Heavy Fog in Delhi Today: దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. బుధవారం ఉదయం ఢిల్లీ సహా పొరుగు ప్రాంతాలలో విజిబిలిటీ (దృశ్యమానత) దాదాపు సున్నాకి పడిపోయింది. దాంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రమాదకర స్థాయిలో కొనసాగుతున్న వాయు కాలుష్యానికి పొగమంచు కూడా తోడవ్వడంతో ఢిల్లీ జనజీవనం అతలాకుతలం అవుతోంది. ఉదయం 10-11 గంటలకైనా సూర్యుడి కనిపించడం లేదు. మరోవైపు నేడు, రేపు రాజధానిలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
బుధవారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జీరో విజిబిలిటీ ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఓ ప్రకటనలో తెలిపింది. జీరో విజిబిలిటీ కారణంగా 50కి పైగా విమానాలకు అంతరాయం కలిగింది. దట్టమైన పొగమంచు కారణంగా 50కి పైగా విమానాలు ఆలస్యమైనట్లు ఢిల్లీ విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. వీటిలో కొన్ని విమానాలను జైపూర్, అహ్మదాబాద్, ముంబైలకు మళ్లించారు. విమాన సమాచారం కోసం ప్రయాణికులు విమానయాన సంస్థలను సంప్రదించాలని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు.
Also Read: Crime News: తమిళనాడులో దారుణం.. బస్సులోంచి గర్భిణిని తోసేసిన భర్త!
దట్టమైన పొగమంచు కారణంగా దేశ రాజధానికి వెళ్లే లేదా బయలుదేరే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దాంతో రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంది. మంగళవారం ఢిల్లీలో గరిష్టంగా 21.4 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 8.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 13 ఏళ్లలో ఎన్నడూ లేని చలి ఢిల్లీలో ఈ నెలలో నమోదవుతోంది. సగటు గరిష్ట ఉష్ణోగ్రత 17.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది 2010 నుంచి కనిష్ట స్థాయి అని ఐఎండీ తెలిపింది.