ఉద్యోగి భవిష్యత్ కోసం ఏర్పాటు చేసిందే ఈపీఎఫ్‌వో (EPFO). ఇందులో ఉద్యోగికి సంబంధించిన కొంత డబ్బు ఇక్కడ పొదుపు చేయబడి ఉంటుంది. ముందుగా అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు.. లేదంటే పదవీ విరమణ తర్వాతైనా తీసుకొవచ్చు. ఇంకొంత పెన్షన్ రూపంలోనైనా తీసుకోవచ్చు. ఇలా ఈపీఎఫ్‌వో(EPFO)లో ఈ వెసులుబాటు ఉంది. కానీ అధికారులు చేసిన పనికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. ఈ దారుణ ఘటన కేరళ (Kerala)లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే..
కేరళలోని త్రిసూర్‌కు చెందిన శివరామన్ (69) అపోలో టైర్స్‌లో పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ తర్వాత తనకు రావాల్సిన డబ్బుల కోసం గత తొమ్మిదేళ్లుగా EPFO కార్యాలయం చుట్టు తిరుగుతూనే ఉన్నాడు. సరైన పత్రాలు లేవంటూ అధికారులు తొమ్మిదేళ్లుగా కార్యాలయం చుట్టు తిప్పుకుంటూనే ఉన్నారు. కానీ అతనికి రావాల్సిన డబ్బులు మాత్రం రాలేదు. లేనిపోని పత్రాలు తేవాలంటూ అతన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. దీంతో అతడు విసుగెత్తిపోయి.. ఫిబ్రవరి 7న కొచ్చిలోని ఈపీఎఫ్‌వో కార్యాలయంలో విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అనంతరం చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలకు ఉపక్రమించారు. అనంతరం శివరామన్‌కు రావాల్సిన డబ్బులను కూడా కుటుంబ సభ్యులకు ఇచ్చేశారు. మొత్తానికి 9 ఏళ్లుగా పరిష్కారం కానీ సమస్య.. శివరామన్ మృతితో వెంటనే పరిష్కరమైంది. ఈ సందర్భంగా అధికారుల తీరుపై శివరామన్ కుమారుడు ప్రదీప్ మండిపడ్డారు. మనుషులు చచ్చిపోతేనే గానీ డబ్బులు ఇవ్వరా? అంటూ అధికారులను ప్రదీప్ నిలదీశారు.