AP Elections: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక అనూహ్య పరిణామాలతో వాయిదా పడింది. సోమవారం ఉదయం 11 గంటలకు షెడ్యూల్ ప్రకారం ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ, 50 మంది సభ్యులలో కేవలం 22 మంది మాత్రమే హాజరయ్యారు. ఎన్నికలు నిర్వహించడానికి కనీస కోరం (50%) లేకపోవడంతో ఎన్నికల అధికారి, జేసీ శుభం బన్సల్ ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. తిరుపతి రాజకీయాలు గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠకు గురయ్యాయి. ఆదివారం రాత్రి కొన్ని అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. వైసీపీ ఇంచార్జ్ భూమన అభినయ్ రెడ్డి ఆరోపణల ప్రకారం, కూటమి నేతలు వైసీపీ కార్పొరేటర్లను బలవంతంగా హోటళ్లకు తరలించారని తెలిపారు. ఈ ఆరోపణల నేపథ్యంలో సోమవారం డిప్యూటీ మేయర్ ఎన్నికల కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
Also Read: Bunny Vasu: పవన్ కళ్యాణ్ ఒకసారి పక్కన పెడితే కష్టం.. బన్నీ వాసు కీలక వ్యాఖ్యలు!
కూటమి నుంచి మునికృష్ణను డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించగా, వైసీపీ చివరి నిమిషంలో లడ్డు భాస్కర్‌ను రంగంలోకి దించింది. అయితే, వైసీపీ అభ్యర్థికి మద్దతు తగ్గడంతో వారి కార్పొరేటర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు సమాచారం. కూటమికి 30 మంది కార్పొరేటర్ల మద్దతు ఉండగా, వైసీపీ మేయర్ అభ్యర్థి వైపు కార్పొరేటర్లు పెద్దగా ఆసక్తి కనబరచలేదని తెలుస్తోంది. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఎస్వీయూ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగాల్సి ఉంది. కూటమి కార్పొరేటర్లు ముందుగానే హాజరయ్యారు. అయితే, వైసీపీ కార్పొరేటర్లు ప్రత్యేక బస్సులో ఎన్నికా కేంద్రానికి వచ్చారు. ఈ క్రమంలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడి, కొందరు అనుచరులు బస్సుపై దాడి చేసి కార్పొరేటర్లను కారులో తీసుకెళ్లారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటన తర్వాత వైసీపీ కార్పొరేటర్లు, మేయర్, ఎంపీ ఈ ఎన్నికలను బహిష్కరించారు. తమ కార్పొరేటర్లను విడుదల చేయకుండా ఎన్నికలు జరిగితే, న్యాయపోరాటానికి దిగుతామని హెచ్చరించారు. ఈ పరిణామాలతో తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ మరింత పెరిగింది. రేపటి ఎన్నికలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.