్రిల్ నుంచి కఠినమైన ఉద్గార ప్రమాణాలు అమల్లోకి రానున్నాయి. దీంతో.. వాటికి అనుగుణంగా నయా యాక్టివాను తయారుచేశామని సంస్థ పేర్కొంది. ఈ మేరకు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని వినియోగించామని వెల్లడించింది. ఈ మోడ్రన్ మోడల్‌ని నడిపేటప్పుడు వాహనదారుడు వారెవ్వా అనే రేంజ్‌లో అనుభూతి పొందుతాడని కంపెనీ ఎండీ అండ్ సీఈఓ అత్సుషి ఒగాటా అన్నారు.
రైటాఫ్ రుణాల వసూలు
గడచిన ఐదేళ్లలో ప్రభుత్వరంగ బ్యాంకులు లక్ష కోట్ల రూపాయలకు పైగా రైటాఫ్ రుణాలను వసూలు చేశాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో.. నికర రైటాఫ్ రుణాల విలువ 6 పాయింట్ మూడు ఒకటి లక్షల కోట్ల రూపాయలకు పరిమితమైందని స్పష్టం చేసింది. మొత్తం రైటాఫ్ రుణాల విలువ 7 పాయింట్ మూడు నాలుగు లక్షల కోట్ల రూపాయలు కాగా వసూలు చేసిన రుణాల విలువ ఇందులో 14 శాతమని వివరించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను తెలియజేశారు.
లెవిటాస్ అల్ట్రా టైర్లు
లగ్జరీ కార్లకు హైదరాబాద్ కీలకమైన మార్కెట్ అని జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ అన్షుమన్ సింఘానియా అన్నారు. అందుకే.. లెవిటాస్ అల్ట్రా టైర్లను ఇక్కడ విడుదల చేశామని చెప్పారు. దేశంలోని 80 శాతం లగ్జరీ కార్లకు అవసరమైన ఏడు సైజుల్లో టైర్లను రిలీజ్ చేశామని తెలిపారు. లగ్జరీ కేటగిరీలో 80 శాతం కార్లు 40 నుంచి 80 లక్షల మధ్య రేటు కలిగినవేనని వెల్లడించారు. జేకే టైర్ల సంస్థకు దేశవ్యాప్తంగా 650 బ్రాండెడ్ ఔట్‌లెట్లు ఉన్నాయని, మరో 200 ఔట్‌లెట్లను ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో కొత్తగా యూనిట్‌ని ఏర్పాటుచేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
ఐడీబీఐకి కొత్త సీఎఫ్‌ఓ
ఐడీబీఐ బ్యాంక్‌కి కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా స్మితా హరీష్ కుబర్ నియమితులయ్యారు. ఈ నిర్ణయం ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం సీఎఫ్‌ఓగా మరియు ఈడీగా ఉన్న పి.సీతారామ్ ఈ నెల 31న పదవీ విరమణ చేయనుండటంతో స్మితా హరీష్‌ని నియమించారు. ఈ నియామకానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపారని ఐడీబీఐ బ్యాంక్ ఆర్‌బీఐకి తెలిపింది. స్మితా హరీష్‌కి బ్యాంకింగ్ రంగంలో పాతికేళ్లకు పైగా అనుభవం ఉంది. ఐడీబీఐ బ్యాంక్‌లో ఐదేళ్లుగా ఫైనాన్స్, అకౌంట్స్, ట్యాక్సేషన్ వంటి కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.
యాపిల్ స్మార్ట్‌ఫోన్ల వాటా
మేకిన్ ఇండియాలో యాపిల్ కంపెనీ స్మార్ట్‌ఫోన్ల వాటా భారీగా పెరిగింది. పరిమాణం పరంగా చూస్తే 65 శాతం, విలువ పరంగా చూస్తే 162 శాతం వృద్ధి చెందింది. బ్రాండ్ వ్యాల్యూ షేర్ పాతిక శాతం పెరిగింది. ఇది 2021లో 12 శాతం ఉండగా 2022లో 25 శాతానికి చేరింది. ‘మేకిన్ ఇండియా’ స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లలో ఎక్స్‌పోర్ట్‌ల వాటా అంతకుముందు ఎన్నడూలేనంతగా గతేడాది అత్యధిక స్థాయికి చేరింది. ఈ విషయాన్ని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. 2022 క్యూ4లో.. శామ్‌సంగ్.. అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారుగా ఎదిగినట్లు పేర్కొంది.
కేంద్రం నుంచి క్లారిటీ
లక్డీకపూల్ నుంచి బీహెచ్‌ఈఎల్ వరకు మరియు నాగోల్ నుంచి ఎల్‌బీ నగర్ వరకు మెట్రోరైల్ నిర్మాణం సాధ్యమయ్యే పనికాదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ రెండు మార్గాల్లో ప్రయాణికుల సంఖ్య తక్కువ కాబట్టి మెట్రోరైళ్లు నడపటం ఏమాత్రం లాభదాయకం కాదని తెలిపింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్.. కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌పురికి గతంలో లేఖ రాసిన సంగతి తెలిసిందే. రాయ్‌దుర్గ్ నుంచి శంషాబాద్‌కి మెట్రోరైల్‌ను పొడిగించే అంశాన్నీ అందులో ప్రస్తావించారు.