ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు నాంపల్లి కోర్టు తీర్పు ప్రకటించనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ తిరుపతన్న కీలకంగా వ్యవహరించిన విషయం బయటపడిన సంగతి తెలిసిందే.. ప్రభాకర్ రావు, భుజంగరావు ఆదేశాలతో మెరుపు దాడులు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థుల డబ్బులు ఎక్కడికి రవాణా అవుతుంటే అక్కడికి వెళ్లి పట్టుకున్నారు తిరుపతన్న. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు డబ్బు చేరకుండా దాడులు చేసి పట్టుకున్నారు. ఇద్దరు ఇన్స్పెక్టర్లతో పాటు పది మంది కానిస్టేబులు, పది మంది హెడ్ కానిస్టేబుల్స్తో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి రోజు 40 మంది సెల్ ఫోన్లను టాపింగ్ చేశారు. మూడు ఉప ఎన్నికలతో పాటు మొన్నటి సాధారణ ఎన్నికల్లో కూడా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ గా తిరుపతన్న పని చేశారు. మొత్తం 300 మంది సెల్ ఫోన్లను తిరుపతన్న టీం ట్యాపింగ్ చేశారు. ఈ క్రమంలో.. మూడు సిస్టమ్స్ తో పాటు తొమ్మిది లాగర్స్ ని ఏర్పాటు చేసుకున్నట్లు విచారణలో తేలింది.
Read Also: AP EAPCET: ఈఏపీసెట్-2024 ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్తో మీ రిజల్ట్స్ తెలుసుకోండి
ఈ క్రమంలో.. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మార్చి 10న ఫోన్ టాపింగ్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటి వరకు ఈ వ్యవహారంలో నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితులుగా ఆరుగురిని చేర్చారు. కాగా.. ఈ కేసులో అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్ లు దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే తమను అరెస్టు చేసినట్టు నిందితుల తరుపు వాదనలు చేశారు. ఈ కేసులో సాక్షాధారాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషనర్ వాదనలు వినిపించారు. ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సింది చాలా ఉంది కాబట్టి.. బెయిల్ మంజూరు చేయొద్దని పీపీ తెలిపారు. కాగా.. ఇరువురి బెయిల్ పిటిషన్ల పై వాదనలు పూర్తి అయ్యాయి. దీంతో.. రేపు నాంపల్లి కోర్టు తీర్పు ప్రకటించనుంది.