Tirupati Stampede: తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తీవ్ర కలకలం రేపింది.. అయితే, వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై జ్యుడీషియల్ ఎంక్వైరీ తొలిదశ ముగిసింది.. నిన్న న్యాయ విచారణ కమిషన్ ముందు కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ ఇంఛార్జ్ సీవీఎస్ఓ మణికంఠ, వీజీవో సదాలక్ష్మిలు మూడో రోజు హాజరయ్యారు. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల పంపిణీలో ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.. పద్మావతి పార్కులో ఎంత మంది భక్తులు వేచిఉండే అవకాశం ఉంది.. లోపలికి ఎంతమందిని పంపారని కలెక్టర్ వెంకటేశ్వర్లను కమిషన్ ప్రశ్నించింది. ఇప్పటివరకు టీటీడీ దర్శన ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకోవడం లేదని కలెక్టర్ తెలపగా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు తావు లేకుండా ఉండటానికి చొరవ చూపాలని కమిషన్ సూచించినట్లు సమాచారం. తొక్కిసలాట ఘటనకు ముందు.. తర్వాత పలు శాఖలకు ఇచ్చిన సూచనలు, ఆదేశాల గురించి సీవీఎస్ఓ వివరించారు. క్యూలైన్ల నిర్వహణలో విజిలెన్స్ విభాగం తీసుకున్న చర్యలు.. భవిష్యత్తులో పాటించాల్సిన భద్రతా చర్యల వివరాలు త్వరలో అందజేస్తామని సీవీఎస్ఓ గడువు కోరినట్లు సమాచారం.
Read Also: MLC Sipai Subramanyam: వైసీపీ ఎమ్మెల్సీ కిడ్నాప్..! వీడియో విడుదల చేసిన ఎమ్మెల్సీ సిపాయి..
ఇక, పోలీసు, టీటీడీ వి జిలెన్సు విభాగం రికార్డుల సమర్పణకు గడువు కోరాయి. టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టోకెన్ల జారీ క్యూలైన్‌లో ఆరుగురు మరణించడం అదే తొలిసారి. జనవరి నెల 8వ తేదీన జరిగిన ఈ తొక్కిసలాట ఘటనను తీవ్రంగా పరిగణించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హుటాహుటిన తిరుపతి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఇద్దరు అధికారుల సస్పెన్షన్, ముగ్గురు అధికారుల బదిలీలు చేశారు. బాధిత కుటుంబాలకు టీటీడీ తరఫున నష్టపరిహారం సైతం చెల్లించారు. ఈ ఘటనపై మాజీ న్యాయమూర్తితో విచారణకు ఆదేశించారు. తిరుపతిలోని పద్మావతి పార్క్ వద్ద జరిగిన తొక్కిసలాటలో వైకుంఠ ఏకాదశి దర్శనానికి టోకెన్ల కోసం ఎదురుచూస్తున్న ఆరుగురు భక్తులు మరణించడానికి దారి తీసిన పరిస్థితులేమిటో కమిషన్ విచారణ చేయాలని ఉత్తర్వుల్లో జారీచేసింది .. ఈ మేరకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి నేతృత్వంలోని కమిషన్ తొక్కిసలాట ఘటనపై తొలిరోజు పద్మావతి పార్క్ , రామనాయుడు స్కూల్ లో పర్యటించి పూర్తిస్థాయి న్యాయ విచారణ చేపట్టింది. ఘటన జరిగిన పద్మావతి పార్క్ విస్తీర్ణం ఎంత.. బయటకు రావడానికి, లోపలికి వెళ్ళడానికి ఎంత స్థలం ఉంది.. బారిగెట్లు ఎంత వెడల్పు ఎర్పాటు చేశారు.. అనే అంశాలను గ్రౌండ్ లెవెల్ వెళ్ళి పరిశీలించారు.
Read Also: MLC Sipai Subramanyam: వైసీపీ ఎమ్మెల్సీ కిడ్నాప్..! వీడియో విడుదల చేసిన ఎమ్మెల్సీ సిపాయి..
రెండోరోజు టీటీడీ, రుయా, స్విమ్స్, పోలీసు అధాధికారులు జస్టిస్ సత్యనారాయణమూర్తి వేర్వేరుగా విచారించారు. కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, టీటీడీ ఈవో శ్యామలరావు, రుయా, స్విమ్స్ ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా టోకెన్ల జారీ కేంద్రాల వద్ద ఏర్పాట్లకు సంబంధించి ముందస్తుగా నిర్వహించిన సమావేశం మినిట్స్ గురించి, ఏయే శాఖలు, విభాగాల అధికారులతో సమన్వయ సమావేశాలు పెట్టారన్న అంశాలపై ఈవోను జస్టిస్ సత్యనారాయణమూర్తి ప్రశ్నించారు. టోకెన్ల కేంద్రాల వద్ద అధికారులు, సిబ్బందికి విధుల కేటాయింపునకు సంబంధించిన వివరాలపై ఆరాతీశారు. బైరాగిపట్టెడ కేంద్రం వద్ద ఏం జరిగింది? పోలీసుశాఖతో సమన్వయం చేసుకున్నారా? వంటి ప్రశ్నలు వేశారు. వాటికి సంబంధించిన రికార్డులను కమిషన్ పరిశీలన నిమిత్తం టీటీడీ అధికారులు అందజేశారు. సుమారు 2 గంటల పాటు కమిషన్ టీటీడీ అధికారులను విచారించింది. ఇక, రుయాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు, ఫోరెన్సిక్ విభాగం హెడ్ డాక్టర్ శశికాంత్, ఫోరెన్సిక్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రావతి, క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కీర్తి, నర్సింగ్ అధికారులను కమిషన్ విచారించింది. రుయాస్పత్రి నుంచీ మెరుగైన చికిత్స కోసం స్విమ్స్ ఆస్పత్రికి ఎంతమందిని తరలించారు? రుయాస్పత్రిలో మృతులు ఎందరు? వారికి నిర్వహించిన పోస్టుమార్టం నివేదికల ప్రతులు అందజేయాలని ఆదేశించారు. అనంతరం స్విమ్స్ వైద్య సంస్థ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కమిషన్ ఎదుట హాజరు కాగా ఆయన్ను కూడా ప్రశ్నించింది. చివరగా జిల్లా లా అండ్ ఆర్డర్ అదనపు ఎస్పీ రవిమనోహరాచారి విచారణకు హాజరయ్యారు. టోకెన్ల జారీ కేంద్రం వద్ద బందోబస్తు, క్యూలైన్ల ఏర్పా ట్లు, బ్యారికేడ్ల వంటి అంశాలపై ప్రశ్నించి సమాధానా లు రికార్డు చేశారు. టోకెన్ల జారీ కేంద్రం రామానాయుడు స్కూలు ఆవరణలో ఉండగా భక్తులను పద్మావతి పార్కులోకి ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు.
Read Also: TGCHE: ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారా?.. ఇకపై ఒక్కో ప్రశ్నకు రూ. 500 ఫీజు
ఇలా మూడవరోజు కీలకమైన అధికారులను విచారించిన కమీషన్ తొక్కిసలాటలో గాయపడిన 46 మంది, మృతి చెందిన ఆరుగురి కుటుంబాలకు సంబంధించిన వారిని రెండోద దశలో కమిషన్ విచారించనుంది. ఈ మేరకు విచారణకు హాజరు కావాలని వారందరికీ నోటీసులు పంపారు. తొక్కిసలాట నేపథ్యంలో సస్పెండ్, బదిలీ అయిన అధికారులు, ఇతర సిబ్బందిని మూడవ దశలో కమిషన్ విచారించనున్నట్లు సమాచారం. తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఏమైనా సమాచారం, ఆధారాలు ఉంటే తమకు అందజేయాలని ప్రజలకు న్యాయవిచారణ కమిషన్ పిలుపునిచ్చింది. 20 రోజుల్లోపు వాంగ్మూలాన్ని ప్రమాణబద్ధమైన అఫిడవిట్తో కలిపి సమర్పించాలన్నారు. ఆ తరువాత ఎటువంటి పత్రాలు, సాక్ష్యాలు స్వీకరించబోమని తెలిపింది. వీటిని ఈ నెల 24వ తేదీ వరకు న్యాయవిచారణ కమిషన్ సమర్పించాలని ప్రజలను కోరింది.. రెండో దశ విచారణకు ఈ నెల 20వ తేదీ తరువాత తిరిగి తిరుపతికి రానున్నట్లు తెలుస్తోంది.