UPSC Aspirant Murder: తిమార్‌పూర్‌లోని గాంధీ విహార్ ప్రాంతంలో జరిగిన యూపీఎస్సీ విద్యార్థి రామ్‌కేష్ మీనా హత్యను చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఆధారాలను నాశనం చేయడానికి, రామ్‌కేష్ ప్రియురాలు అమృత చౌహాన్ ముమ్మర ప్రయత్నాలు చేసింది. ఫోరెన్సిక్ సైన్స్ చదువుతున్న అమృత తన చదువును ఉపయోగించి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. హత్యకు ముందు పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు అనేక క్రైమ్ వెబ్ సిరీస్‌లను సైతం చూసింది. ఎన్ని చేసిన తప్పించుకోలేక పోయింది.
అసలు ఏం జరిగింది..?
అక్టోబర్ 6న గాంధీ విహార్ లోని నాల్గవ అంతస్తు ఫ్లాట్ లో అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునేసరికి కాలిపోయిన మృతదేహం కనిపించింది. తరువాత మృతుడిని 32 ఏళ్ల రామ్ కేష్ మీనాగా గుర్తించారు. అయితే.. సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కుట్రను బయటపెట్టింది. సంఘటన జరిగిన రోజున ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు భవనంలోకి ప్రవేశించినట్లు ఫుటేజ్‌లో కనిపించింది. వారిలో ఒకరు దాదాపు 39 నిమిషాల తర్వాత బయటకు వచ్చారు. ఆ తర్వాత.. తెల్లవారుజామున 2:57 గంటలకు ఒక మహిళ, మరో వ్యక్తితో కలిసి ప్లాట్ నుంచి బయటకు వచ్చింది. వెంటనే అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన పోలీసుల అనుమానాన్ని రేకెత్తించింది. ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.
READ MORE:Rashmika : ట్రీట్‌మెంట్ అయ్యింది అన్న రష్మిక.. కంగారులో ఫ్యాన్స్
రామ్ కేష్ ప్రియురాలు అమృత చౌహాన్(21) ఈ హత్యకు పాల్పడినట్లు తెలిసింది. అమృత చౌహాన్, ఆమె మాజీ ప్రియుడు సుమిత్ కశ్యప్( 27), అతని స్నేహితుడు 29 ఏళ్ల సందీప్ కుమార్ కలిసి రామ్ కేష్ మీనాను హత్య చేశారు. అనంతరం మృతదేహంపై నూనె, నెయ్యి, మద్యం పోసి ఎల్పీజీ సిలిండర్ రెగ్యులేటర్ తెరిచి పేల్చేశారు. దీన్ని అగ్ని ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. ఈ ముగ్గురూ ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ నివాసితులుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అక్కడ పోలీసులు వారిని అరెస్టు చేశారు. రామ్ కేష్ మీనా వద్ద తనకు సంబంధించిన అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ ఉందని అమృత తెలిపింది. వాటిని డిలీట్ చేయడానికి తన ప్రియుడు అంగీకరించలేదని అందుకే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు వెల్లడించింది.
ప్రేమగా మారిన పరిచయం..
రామ్‌కేష్, అమృత మే 2025లో కలుసుకున్నారు. వారి పరిచయం త్వరలోనే ప్రేమగా మారింది. అమృత రామ్‌కేష్‌తో లివ్-ఇన్ సంబంధంలో ఉంది. రామ్‌కేష్ అమృతతో కొన్ని సన్నిహిత వీడియోలు, ఫోటోలను రికార్డ్ చేసి తన హార్డ్ డిస్క్‌లో ఉంచుకున్నాడు. ఆ విషయం అమృతకు తెలియగానే, ఆమె వాటిని డిలీట్ చేయాలని కోరింది. అమృత చాలాసార్లు ఈ అంశాన్ని లేవనెత్తింది. కానీ అతను ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునే వాడు. అమృత దీన్ని జీర్ణించుకోలేకపోయింది. అమృత ఈ విషయాన్ని తన మాజీ ప్రేమికుడు సుమిత్‌కు చెప్పింది. రామ్‌కేష్‌ను హత్య చేయాలని పథకం వేసి చంపేశారు.