Today (23-12-22) Business Headlines:
ఎయిర్‌టెల్-అపోలో దోస్తీ: ఆరోగ్య సంరక్షణ రంగంలో అధునాతన 5జీ టెక్నాలజీని వాడుకోవటానికి ఎయిర్‌టెల్ మరియు అపోలో హాస్పిటల్స్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. 5జీ టెక్నాలజీతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ను కూడా వినియోగించుకున్నాయి. హెల్త్‌నెట్ గ్లోబల్, ఏడబ్ల్యూఎస్ మరియు అవేషా అనే సంస్థలను కూడా కలుపుకొని కలనోస్కోపీ ట్రయల్స్ నిర్వహించాయి. కలనోస్కోపీ ట్రయల్స్.. అంటే.. పెద్ద పేగు పరిశీలనకు సంబంధించిన పరీక్షలను చేపట్టాయి. ఈ హెల్త్ టెస్టుల్లో పెద్ద పేగు క్యాన్సర్‌ను చాలా తొందరగా, సుస్పష్టంగా గుర్తించాయి.
‘చిత్ర’కు బెయిలు.. అయినా జైలు..
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మాజీ డైరెక్టర్ అండ్ సీఈఓ చిత్రా రామకృష్ణకు కాస్త ఊరట లభించింది. కానీ.. ఒక కేసులో బెయిల్ లభించినప్పటికీ మరో కేసుకు సంబంధించి కోర్ట్ ఆర్డర్ రాకపోవటంతో ఆమె ప్రస్తుతానికి జైల్లోనే కొనసాగాల్సి వస్తోంది. ఎన్‌ఎస్‌ఈ ఉద్యోగుల ఫోన్లను ట్యాప్ చేశారనే కేసులో చిత్రా రామకృష్ణకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. లక్ష రూపాయల పర్సనల్ బాండ్ పేపర్‌తోపాటు ఇద్దరి ష్యూరిటీలను కూడా ఇవ్వాలని ఆదేశించింది. కేసు విచారణకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని, న్యాయస్థానానికి తెలియకుండా విదేశాలకు వెళ్లొద్దని షరతులు విధించింది.
‘ఇండియా సిమెంట్స్’పై సీసీ‘ఐ’
ఇండియా సిమెంట్స్‌కు చెందిన చెన్నై ఆఫీసులో కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సోదాలు నిర్వహించింది. ఈ విషయాన్ని ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ వెల్లడించింది. సీసీఐ నిబంధనలను తాము ఉల్లంఘించలేదని పేర్కొంది. ఈ ఆకస్మిక దాడికి సంబంధించి వస్తున్న వార్తలపై బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ స్పష్టత కోరగా ఐసీఎల్ వివరణ ఇచ్చింది. సీసీఐ అధికారులు నిన్న గురువారం ఉదయం పదకొండున్నరకు తమ కార్యాలయానికి వచ్చారని, అక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా అనే కోణంలో తనిఖీలు చేపట్టారని తెలిపింది. తాము ఏ తప్పూచేయనందున ఈ పరిణామం తమపై ఎలాంటి ప్రభావమూ చూపబోదని ఐసీఎల్ ధీమా వ్యక్తం చేసింది.
రూ.1158 లక్షల కోట్ల నష్టం
ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లకు భారీ నష్టం వాటిల్లింది. 11 నెలల్లో జరిగిన ఈ నష్టం విలువ 11 వందల 58 లక్షల కోట్ల రూపాయలు. అగ్రరాజ్యం అమెరికాతోపాటు అత్యంత సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే జర్మనీ గవర్నమెంట్ లోన్ డాక్యుమెంట్స్ కూడా 16 నుంచి 24 శాతం వరకు నష్టాలను మిగిల్చాయి. దీనికి ఇప్పుడు కరోనా కేసుల భయాలు కూడా తోడు కావటం గమనించాల్సిన విషయం. ఈ నేపథ్యంలో డిసెంబర్‌లోని నష్టాలను కూడా కలిపితే 2022 మొత్తమ్మీద నికర నష్టం ఇంకెంత తేలుతుందో చూడాలి.
పరుపుల మార్కెట్‌లో గ్రోత్
మన దేశంలో ఇటీవల కొన్నేళ్లుగా ఖరీదైన పరుపులకు డిమాండ్ బాగా నెలకొంటోంది. మామూలు పరుపుల మార్కెట్‌లో ఆరేడు శాతం గ్రోతే ఉండగా ప్రీమియం మ్యాట్రెసెస్ మార్కెట్‌లో మాత్రం ఏకంగా 20 నుంచి 25 శాతం వృద్ధి చోటుచేసుకుంటోంది. ఈ విషయాన్ని పాలీఫ్లెక్స్ అనే ఇటలీ సంస్థ ఇండియా ఎండీ ఆనంద్ నిచాణి చెప్పారు. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా సుమారు వంద దేశాల్లో పరుపుల వ్యాపారం చేస్తోంది. మ్యాగ్నీఫ్లేక్స్ అనే బ్రాండ్ నేమ్‌తో కాస్ట్‌లీ మ్యాట్రెసెస్‌ను విక్రయిస్తోంది. ఈ పరుపుల కనీస ధర 85 వేల రూపాయలు. పాలీఫ్లెక్స్‌కి మన దేశంలో 63 స్టోర్లు ఉన్నాయి. ఏడాదిన్నరలో 116కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఎల్‌జీ న్యూఇయర్ ఆఫర్లు
నూతన సంవత్సరం 2023 సమీపిస్తున్న నేపథ్యంలో ఎల్‌జీ సంస్థ ఆకట్టుకునే ఆఫర్లు ప్రకటించింది. హౌజ్ హోల్డ్ అండ్ ఎంటర్టైన్‌మెంట్ ప్రొడక్టులను కొన్నవారికి 20 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఇవ్వనుంది. కస్టమర్‌పై నెలవారీ ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ఫిక్స్‌డ్ ఈఎంఐని తక్కువగానే.. అంటే.. 999 రూపాయల నుంచే ప్రారంభించింది. దీనికితోడు జీరో డౌన్ పేమెంట్ సౌకర్యాన్ని కూడా కల్పి్స్తోంది. ఇవే కాకుండా.. ప్రత్యేక రాయితీలు మరియు కంపల్సరీ గిఫ్టులతో కూడిన ఈ ఆఫర్లను ‘న్యూ సీజన్ సెలబ్రేషన్’ పేరుతో ప్రారంభించింది.