దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు వాతావరణ శాఖ లిస్టు విడుదల చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 16 నుంచి వర్షాలు కురిసే ఛాన్సుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఒడిషా, చండీగఢ్, మధ్యప్రదేశ్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో మార్చి 16 నుంచి 21 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇక మార్చి 20, 21 తేదీల్లో జమ్మూకాశ్మీర్, లడఖ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు వాతావరణ శాఖ సూచించింది.
అలాగే మార్చి 16 నుంచి మార్చి 18 వరకు తూర్పు మరియు మధ్య భారతదేశంలో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంటున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్, ఒడిశా, బీహార్ తూర్పు భాగంలో ఈ ప్రభావం ఉండొచ్చని తెలిపారు.
ఇదిలా ఉంటే గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగమండిపోతున్నాడు. ఉదయం నుంచే సూరీడు మండిపోతున్నాడు. దీంతో ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. దీంతో వాతావరణ శాఖ చెప్పిన కబురుతో వర్షాలు కురిస్తే ఉపశమనం పొందాలను ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇక పిల్లలకు వడదెబ్బ తగలకుండా స్కూల్ పిల్లలకు ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు.