ఏపీ బీజేపీలో కష్టపడి పని చేస్తే పదవులు రావా? పనీ పాటా లేకుండా… ఏళ్ళ తరబడి జస్ట్ అలా.. అలా… టైంపాస్ చేస్తూ కూర్చుంటే పోస్ట్‌లు వాటంతట అవే పరుగులు పెట్టుకుంటూ వచ్చి ఒళ్ళో వాలిపోతాయా? కేడర్‌లో అదే అభిప్రాయం బలపడుతోందా? ఆంధ్రా కాషాయ దళంలో అసలేం జరుగుతోంది? మారుతున్న ఆలోచనా ధోరణి మొదటికే మోసం తెచ్చే ప్రమాదం ఉందా?
ఆంధ్రప్రదేశ్ బీజేపీ కేడర్‌లో అదో రకమైన నిర్లిప్తత పెరుగుతోందట. మనం ఎంత చించుకుంటే ఏముంది…? పదవులా…? పాడా…? అవి ఎలాగూ వచ్చే వాళ్ళకు వస్తూనే ఉన్నాయి. మనం మాత్రం ఎక్కడికో….. వెళ్దామనుకుని పాకులాడుతూ ఇక్కడే మిగిలిపోతున్నామన్న చర్చ జరుగుతోందంటున్నారు. అంతకు మించి… పార్టీ కోసం పనిచేయకున్నా ఫర్లేదుగానీ… పక్క చూపులు చూడకుండా దశాబ్దాల తరబడి ఇక్కడే తిష్టవేసుకుని కూర్చుంటే చాలు. సీనియారిటీ పేరుతో వాళ్ళే పిలిచి పోస్ట్‌లు కట్టబెడతారని కూడా ద్వితీయ శ్రేణి నాయకులు మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో చూద్దాం… చెబితే చేద్దాం… లేకుంటే అనవసరంగా పూసుకోవడం ఎందుకన్న వైఖరి పెరుగుతోందట. చివరికి కాస్త స్థాయి ఉన్న నాయకులు ఏదన్నా కార్యక్రమం చేద్దానమన్నా… ద్వితీయ శ్రేణితో పాటు కేడర్‌ని కూడా బతిమాలి పిలవాల్సి వస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. దీంతో తమ అనుభవం, సారధ్య సామర్ధ్యాల గురించి నెమరేసుకుంటూ… సీనియర్స్ తలపట్టుకోవాల్సి వస్తోందని అంటున్నారు.
సుపరిపాలన యాత్రలో కూడా ఇలాంటి సమస్యలే ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా ఏ కార్యకర్త అయినా ఎదురు చూసేది నాయకుడిగా ఎదగడం కోసమే. అలాంటిది నాయకత్వ లక్షణాలతో సంబంధం లేకుండా…కేవలం సీనియారిటీ ఉంటే చాలు పదవులు ఇచ్చేస్తారన్న ధోరణి పెరుగుతోందని, ఇది రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలకు ప్రధాన అడ్డంకి అవుతుందన్న మాటలు ఏపీ బీజేపీ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. ఆ మధ్య పదవులు పొందిన కొందరు నాయకుల్ని చూశాక కేడర్, ద్వితీ శ్రేణి ఆలోచనా విధానం మారిందన్నది కాషాయదళంలో ఇంటర్నల్ టాక్. ఇదే ఇప్పుడు పెద్ద ప్రతిబంధకంగా మారిందని అంటున్నారు. జిల్లా అధ్యక్షుల జేబులు గుల్లవుతున్నా… పని మాత్రం జరగడం లేదు, కార్యక్రమాలకు రావాల్సినంత మైలేజ్ రావడం లేదన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి.
ఇదంతా చూస్తూ వాళ్లు కూడా ఎన్నాళ్ళని మనం ఇలా చేతి చమురు వదిలించుకుంటాం… అందర్నీ బతిమాలుకుంటామంటూ ఫ్రస్ట్రేట్ అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏదన్నా కార్యక్రమం ఉందని పిలిస్తే… హా… సార్…. పిలిచారా, సరే… వస్తున్నాం లే అన్నట్టుగానే ఉంది తప్ప ఉత్సాహంగా ఎవరూ ముందుకు రావడంలేదని, ఏదో… ఇంట్లో పెళ్లికి పిలిచినట్టు ఈ బతిమాలుకోవడాలు ఎమన్నాళ్శురా బాబూ అంటూ… జిల్లా అధ్యక్షులు తలబాదుకుంటున్నారట. రాష్ట్ర స్ధాయి నేతలు స్టేజీలెక్కడం, అలా చేయాలి, ఇలా చేసేయాలి, మనం దున్నేయాలి, సత్తా చాటాలంటూ ఏదేదో చెప్పడం వినడానికి బాగున్నా… చేతల్లోకి వచ్చేసరికే సమస్యలు ఎదురవుతున్నాయంటున్నారు నాయకులు. అలాంటివి జిల్లా స్ధాయి నేతలకు అలవిగాని టాస్క్‌లుగా మారుతున్నాయన్నది పార్టీ వర్గాల మాట.
Also Read:Social Vetting: ఆన్లైన్లో వెర్రి వేషాలు వేస్తే యూఎస్లో అడుగుపెట్టలేరా..?
ఈ పరిస్థితుల్లో సుపరిపాలన యాత్రకు జనసమీకరణ తలనొప్పిగా మారిందని చెప్పుకుంటున్నారు. రండి బాబూ రండి… మన పార్టీకి ఊపు తెద్దామని బతిమాలుతున్నా… అట్నుంచి రెస్పాన్స్ మాత్రం అంతంతేనని తెలుస్తోంది. కొన్నిచోట్ల భారీ ర్యాలీల్లాగా కనిపిస్తున్నా… వాళ్ళంతా చూడ్డానికి వచ్చే జనాలే తప్ప, పార్టీ కోసం డెడికేటెడ్‌గా పని చేసే కేడర్ ఎక్కడన్న ప్రశ్న ఎదురవుతోందట. కష్టపడి పని చేద్దామనేకంటే… కనిపిస్తే చాలనుకునే వాళ్ళు పెరిగిపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందని అంటున్నారు. రానురాను ఏపీ బీజేపీలో ఈ ధోరణి పెరిగిపోతోందని, ఇప్పుడే దీనికి అడ్డుకట్ట వేయకుంటే రాబోయే రోజుల్లో ఒక చిన్న కార్యక్రమం చేయాలన్నా చాలా కష్టమైపోతుందన్న మాటలు వినిపిస్తున్నాయి ఏపీ కమలంలో.