Today Business Headlines 05-04-23:
ముగ్గురూ.. ముగ్గురే..
క్రీడా రంగంలో.. ముఖ్యంగా క్రికెట్‌లో.. కోహ్లి, ధోని, రోహిత్ శర్మ.. ఈ ముగ్గురూ వాణిజ్య ప్రకటనలతో దూసుకెళుతున్నారు. ఒక్కొక్కరూ కనీసం 30 బ్రాండ్లకు ప్రచారం చేస్తున్నారు. మొత్తం 505 సంస్థలు సెలెబ్రిటీలతో ఈ మేరకు ఒప్పందాలు చేసుకోగా.. అందులో ఏకంగా 381 ఒప్పందాలను క్రికెటర్లతోనే కుదుర్చుకోవటం విశేషం. మొత్తం డీల్స్ వ్యాల్యూ 749 కోట్ల రూపాయలు. అందులో 640 కోట్ల రూపాయలను క్రికెటర్లే సొంతం చేసుకున్నారు. మిగతా 109 కోట్ల రూపాయలను ఇతర క్రీడాకారులు పొందారు. ఈ విషయాలను గ్రూప్-ఎం ఈఎస్‌పీ స్పోర్టింగ్ నేషన్ రిపోర్ట్-2023 వెల్లడించింది.
తులం 60 వేలు పైనే
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర నిన్న మంగళవారం చుక్కలనంటింది. 10 గ్రాముల గోల్డ్ రేట్ 660 రూపాయలు పెరిగి 60 వేల 330 రూపాయలకి చేరింది. బెజవాడ, వైజాగ్‌లలో కూడా దాదాపు ఇదే ధర పలికింది. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో సైతం 24 క్యారెట్ల పసిడి రేట్ రికార్డ్ లెవల్‌లో నమోదైంది. ఒక ఔన్స్.. అంటే.. 31 పాయింట్ ఒకటీ సున్నా గ్రాముల ధర 2 వేల 25 డాలర్లకు పెరిగింది. ఇక.. వెండి రేట్ కూడా ఒక్క రోజులోనే 700 పెరిగి గరిష్టంగా 74 వేల 800 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటంతోపాటు అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలకు ఆర్థిక మాంద్యం పొంచి ఉండటం, స్టాక్ మార్కెట్ అనిశ్చితి దీనికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.
విశాఖ ఉక్కిరి బిక్కిరి
విశాఖ ఉక్కు సంస్థ మరోసారి వార్తల్లో నిలిచింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ముడి పదార్థాన్ని కొనేందుకు కూడా డబ్బుల్లేక నానా యాతనలు పడుతోంది. కంపెనీ మెయింటనెన్స్‌కి సైతం మనీ కరువై కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్.. ఆర్‌ఐఎన్‌ఎల్.. ఒక ప్రకటన చేసింది. స్టీల్ ప్రొడక్షన్ కంపెనీలేవైనా ఫండ్స్ ఇస్తే.. దానికి బదులుగా ఉక్కును సరఫరా చేస్తామని తెలిపింది. ఆసక్తి కలిగిన సంస్థలు పది రోజుల్లోపు తెలియజేయాలని కోరింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం 22 వేల కోట్ల రూపాయల అప్పు తీర్చాల్సి ఉంది. దీనికితోడు వేల కోట్ల రూపాయల నష్టాలు నమోదవుతున్నాయి.
మురళి దివి.. మళ్లీ..
ఫోర్బ్స్ సంస్థ రూపొందించిన ప్రపంచ కుబేరుల జాబితాలో.. తెలుగువారికి సంబంధించి.. మురళి దివి మరోసారి నంబర్ వన్‌గా నిలిచారు. ఈయన దివిస్ ల్యాబొరేటరీస్‌కి అధిపతి అనే సంగతి తెలిసిందే. మురళి దివి సంపద 490 కోట్ల డాలర్లుగా నమోదైంది. ఈ లిస్టులో మొత్తం 10 మంది తెలుగువారికి చోటు లభించగా అందులో మురళి దివి అగ్ర స్థానంలో ఉన్నారు. ఈ పదిలో ఐదుగురు ఫార్మా సెక్టార్‌కి చెందినవారే కావటం గమనించాల్సిన అంశం. మురళి దివి తర్వాతి స్థానాల్లో ప్రతాప్ సి రెడ్డి, పీపీ రెడ్డి, పీవీ కృష్ణారెడ్డి, ఎం.సత్యనారాయణరెడ్డి, జూపల్లి రామేశ్వర్ రావు, జీఎం రావు, పీవీ రాంప్రసాద్ రెడ్డి, కె.సతీష్ రెడ్డి, జీవీ ప్రసాద్ ఉన్నారు.
79కి రానున్న రూపీ..
2023-24 ఆర్థిక సంవత్సరంలో రూపాయి మారకం విలువ 79 రూపాయలకు దిగిరావొచ్చని అంచనా వేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో డాలరుతో పోల్చితే రూపాయి యావరేజ్‌గా 82 రూపాయల వద్ద ఉంది. ఈ ఏడాది రూపాయి బలపడటానికి కారణం కరెంట్ ఖాతా లోటు తగ్గటమేనని యూబీఎస్ సెక్యూరిటీస్ సంస్థ పేర్కొంది. డాలర్ వోలటాలిటీ ఇండెక్స్‌లు బలహీనపడటం కూడా దీనికి దోహదపడొచ్చని తెలిపింది. రూపాయి విలువ తగ్గకుండా కాపాడేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫారెక్స్ నిల్వలను పెంచటంపై ఫోకస్ పెట్టొచ్చని తెలిపింది. ఈ మేరకు పోయినేడాది 115 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టడాన్ని ప్రస్తావించింది.
స్కైరూట్.. మైల్‌స్టోన్
హైదరాబాద్‌కి చెందిన ప్రైవేట్ సెక్టార్ స్పేస్ టెక్నాలజీ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ మరో మైలురాయిని సొంతం చేసుకుంది. త్రీడీ ప్రింటెడ్ క్రయోజనిక్ ఇంజన్‌ను 200 సెకన్లపాటు సక్సెస్‌ఫుల్‌గా పరీక్షించింది. ఈ మేరకు మొబైల్ క్రయోజనిక్ ప్యాడ్‌ను దేశీయంగా అభివృద్ధిపరిచి వినియోగించింది. ధావన్-2 పేరుతో ఈ పరీక్షను నాగ్‌పూర్‌లోని సోలార్ ఇండస్ట్రియల్ ప్రొపల్షన్ టెస్ట్ సెంటర్‌లో నిర్వహించింది. స్కైరూట్ సంస్థ.. గతేడాది నవంబర్‌లో విక్రమ్-ఎస్ రాకెట్‌ని విజయవంతంగా ప్రయోగించి ఈ ఘనత సాధించిన ఫస్ట్ ఇండియన్ ప్రైవేట్ కంపెనీగా పేరొందిన సంగతి తెలిసిందే.