Tirumala Laddu Adulteration Case: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) రాష్ట్ర ప్రభుత్వానికి కీలక లేఖను పంపింది. ఈ లేఖలో ఇప్పటివరకు జరిగిన పరిణామాలు, దర్యాప్తులో తేలిన అంశాలు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలను సిట్ వివరించినట్టు సమాచారం. సుమారు వంద పేజీలకు పైగా ఉన్న ఈ నివేదికలో, 2019–2024 మధ్యకాలంలో తిరుమల లడ్డూ ప్రసాద తయారీలో చోటుచేసుకున్న అనేక తప్పిదాలను సిట్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది. లడ్డూలో కల్తీ జరిగినట్లు నిర్ధారణకు వచ్చిన అంశాలను కూడా లేఖలో స్పష్టంగా పేర్కొన్నట్లు సమాచారం. కేవలం తప్పిదాలనే కాదు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన సరిదిద్దే చర్యలు, పర్యవేక్షణా విధానాలపై కూడా సిట్ సూచనలు చేసింది అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
సిట్ లేఖపై ప్రభుత్వ అధ్యయనం
సిట్ పంపిన లేఖను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే అధికారికంగా స్పందించాలనే నిర్ణయానికి ప్రభుత్వ వర్గాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నివేదిక అత్యంత సున్నితమైన అంశానికి సంబంధించినదైనందున, తొందరపాటు వ్యాఖ్యలు చేయకుండా అన్ని కోణాల్లో పరిశీలన జరుపుతున్నామని సమాచారం. అయితే, సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందంటూ వైసీపీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తోందన్న ఆరోపణలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. ఈ తరహా తప్పుడు ప్రచారాలను గట్టిగా తిప్పికొట్టడంతో పాటు, అవసరమైతే కఠిన చర్యలు తీసుకునే దిశగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
భక్తుల విశ్వాసం, టీటీడీ సంస్థ ప్రయోజనాల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. తిరుమల లడ్డూ అంశం కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నందున, వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా ముందుకెళ్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సిట్ నివేదికపై పూర్తి స్థాయి అధ్యయనం అనంతరం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ప్రకటించే చర్యలు రాజకీయంగా, పరిపాలనపరంగా కీలకంగా మారనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.