Today (16-02-23) Business Headlines:
ఏప్రిల్ 1 నుంచే ఐటీఆర్‌లు
ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్‌లను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే దాఖలు చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2023-24 అసెస్‌మెంట్ ఇయర్ మొదటి రోజు నుంచే ఐటీఆర్ ఫారాలు అందుబాటులో ఉంటాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ తెలిపింది. పోయినేడాది ఐటీఆర్ ఫారాలతో పోల్చితే వీటిలో పెద్దగా మార్పులు లేవని పేర్కొంది. కాబట్టి ఐటీఆర్‌లను దాఖలుచేయటం ఇక తేలికని వెల్లడించింది. వ్యక్తులు, ప్రొఫెషనల్ ఎక్స్‌పర్ట్‌లు, వ్యాపార సంస్థలు సమర్పించాల్సిన ఒన్ టు సిక్స్ ఐటీ ఫారాలను సీబీడీటీ ఇప్పటికే నోటిఫై చేసింది. మామూలుగైతే ఐటీఆర్ దాఖలుకు జులై 31వ తేదీ దాక గడువు ఉంటుంది.
‘యూనివర్సల్’ అయ్యేందుకు..
ఐదేళ్ల కిందట ప్రారంభమైన ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఇంకా పోస్టల్ సేవల్లో భాగంగానే ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పూర్తి స్థాయి ఆర్థిక సేవలందించే యూనివర్సల్ బ్యాంక్‌గా మారేందుకు ప్రయత్నాలు చేయనుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి దరఖాస్తు చేయనుంది. ఆర్థికంగా లాభాల్లోకి వచ్చాక యూనివర్సల్ బ్యాంక్‌గా మారతామని, అప్పుడు డిపాజిట్లు తీసుకునేందుకు, రుణాలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 500 కోట్ల రూపాయల స్థూల ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఉందని అంచనా వేసింది.
‘రూపాయి’పై విదేశాల ఆసక్తి
వాణిజ్య చెల్లింపులను రూపాయల్లో చేసేందుకు పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ మేరకు బ్యాంకుల్లో వోస్ట్రో అకౌంట్లను తెరుస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, యూకో తదితర 20 బ్యాంకుల్లో ఈ ఖాతాలు తెరిచినట్లు ఆఫీసర్లు తెలిపారు. అమెరికా డాలర్‌తోపాటు యూరో కరెన్సీకి సంబంధించి ఫారన్ ఎక్స్ఛేంజ్ సమస్యలను ఎదుర్కొంటున్న కొన్ని ఆఫ్రికా దేశాలు ఈ లిస్టులో ఉన్నాయి. మన పక్క దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, మారిషస్ ఇప్పటికే రూపాయల్లో లావాదేవీల కోసం చర్యలు చేపట్టాయి. ఇజ్రాయిల్, జర్మనీ, రష్యా వంటి అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఈ ఖాతాలను తెరిచాయి. గల్ఫ్ దేశాలతో సంప్రదింపులు జరుగుతున్నాయి.
జీఎస్టీలోకి పెట్రోలియం కూడా
రాష్ట్ర ప్రభుత్వాలు ఓకే చెబితే పెట్రోలియం ప్రొడక్టులను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలనే నిబంధన ఇప్పటికే ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుర్తుచేశారు. జీఎస్టీ మండలి 49వ సమావేశం ఈ నెల 18న ఢిల్లీలో జరగనున్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. విద్యుత్ సహా పలు రంగాల్లో సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయని తెలిపారు. మూలధన వ్యయ కేటాయింపులు తొలిసారిగా రెండంకెల మొత్తానికి చేరాయని బడ్జెట్ అనంతర చర్చా సమావేశంలో చెప్పారు.
నాట్కో ఫార్మా విస్తరణ ప్రణాళిక
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ నాట్కో ఫార్మా దేశీయ విస్తరణ ప్రణాళికలను వెల్లడించింది. సంస్థ ఆదాయాల్లో దేశీయ వాటా ప్రస్తుతం 15 శాతమేనని, ఆ షేరును పెంచుకోవటం కోసం ఏదైనా కంపెనీని కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. సొంతగా కొత్త ఔషధాలను రిలీజ్ చేయనున్నట్లు పేర్కొంది. ఈ ప్రయత్నాల ద్వారా భవిష్యత్తులో దేశీయ అమ్మకాల వాటాను 20 నుంచి 25 శాతానికి పెంచుకోవాలని ఆశిస్తోంది. కంపెనీకి అప్పులు లేవని, వెయ్యి కోట్లకు పైగా డబ్బు చేతిలో ఉందని తెలిపింది.
తెలంగాణ రాష్ట్రాన్నీ కలపండి
దేశ వైమానిక విప్లవంలో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అంతర్భాగం చేయాలని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కోరారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కొత్త ఎయిర్‌పోర్ట్‌లను ఏర్పాటుచేయటం ద్వారా వాయు మార్గంలో ప్రాంతాల మధ్య అనుసంధానాన్ని పెంచటానికి ప్రయత్నిస్తోందని చెప్పారు. ఈ ప్రయత్నాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేసీఆర్‌కి లేఖ రాశారు. గతేడాది జులైలో రాసిన లెటర్‌కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవటంతో ఇప్పుడు మళ్లీ ఉత్తరం రాయాల్సి వస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.