Today (07-01-23) Business Headlines:
గ్లాండ్ ఫార్మా చేతికి ఐరోపా సంస్థ
ఐరోపా సంస్థ సెనెగ్జి గ్రూపులో మొత్తం వాటా కొనుగోలు చేసేందుకు హైదరాబాద్‌లోని ప్రముఖ కంపెనీ గ్లాండ్ ఫార్మా ఒప్పందం కుదుర్చుకుంది. సింగపూర్ అనుబంధ సంస్థ గ్లాండ్ ఫార్మా ఇంటర్నేషనల్ పీటీఈ ద్వారా ఈ షేరును దక్కించుకుంటుంది. దాదాపు 20 ఏళ్ల కిందట ఏర్పాటైన సెనెగ్జి గ్రూపు.. ఫ్రాన్స్ మరియు బెల్జియం దేశాల్లో ఔషధాల అభివృద్ధి, ఉత్పత్తి తదితర పనులు చేస్తోంది. స్టెరైల్ లిక్విడ్ మరియు ఫిల్-ఫినిష్డ్ వంటి ప్రొడక్టుల ఉత్పత్తిలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది.
18 శాతం పెరిగిన టీ ఎక్స్‌పోర్ట్స్
2022 జనవరి, అక్టో్బర్ మధ్య కాలంలో.. అంటే.. 10 నెలల్లో మన దేశం నుంచి టీ ఎగుమతులు 18 శాతానికి పైగా పెరిగాయి. తద్వారా మొత్తం ఎక్స్‌పోర్ట్‌లు 185 మిలియన్ కిలోగ్రాములకు పైగా చేరాయి. 2021లో ఇదే సమయంలో భారతదేశ టీ ఎగుమతులు 160 మిలియన్ కిలోగ్రాములుగానే నమోదయ్యాయి. ఇండియా నుంచి టీ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో రష్యా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. బ్రిటన్ మరియు అమెరికా మోస్తారు కొనుగోలు దేశాలుగా ఉన్నాయి. ఈ వివరాలను టీ బోర్డ్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
గ్రోత్ రేట్ 7 శాతం: ఎన్‌ఎస్‌ఓ
గత ఆర్థిక సంవత్సరంలో ఇండియా స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 8 పాయింట్ 7 శాతం కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతానికే పరిమితం కావొచ్చని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసు తెలిపింది. గనుల తవ్వకాలు మరియు తయారీ రంగంలో ఆశించిన గ్రోత్ లేకపోవటమే దీనికి కారణమని పేర్కొంది. ఈ మేరకు ఎన్‌ఎస్‌ఓ మొదటి ముందస్తు అంచనాలను వెల్లడించింది. గడచిన ఆర్థిక సంవత్సరంలో తయారీ రంగం 9 పాయింట్ 9 శాతం వృద్ధిని నమోదు చేయగా ఈసారి 1 పాయింట్ 6 శాతానికి తగ్గనున్నట్లు లెక్కించింది. పోయినేడాది మైనింగ్‌లో 11 పాయింట్ 5 శాతం గ్రోత్ నెలకొనగా ఈసారి 2 పాయింట్ 4 శాతానికి డౌన్ కానుంది.
300లకు చేరిన ఇండిగో ఫ్లైట్లు
ఇండిగో సంస్థ అధీనంలో ఉన్న మొత్తం విమానాల సంఖ్య 300లకు పెరిగింది. జర్నీలకు డిమాండ్ పెరగటంతో ప్రయాణికుల అవసరాలకు తగ్గట్లు సర్వీసులను అందించేందుకు ప్రయత్నిస్తున్నామని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ చెప్పారు. ఇండియాలో వివిధ ప్రాంతాలకు దేశీయ సర్వీసులను విస్తరించామని తెలిపారు. విమానాల సంఖ్య పెరగటం వల్ల గ్లోబల్ డెస్టినేషన్లకు కూడా సేవలను పెంచుతామని పేర్కొన్నారు. ఇండిగో అమ్ములపొదిలో ఏ320 నియో, ఏ320 సీఈఓ, ఏ321 నియోతోపాటు రీజనల్ జెట్ ఫ్లైట్లు ఏటీఆర్72-600 సైతం ఉన్నాయి.
2 విడతల్లో ఆర్‌బీఐ గ్రీన్ బాండ్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు విడతల్లో గ్రీన్ బాండ్లను జారీ చేయనుంది. తద్వారా 16 వేల కోట్ల రూపాయలను సమీకరించనుంది. ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీ యాక్టివిటీస్ కోసం ఈ ఫండ్స్‌ను వెచ్చించనుంది. ఈ నెల 25వ తేదీన మొదటి విడత హరిత బాండ్ల జారీ ద్వారా 8 వేల కోట్ల రూపాయలను సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే నెల 9వ తేదీన మరోసారి గ్రీన్ బాండ్స్ జారీ చేస్తుంది. అప్పుడు కూడా మరో 8 వేల కోట్ల రూపాయల ఫండ్స్ రైజ్ చేయనుంది. ఐదు మరియు పదేళ్ల కాల వ్యవధి గల ఈ బాండ్ల రూపంలో వచ్చే డబ్బును కర్బన ఉద్గారాల నియంత్రణ కోసం పనిచేసే ప్రభుత్వ రంగ ప్రాజెక్టులకు కేటాయిస్తారు.
2022లో మొత్తం డీల్స్ 2007
2022లో ఇండియన్ కంపెనీలు.. మొత్తం 2 వేల 7 ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఈ డీల్స్ విలువ 127 బిలియన్ డాలర్లని గ్రాంట్ థార్న్‌టన్ భారత్ అనే సంస్థ యాన్యువల్ డీల్ ట్రాకర్ రిపోర్ట్‌లో వెల్లడించింది. 2021తో పోల్చితే ఈ ఒప్పందాల సంఖ్య 6 శాతం తక్కువని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక మాంద్యం దృక్పథం నేపథ్యంలో కూడా ఇండియన్ కంపెనీలు ఈ స్థాయిలో డీల్స్ కుదుర్చుకోవటం చెప్పుకోదగ్గ విషయమని తెలిపింది. సంస్థల విలీనాలు, స్వాధీనాలకు సంబంధించి 477 ఒప్పందాలు జరిగాయని, ఇది 2021 కన్నా 200 శాతం ఎక్కువని వివరించింది.