Accident : ఉత్తరప్రదేశ్‌లోని షాజహాపూర్ పరిధిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న లారీ స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన లారీ స్కూటీని దాదాపు 500 మీటర్ల దూరం లాక్కెళ్లింది. దీంతో స్కూటీపై కూర్చున్న ముగ్గురు వ్యక్తులు రక్తపుమడుగులో తీవ్రగాయాలతో రోడ్డుపై పడిపోయారు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స ప్రారంభించేలోపే మృతి చెందారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఓ అమాయక చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
Read Also: Amritpal Singh: 100 కార్లు, గంట పాటు ఛేజ్.. ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్ అరెస్ట్..
ప్రమాదం చాలా ఘోరంగా జరిగిందని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. స్కూటీని ఢీకొట్టిన తర్వాత, ట్రక్కు డ్రైవర్ భయపడి ట్రక్కును ఆపకుండా స్పీడ్ పెంచాడు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన లారీ డ్రైవర్‌ను స్థానికులు ఆపాలని హెచ్చరించారు. వారి హెచ్చరికలను పట్టించుకోకుండా ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా ట్రక్కు నడిపి ముగ్గురి మృతికి కారణమైన లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌ను పోలీసులు సకాలంలో అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
Read Also: Congress : నిరుద్యోగులు ధైర్యంగా ఉండాలి.. టీఎస్పీఎస్సీలో అసలు దొంగలెక్కడ?: పొన్నం