Terrorist Attack: పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉగ్రదాడి ఘటన చోటు చేసుకుంది. ఈ ఉగ్రదాడిలో 50 మంది మరణించినట్లు సమాచారం అందుతోంది. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని డౌన్ కుర్రం ప్రాంతంలో ప్రయాణీకుల వ్యాన్‌పై ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఓ పోలీసు అధికారి, మహిళలు సహా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. అందిన నివేదిక ప్రకారం.. ఈ దాడిలో 50 మంది మరణించారు. దిగువ కుర్రంలోని ఓచుట్ కలి, మండూరి సమీపంలో ప్యాసింజర్ వ్యాన్ వెళ్లగానే అప్పటికే అక్కడ ఉన్న ఉగ్రవాదులు వ్యాన్‌పై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.
స్థానిక మీడియా ప్రకారం, ప్యాసింజర్ వ్యాన్ పరాచినార్ నుంచి పెషావర్ వెళ్తోంది. తహసీల్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ అలీజాయ్ అధికారి డాక్టర్ ఘయోర్ హుస్సేన్ దాడిని ధృవీకరించారు. చనిపోయిన వారిలో 14 మందికి ఎలాంటి గుర్తింపు కార్డులు లేవని, అందుకే వారిని ఇంకా గుర్తించలేదని వారి బంధువులను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ ఘటనను పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ఆయన తన సానుభూతిని తెలిపారు. మరోవైపు, అమాయక ప్రయాణీకులపై దాడి చేయడం పిరికితనం, అమానవీయ చర్య అని PPP సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని పార్టీ పేర్కొంది. దీంతో పాటు క్షతగాత్రులకు సకాలంలో వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
Also Read: Koti Deepotsavam 2024 Day 13 LIVE: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కల్యాణం.. ప్రత్యక్షప్రసారం
ఈ ఘటనపై ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ చీఫ్ సెక్రటరీ నదీమ్ అస్లాం చౌదరి మాట్లాడుతూ.. కుర్రంలో జరిగిన దాడిలో మరణించిన వారిలో ఒక మహిళ, ఒక చిన్నారి కూడా ఉన్నారని చెప్పారు. ఇది పెద్ద విషాదమని మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. అయితే ఈ ఘటనకు ఇప్పటి వరకు ఏ గ్రూపు బాధ్యత తీసుకోలేదు. రెండు ప్యాసింజర్ వాహనాల కాన్వాయ్‌లు ఉన్నాయని, ఒకటి పెషావర్ నుండి పరాచినార్‌కు, మరొకటి పరాచినార్ నుండి పెషావర్‌కు ప్రయాణీకులను తీసుకెళ్తుండగా సాయుధ వ్యక్తులు వారిపై కాల్పులు జరిపారని పరాచినార్ లోని స్థానిక నివాసి తెలిపారు. ఆ కాన్వాయ్‌లో తన బంధువులు పెషావర్ నుంచి ప్రయాణిస్తున్నారని చెప్పుకొచ్చాడు.