Poonch Attack: జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్‌లో ఆర్మీ ట్రక్కుపై మెరుపుదాడి చేసిన ఉగ్రవాదులు సాయుధ కవచాన్ని చీల్చగల ఉక్కు బుల్లెట్లను ఉపయోగించినట్లు తెలిసింది. గురువారం మధ్యాహ్నం భటా ధురియన్ దట్టమైన అటవీ ప్రాంతంలో సమీపంలోని గ్రామానికి ఇఫ్తార్ కోసం తినుబండారాలు తీసుకెళ్తున్న ఒంటరి ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఐదుగురు సైనికులు మరణించగా.. ఒకరు గాయపడ్డారు. వాహనం మంటల్లో చిక్కుకుంది. ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయిన తీవ్రవాద దాడికి సంబంధించి 16 మందిని పోలీసులు ప్రశ్నించడానికి అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలం నుంచి మరికొన్ని తూటాలను స్వాధీనం చేసుకున్నారు. వారు ప్రయాణిస్తున్న ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేయడంతో ఆర్మీ రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్‌కు చెందిన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు ట్రక్కుపై బుల్లెట్లు, గ్రెనేడ్లతో విరుచుకుపడ్డారు, ఫలితంగా ఇంధన ట్యాంక్ పగిలిపోయింది. వాహనంలో మంటలు చెలరేగి ట్రక్కును వెంటనే చుట్టుముట్టాయి.
అక్టోబరు 2021 దాడి తర్వాత సైన్యంపై ఇది రెండవ దాడి, ఇందులో ఇద్దరు జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్లు సహా తొమ్మిది మంది సైనికులు మరణించారు. ఉగ్రవాదులు సమీపంలోని అడవుల్లోకి పారిపోయిన తర్వాత వారి జాడ తెలియలేదు.గురువారం దాడి అనంతరం సీనియర్ పోలీసు, ఆర్మీ అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. దుండగుల ఆచూకీ కోసం ఆ ప్రాంతంలో పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. నేరస్తులను గుర్తించేందుకు భద్రతా బలగాలు డ్రోన్లు, హెలికాప్టర్లు, స్నిఫర్ డాగ్‌లను కూడా రంగంలోకి దించాయి. శుక్రవారం, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ), రాష్ట్ర దర్యాప్తు సంస్థ (ఎస్ఐఎ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) బృందాలు మరియు డిజిపి దిల్బాగ్ సింగ్, అదనపు డిజిపి ముఖేష్ సింగ్‌తో సహా పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు కోసం సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
ఉగ్రవాదులు సాయుధ కవచంలోకి చొచ్చుకుపోయే స్టీల్ కోర్ బుల్లెట్లను ఉపయోగించారని ఉన్నతాధికారులు తెలిపారు. ఉగ్రవాదులు పారిపోయే ముందు సైనికుల ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అపహరించినట్లు వారు తెలిపారు.దాడి జరిగిన ప్రాంతం చాలా కాలంగా తీవ్రవాద రహితంగా పరిగణించబడుతున్నప్పటికీ, భటా ధురియన్ అటవీ ప్రాంతం దాని భౌగోళిక స్వరూపం, దట్టమైన అటవీప్రాంతం కారణంగా నియంత్రణ రేఖ (ఎల్ఓసి) దాటి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించే ఉగ్రవాదుల చొరబాటు మార్గంగా పేరుగాంచింది. అక్టోబరు 2021లో, మూడు వారాల పాటు కొనసాగిన శోధన ఆపరేషన్‌లో అటవీ ప్రాంతంలో నాలుగు రోజుల్లోనే ఉగ్రవాదులతో జరిగిన రెండు ప్రధాన కాల్పుల్లో తొమ్మిది మంది సైనికులు మరణించారు.
Read Also: Military Level Talks: తూర్పు లడఖ్ సరిహద్దు వివాదం.. చైనాతో మరోసారి భారత్ సైనిక చర్చలు
గురువారం నాటి ఆకస్మిక దాడి రెండు దశాబ్దాల క్రితం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అధికారిక వాహనంపై జరిగిన తీవ్రవాద దాడిని కూడా గుర్తు చేసింది. డిసెంబరు 5, 2001న భాటా ధురియన్ అడవుల సమీపంలోని డెహ్రా కీ గాలీ అడవులలో జరిగిన ఈ దాడిలో జిల్లా సెషన్స్ జడ్జి వీకే ఫూల్, ఒక పౌరుడు, ఇద్దరు పోలీసు సిబ్బంది మరణించారు. పూంచ్ దాడికి సంబంధించి 16 మందిని అదుపులోకి తీసుకున్నామని, అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని అధికారులు తెలిపారు. దట్టమైన అడవిలో రెక్కీ నిర్వహించడానికి భద్రతా దళాలు డ్రోన్లు, స్నిఫర్ డాగ్‌లను ఉపయోగిస్తున్నాయి. భద్రతా వల నుండి తప్పించుకోవడానికి ఉగ్రవాదులు దట్టమైన అడవిలో సురక్షిత రహస్య స్థావరాలను సృష్టించగలిగారని లేదా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు చేరుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. అధికారుల ప్రకారం, దాడిలో కొంతమంది విదేశీ కిరాయి సైనికులతో సహా ఐదుగురు ఉగ్రవాదుల ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. ఆకస్మిక దాడి తరువాత, ఉగ్రవాదులు బహుశా గ్రెనేడ్లతో పాటు స్టిక్కీ బాంబులను ఉపయోగించారు. అందువల్లే వాహనంలో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు.
ఈ ప్రాంతంలో జమ్మూ కశ్మీర్ ఘజ్నవీ ఫోర్స్ (జేకేజీఎఫ్) అనే ఉగ్రసంస్థ చురుగ్గా ఉంది. దాని కమాండర్ రఫీక్ అహ్మద్ అలియాస్ రఫీక్ నాయక్ ఈ ప్రాంతానికి చెందినవాడే. రాజౌరీ, పూంఛ్ జిల్లాల్లో కనీసం మూడు నుంచి నాలుగు ఉగ్రముఠాలు చురుగ్గా పనిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (పిఎఎఫ్ఎఫ్), జైషే మహ్మద్ ప్రాక్సీ వింగ్ ఈ దాడికి బాధ్యత వహించింది. ఇది నిషేధిత లష్కరే తోయిబా గ్రూప్ కూడా ఇలాగే దాడికి పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకే ఈ దాడిలో కూడా ప్రమేయం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.