హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు…అమెరికా మరోషాక్ ఇచ్చింది. హెచ్-1బీ, హెచ్-4 వీసా దరఖాస్తుదారుల…సోషల్ మీడియా ఖాతాల పరిశీలనను ప్రారంభించింది. వెట్టింగ్‌కు వీలుగా హెచ్-1బీ, హెచ్-4 వీసాలకు దరఖాస్తు చేసిన వారంతా…తమ సెట్టింగ్‌లను ప్రైవేట్ నుంచి పబ్లిక్‌కు మార్చుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
అమెరికాకు వెళ్లాలి..అక్కడే విద్యనభ్యసించాలి. అక్కడే సెట్ అయిపోవాలి. జీవితాన్ని హాయిగా గడపాలి. ఇది ఎంతో మంది విదేశీ విద్యార్థుల కల. అందుకు అనేక సవాళ్లు సైతం ఎదుర్కొనేందుకు సిద్ధపడతారు. కానీ, అమెరికా ప్రయాణానికి ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇక నుంచి మరో లెక్కలా మారిపోయింది పరిస్థితి. కారణం.. అధ్యక్షుడు ట్రంప్ కఠిన నిర్ణయాలు. అంతకు మించి ఆయన టెంపరితనం. వలసదారులంటేనే ఆగ్రహం వ్యక్తం చేసే ట్రంప్.. ఇప్పుడు అమెరికాలో అడుగు పెట్టాలంటేనే వణుకుపుట్టేలా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియా వెట్టింగ్.. వీసాల జారీకి కొత్త నిబంధన తీసుకొచ్చిన అమెరికా ప్రభుత్వం.. అభ్యర్థుల సోషల్ మీడియా ఖాతాలను నిశితంగా పరిశీలించనుంది. దాని ఆధారంగానే వీసా ఇవ్వొచ్చా లేదా ? నిర్ణయిస్తుంది. దీంతో అమెరికా వీసా కావాలని భావించే వారికి ఇప్పుడు అమాంతంగా సోషల్ వెట్టింగ్ గుబులు పట్టుకుంది?
అగ్రరాజ్యం అమెరికా…హెచ్-1బీ వీసా దరఖాస్తుదారుల నెత్తిన అమెరికా బాంబు పేల్చింది. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా భారీ ఎత్తున హెచ్-1బీ, హెచ్-4 వీసాలను ప్రుడెన్షియల్ రద్దు చేసింది. ఈ మేరకు వర్కింగ్ వీసాలు రద్దయినట్లు వీసాదారులకు కాన్సులేట్ ఈ మెయిల్స్ పంపింది. హెచ్-1బీ, హెచ్4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఈ ప్రుడెన్షియల్ రద్దు తాత్కాలికమేనని తెలుస్తోంది. ఇది శాశ్వత వీసా తిరస్కరణ కిందకు రాదని ఇమిగ్రేషన్ అధికారులు చెబుతున్నారు. ఈ తాత్కాలిక వీసా రద్దు వీసాదారుల చట్టబద్ధ నివాస హక్కును ప్రభావితం చేయదు. కానీ, తర్వాత వీసా అపాయింట్‌మెంట్ సమయంలో దీన్ని పరిగణనలోకి తీసుకుని వారి దరఖాస్తులను మరింత క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది.
అమెరికాలో హెచ్1బీ, హెచ్4 వీసా దరఖాస్తుదారుల ఆన్‌లైన్ ఉనికిని సమీక్షించే సోషల్ వెట్టింగ్‌ను అమెరికా సీరియస్‌గా తీసుకుంది. హెచ్1బీ, హెచ్4, ఎఫ్, ఎం, జే వీసాలకు దరఖాస్తు చేసిన వారంతా వెట్టింగ్‌కు వీలుగా తమ సామాజిక మాధ్యమాల సెట్టింగ్‌లను ప్రైవేటు నుంచి పబ్లిక్‌కు మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనల కారణంగా ఇప్పటికే భారతీయుల సహా అనేక మంది హెచ్1బీ వీసాల ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి. అమెరికాలోకి ప్రవేశించేవారు అమెరికన్లకు హాని చేయబోరనే నమ్మకం కలగాలని…దరఖాస్తుదారులు తమ విశ్వసనీయతను నిరూపించుకోవాలని అమెరికా విదేశాంగశాఖ స్పష్టం చేసింది.
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్, వలసేతర వీసాలపైనా కఠినంగా వ్యవహరిస్తున్నారు. హింస, చోరీ కేసుల నుంచి మద్యం తాగి వాహనం నడపడం వంటి ఉల్లంఘనలకు పాల్పడినవారి వీసాల రద్దుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 85 వేల వీసాలు రద్దయ్యాయి. అమెరికా పౌరుల భద్రతను దృష్టిలోపెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టేట్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. ఈ వీసాల రద్దు కారణంగా 8 వేల మంది విద్యార్థులపై ప్రభావం పడిందని సంబంధిత అధికారులు వివరించారు.
డిసెంబర్ 2న అన్ని అమెరికా దౌత్య కార్యాలయాలకు అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ మెమోను జారీ చేసింది. హెచ్1బీ వీసాలకు దరఖాస్తు చేసుకునే వారి లింక్డిన్ పేజీలు, రెజ్యూమోలను సమీక్షించాలని ఆదేశించింది. వాక్ స్వాతంత్ర్యం అణచివేసేలా సెన్సార్‌షిప్‌ను అమలు చేసేందుకు గతంలో పనిచేసినట్లు తేలినా వారి వీసాలను తిరస్కరించవచ్చని స్టేట్ డిపార్ట్‌మెంట్ మెమో జారీ చేసింది. హెచ్-1బీతోపాటు హెచ్-4 వీసాదారుల రెజ్యూమో, లింక్డిన్ ప్రొఫైళ్లను సమీక్షించాలి. వారు అసత్య ప్రచారం, కంటెంట్ నియంత్రణ, ఫ్యాక్ట్ చెకింగ్, ఆన్‌లైన్ సేఫ్టీ వంటి విభాగాల్లో పని చేశారా ? అని గమనిస్తారు. విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్లపై ఇప్పటికే దీన్ని అమెరికా అమలు చేస్తోంది. ఇప్పుడు H1B,H4 వీసాదారులకు కూడా ఇది వర్తింపజేస్తోంది.
వీసాదారుల చట్టబద్ధ నివాస అర్హతలో ఏదైనా సమస్య ఉందని ప్రభుత్వం అనుమానిస్తే… అమెరికా విదేశాంగ శాఖ వీసా రద్దుపై నిర్ణయం తీసుకుంటుంది. దీన్నే ప్రుడెన్షియల్ వీసా రివోకేషన్‌గా పిలుస్తారు. ఇలా తాత్కాలికంగా రద్దు చేసినప్పటికీ…వీసాదారులు తమ గడువు పూర్తయ్యేవరకు అమెరికాలో నివసించవచ్చు. అయితే ఒకసారి అమెరికా నుంచి బయటకు వెళ్తే…వీసా గడువు ఉన్నప్పటికీ మళ్లీ అగ్రరాజ్యంలోకి ప్రవేశించే అవకాశం ఉండదు. తాత్కాలిక రద్దు సమయంలో వీసాల స్టాంప్ చెల్లుబాటు కాదు.
అమెరికాలో హెచ్-1బీ వీసా కార్యక్రమం…1990లో ప్రారంభమైంది. అమెరికాలో కొరత ఉన్న రంగాల్లో ఉన్నత విద్యావంతులు, నిపుణులైన విదేశీ నిపుణులను నియమించుకోవడానికి…దీన్ని తీసుకువచ్చారు. అయితే హెచ్-1బీ వీసా రుసుము మొన్నటి వరకు దాదాపు 1 లక్ష నుంచి రూ.6 లక్షల మధ్యే ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా దానిని రూ.88 లక్షలకు పెంచారు. ట్రంప్ తీసుకువచ్చిన లక్ష డాలర్ల ఫీజు…ఇప్పటికే అమలవుతోంది. ఇందుకోసం ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఒక ఏడాది పాటు అమల్లో ఉంటుంది. ఈలోపు అమెరికా చట్టసభ కాంగ్రెస్‌లో చట్టం చేస్తే…ఆ తర్వాత పూర్తిస్థాయిలో అమల్లో ఉంటుంది.
భారత్ నుంచి హెచ్-1బీ వీసాపై అమెరికాకు వెళ్లే ఒక ఉద్యోగి సగటు వార్షిక వేతనం 60 వేల డాలర్ల నుంచి 1.40 లక్షల డాలర్ల మధ్యలో ఉంటుంది. ఈ పరిస్థితుల్లో హెచ్-1బీ వీసా కోసం ఒక ఉద్యోగిపై లక్ష డాలర్ల ఫీజు చెల్లించడానికి కంపెనీలు ముందుకు రాలేదు. కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులకు మాత్రమే వార్షిక రుసుము లక్ష డాలర్లు ఉంటుందని వైట్‌హౌస్ క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే ఉన్న వీసా హోల్డర్లకు లేదా పునరుద్ధరణలకు ఈ ఫీజు పెంపు ఉండబోదని తెలిపింది. అమెరికాకు వెళ్లాలని కలలు కంటోన్న వేలాది మంది భారత విద్యార్థులు, యువ నిపుణులపై ప్రభావం చూపుతోంది.
అసలు సోషల్ మీడియా వెట్టింగ్ అంటే ఏంటి ? ఉగ్రవాదాన్ని నియంత్రించడం, యూదు వ్యతిరేకతను నియంత్రించడమే లక్ష్యంగా అగ్రరాజ్యం పని చేస్తోందా ? అమెరికాలో చదువుకోవడానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులందరికీ సోషల్ మీడియా వెటింగ్ తప్పనిసరేనా ? విద్యార్థి వీసా, గ్రీన్ కార్డ్ హోల్డర్లు…పాలస్తీనాకు మద్దతు తెలిపినా కష్టాలు తప్పవా ?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన విధానాలతో గందరగోళంలో ఉన్న విద్యార్థులకు ఇప్పుడు మరో దిగులు పట్టుకుంది. అదే సోషల్ మీడియా వెట్టింగ్. విదేశీ విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాల తనిఖీపై అగ్రరాజ్యం మరింత దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారి ఇంటర్వ్యూల షెడ్యూలింగ్‌ను ఇప్పటికే నిలిపివేసింది. వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వొచ్చా.. లేదా అనే దాన్ని అంచనా వేయడం కోసం వారి ఆన్‌లైన్ యాక్టివిటీని అధికారులు తనిఖీ చేయనున్నారు. దీన్నే సోషల్ మీడియా వెట్టింగ్ అంటారు. సంబంధిత విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను పరిశీలించిన తర్వాతే వీసా మంజూరు చేస్తారు. అప్పటివరకు విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లను నిలిపివేసింది.
ఉగ్రవాదులను నియంత్రించడం, యూదు వ్యతిరేకతను ఎదుర్కోవడమే లక్ష్యంగా…సోషల్ మీడియా ఖాతాలను తనిఖీ చేయనున్నట్లు అగ్రరాజ్యం వెల్లడించింది. ఉదాహరణకు.. ఎవరైనా విద్యార్థి తమ సామాజిక మాధ్యమ ఖాతాలో పాలస్తీనా జెండాను పోస్ట్ చేసినట్లయితే ఆ వ్యక్తిని మరింత క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. వారి వల్ల దేశ భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధరించుకున్న తర్వాతే వారిని అమెరికా విద్యాసంస్థల్లో చదువుకునేందుకు అనుమతినిస్తారు. అప్పుడే వారికి విద్యార్థి వీసా లభిస్తుంది. గతంలో కొంతమంది విద్యార్థులు, ప్రొఫెసర్ల సోషల్ మీడియా ఖాతాలను తనిఖీ చేసింది. ఈ ఏడాది మార్చిలో బ్రౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. రాషా అలావీ ఫోన్‌లో ఇరాన్ సుప్రీం లీడర్ ఫొటోలను గుర్తించారు. అనంతరం ఆమె ఆన్‌లైన్ యాక్టివిటీని పరిశీలించి దేశ బహిష్కరణ వేటు వేశారు.
గతేడాది అమెరికా విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో పాలస్తీనా మద్దతుదారుల ఆందోళనలు పెద్ద ఎత్తున జరిగాయి. అప్పటి నుంచి ట్రంప్ సర్కారు విదేశీ విద్యార్థులపై కన్నెర్ర చేసింది. ఈ క్రమంలోనే పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి విదేశీ విద్యార్థుల రికార్డులను కూడా కోరింది. తాజాగా వీసా ఇంటర్వ్యూల సమయంలోనే సోషల్ మీడియా వెట్టింగ్‌ను తీసుకొచ్చింది. దీనివల్ల విద్యార్థి వీసా ప్రాసెసింగ్‌పై పెను ప్రభావం పడటంతో పాటు అమెరికా యూనివర్సిటీలపై ఆర్థికంగానూ భారం పడనుంది. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫారిన్ స్టూడెండ్ అడ్వైజర్ నివేదిక ప్రకారం.. విదేశీ విద్యార్థుల నమోదుతో అమెరికా వర్సిటీలకు ఏటా 43.8 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతోంది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే బుక్ చేసుకొన్న విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు ప్రణాళిక ప్రకారం కొనసాగనున్నాయి.
యుఎస్ వీసా అనేది ఒక ప్రత్యేక అర్హత అని, అదొక హక్కు కాదని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. దేశ భద్రతకు ముప్పు కలిగించే దరఖాస్తుదారుల్ని గుర్తించేందుకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని స్క్రీనింగ్ చేస్తామని స్పష్టం చేసింది. యూఎస్ కంపెనీలు నిపుణులైన కార్మికులను నియమించుకునేందుకు హెచ్1బీ ప్రోగ్రామ్ అనుమతిస్తుంది. ఈ వీసాల ద్వారా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నవారిలో ఎక్కువమంది భారత్, చైనాకు చెందినవారే ఉన్నారు. విదేశీ విద్యార్థుల్లోనూ అత్యధిక మంది భారతీయులే. 2023-24 విద్యాసంవత్సరం ప్రకారం 3.32లక్షల మంది అగ్రరాజ్యంలో విద్య అభ్యసిస్తున్నారు.
సోషల్ వెట్టింగ్ నిబంధనపై ఒక్క భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సోషల్ వెట్టింగ్ కోసం పబ్లిక్ ప్రొఫైల్ పెట్టుకుంటే.. ప్రైవసీకి భంగమని పలువురు వాదిస్తున్నారు. కానీ అమెరికా మాత్రం వీసా కావాలంటే.. సోషల్ వెట్టింగ్‌కు సహకరించాల్సిందేనని తేల్చిచెబుతోంది. సోషల్ వెట్టింగ్ లో వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వొచ్చా లేదా అనే దాన్ని అంచనా వేయడానికి వారి ఆన్‌లైన్ యాక్టివిటీని, సోషల్ మీడియా ఖాతాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. కొన్ని నెలల క్రితం హెచ్-1బీ వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచిన తర్వాత తాజాగా తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు.. వీసాల కోసం ఎదురుచూస్తున్నవారికి చుక్కలు చూపిస్తున్నాయి. ఈ కఠిన చర్యలు భారత్ నుంచి అమెరికాకు వెళ్లాలనుకునే వేలాది మంది టెక్ నిపుణుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
తాజాగా వీసా ఇంటర్వ్యూల సమయంలోనే సోషల్ మీడియా వెట్టింగ్‌ను తీసుకురావడంతో…విద్యార్థుల్లోనూ గుబులు మొదలైంది. ఈ కారణంగా దీనివల్ల విద్యార్థి వీసా ప్రాసెసింగ్‌పై పెను ప్రభావం పడటంతో పాటు అమెరికా యూనివర్సిటీలపై ఆర్థికంగానూ భారం పడనుంది. సోషల్ వెట్టింగ్ కారణంగా…అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయే అవకాశం ఉంది. మరోవైపు హెచ్-1బీ వీసా ఫీజును పెంచడాన్ని గతంలో అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ న్యాయస్థానంలో సవాల్ చేసింది. 20 రాష్ట్రాలు కూడా దీన్ని సవాల్ చేశాయి. వలసల చట్టంతో సహా దాని సంబంధిత ఖర్చులలో ఇలాంటి కీలక మార్పులు చేసే అధికారం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని వాదించాయి. హెచ్-1బీ వీసాలపై అదనపు రుసుములు విధించే అధికారం ట్రంప్‌నకు లేదని స్పష్టం చేశాయి.
అమెరికాలో వలసదారుల కారణంగా ఆ దేశ పౌరులకు అవకాశాలు తగ్గిపోతున్నాయనే వాదనను బలంగా వినిపించి ట్రంప్ అధికారంలోకి వచ్చారు. అధ్యక్షుడైతే వలసల నియంత్రణపై దృష్టి పెడతానని మొదటే చెప్పారు. అక్రమ వలసలపై ఉక్కుపాదం పేరుతో ప్రక్రియ మొదలుపెట్టినా.. చివరకు వీసాలు దొరకటం కూడా గగనంగా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వృత్తినిపుణులు అందునా భారతీయుల ఎక్కువ సంఖ్యలో వలస రావటానికి హెచ్‌వన్‌బీ వీసానే రాజమార్గంగా ఉందని ట్రంప్ గుర్తించారు. దీంతో ఆ వీసా ప్రక్రియను బాగా కఠినతరం చేశారు. జాతీయ భద్రత అనే సాకు చెప్పి.. తలా తోకా లేని రూల్స్‌తో వలసదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ట్రంప్ దెబ్బతో తొలిసారి వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవారితో పాటు రెన్యువల్ కోసం చూస్తున్నవారికీ కష్టాలు తప్పటం లేదు. గతంలో ఉద్యోగం వస్తే.. వీసా గ్యారంటీగా వచ్చేది. కానీ ఇప్పుడు ఉద్యోగాలు రావడం కంటే.. వీసా రావడమే పెద్ద సమస్యగా మారింది. అలాంటి పరిస్థితిని ట్రంప్ ఉద్దేశపూర్వకంగా సృష్టించారు.