హర్యానాలోని నుహ్ హింసాత్మక ఘటనలో నష్టపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందజేస్తుందని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ప్రత్యేక పోర్టల్ ద్వారా బాధితులను గుర్తించి పరిహారం ఇస్తామని పేర్కొన్నారు. నుహ్‌లో జరిగిన హింసాకాండపై సీఎం మాట్లాడుతూ.. ఘటనకు పాల్పడిన నిందితులను గుర్తిస్తున్నట్లు తెలిపారు. అల్లర్లకు పాల్పడ్డ దోషులెవరూ తప్పించుకోలేరని ఆయన తెలిపారు.
Jayasudha: బీజేపీ తీర్థం పుచ్చుకున్న జయసుధ.. మళ్లీ పోటీ అనేది కేవలం రూమర్
నుహ్‌లో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తామని సీఎం ఖట్టర్ తెలిపారు. అల్లర్ల బాధితులు హర్యానా ప్రభుత్వ ఇ-పరిహారం పోర్టల్‌లో నష్ట సమాచారాన్ని అప్‌లోడ్ చేయాలని పేర్కొన్నారు. ఆ పోర్టల్‌లో ఫారమ్‌ను నింపి ప్రజలు ఎంత నష్టపోయారో చెప్పవచ్చని ఆయన చెప్పారు. అన్ని చర, స్థిరాస్తుల నష్టాన్ని అంచనా వేసి దాని ఆధారంగా పరిహారం ప్రకటిస్తామని సీఎం అన్నారు.
నుహ్ లో హింసాత్మక ఘటనల దృష్ట్యా.. IRB ఒక బెటాలియన్ జిల్లాలోనే ఉంటుందని సీఎం ఖట్టర్ తెలిపారు. ఈ హింసాకాండలో ఆరుగురు చనిపోయారని అన్నారు. నుహ్ జిల్లాలో ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా 20 పారామిలటరీ బలగాలను మోహరించామని సీఎం తెలిపారు. ఈ ఘటనలతో ప్రమేయమున్న 166 మందిని అరెస్ట్ చేశామని.. మరో 90 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. మరోవైపు సోహ్నాలో జరిగిన హింసాకాండలో.. ఆందోళనకారులు నాలుగు వాహనాలు, ఒక దుకాణాన్ని తగులబెట్టారు. గురుగ్రామ్‌లో కూడా కొన్ని దుకాణాలను ధ్వంసం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి అదుపులో ఉందని, నుహ్‌లో కర్ఫ్యూను సడలించినట్లు డీజీపీ చెప్పారు.