సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఏ సినిమా విడుదలకు అయినా కనీసం 90 రోజుల ముందే టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ విధానంలో మార్పు అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ వ్యవహారంలో మన శంకర వర ప్రసాద్ సినిమా టికెట్ ధరల పెంపు అంశంపై హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు అయ్యింది. టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధంగా జారీ చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ లాయర్ విజయ్ గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టికెట్ ధరల పెంపు వల్ల ప్రేక్షకులపై ఆర్థిక భారం పడుతోందని, నిర్మాతలు అందిన కాడికి దోచుకుంటున్నారని, అసలు నిర్ణిత గడువు లేకుండా హైక్స్ ఉత్తర్వులు ఇవ్వడం చట్టవిరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు.
Also Read : Multi-Starrer Movies : ఆ ఇండస్ట్రీలో రాబోయే భారీ సినిమాలన్నీ మల్టీస్టారర్లే..
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, హోంశాఖ ప్రధాన కార్యదర్శికి కీలక నోటీసులు జారీ చేసింది. అలాగే ఇకపై ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా, సినిమా విడుదలకు 90 రోజుల ముందే సినిమా టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పు సినిమా పరిశ్రమలో కీలక అంశంగా మారింది. సినిమా టికెట్ ధరల పెంపుపై స్పష్టత, పారదర్శకత ఉండాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు భవిష్యత్తులో మార్గదర్శకంగా నిలవనున్నాయి. ఇక నైజాంలో రిలీజ్ అయ్యే భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ ధరలు పెంచుకునేందుకు సానుకూల పరిస్థితులు ఉంటాయా అనే చర్చ ఇండస్ట్రీ సర్కిల్స్ వినిపిస్తుంది.