Telugu Indian Idol: తెలుగువారి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో విజయవంతమైన షో… తెలుగు ఇండియన్ ఐడల్! శ్రీరామచంద్ర వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షోకు తమన్, నిత్యామీనన్, కార్తిక్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని వారే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన సింగర్స్ కూడా కొందరు ఈ షోలో పాల్గొని, తెలుగు పాటలు పాడి వ్యూవర్స్ ను ఆకట్టుకున్నారు. ఈ షోకు లభించిన ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు సీజన్ -2 కు ఆహా సంస్థ శ్రీకారం చుట్టింది.
Read Also: Team India: టీమిండియాకు ఎదురుదెబ్బ.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు కీలక ఆటగాడు దూరం
నటసింహం నందమూరి బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్ షో’ ద్వారా తాజాగా ఈ విషయాన్ని తెలియచేశారు. తెలుగు ఇండియన్ ఐడల్ లో పార్టిసిపెంట్స్ ముగ్గురు అన్ స్టాపబుల్ వేదికపై బాలకృష్ణ సినిమాల్లోని పాటలు పాడి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా వారే… తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఆడిషన్స్ త్వరలోనే వివిధ పట్టణాలలో మొదలు కాబోతున్నాయని తెలిపారు. ఫస్ట్ సీజన్ లో పాల్గొన్న సింగర్స్ కు ఆహా సంస్థ ద్వారా పలు చిత్రాలలో పాటలు పాడే ఛాన్స్ దక్కింది. వాళ్ళు ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
మరో విశేషం ఏమంటే… ఈ సింగర్స్ లో కొందరు వాణిజ్య ప్రకటనల్లోనూ మెరుస్తున్నారు. అయితే… సీజన్ 2కు వ్యాఖ్యాతగా శ్రీరామచంద్రనే వ్యవహరిస్తాడా? వేరెవరికైనా ఈ బాధ్యతలు అప్పగిస్తారా? అనేది తెలియలేదు. అలానే ఈసారి న్యాయనిర్ణేతలుగా ఎవరు వ్యవహరిస్తారనే విషయంలోనూ షో నిర్వాహకులు పెదవి విప్పడం లేదు. వివిధ నగరాలలో ఆడిషన్స్ జరిగి, పార్టిసిపెంట్స్ ను ఎంపిక చేసిన తర్వాత ఈ వివరాలు అందించే ఆస్కారం ఉంది. ఏదేమైనా ఫస్ట్ సీజన్ సక్సెస్ అయిన నేపథ్యంలో సెకండ్ సీజన్ పట్ల కూడా అందరిలో ఆసక్తినెలకొంది.
https://www.youtube.com/watch?v=XiqKxva__AU