ఎగువున కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా బేసిన్‌లో ఎగువున ఉన్న ప్రాజెక్టులు గరిష్ట నీటి మట్టానికి చేరుకున్నాయి. దిగువ ప్రాజెక్టుల వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. కొన్నేళ్లుగా నీటి కొరతను ఎదుర్కొన్న ఏపీలో ఇప్పుడు కృష్ణమ్మ ఉగ్రరూపం భయపెడుతోంది. పులి చింతల ప్రాజెక్టులో ఏర్పడిన సాంకేతిక సమస్యతో వరద ప్రవాహాన్ని గుర్తించడంలో తలెత్తిన లోపాన్ని మంగళవారం అధికారులు గుర్తించారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు దిగువకు వస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ నుంచి వరద నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం 70 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
READ MORE:Tollywood: టాలీవుడ్ టుడే టాప్ 3 అప్ డేట్స్.. జస్ట్ ఒక్క క్లిక్ తోనే..
ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 1,01,767 క్యూసెక్కులు ఉంది. వివిధ ప్రాజెక్టుల్లో దిగువకు వరద నీటి విడుదలైంది. కృష్ణానదీ పరీవాహక ప్రాంత ప్రజలు, లంకగ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. పంట్లు, నాటుపడవలతో నదిలో ప్రయాణించవద్దని హెచ్చరించింది. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని స్పష్టం చేశారు. పశువులు, గొర్రెలు, మేకలు వంటి జంతువులను ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతలకు తరలించాలని సూచించారు. అత్యవసర సహాయం కోసం 1070, 112, 18004250101 టోల్ ఫ్రీ నెంబర్లకు డయల్ చేయాలన్నారు. దయచేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మరీ మరీ సూచించారు.