తెలుగు అకాడమీ కేసులో ముగ్గురు కీలక పాత్ర పోషించినట్లు గా పోలీసుల విచారణలో బయట పడింది. ముగ్గురు దొరికితే కానీ అసలు రహస్యం బట్టబయలు కాదని పోలీసులు అంటున్నారు. ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన యూనియన్ బ్యాంకు మేనేజర్ మస్తాన్వలి కి ఈ ముగ్గురు సహకరించినట్లు గా విచారణలో వెలుగుచూసింది. రాజకుమార్, శ్రీనివాసు, సోమ శేఖర్ లు ఈ కేసులో కీలకంగా ఉన్నారని సిసిఎస్ పోలీసులు చెప్తున్నారు. మస్తాన్వలి నిధులను డ్రా చేసి ఇచ్చిన తర్వాత ఈ ముగ్గురే వాటిని తీసుకుని వెళ్లారని చెప్తున్నారు. ఆంధ్ర, ముంబై హైదరాబాద్ లోని కొంత మంది వ్యక్తులకు ఈ నిధులు వెళ్ళినట్టుగా అధికారులు చెప్పారు. అయితే నిధులు ఎవరు ..ఎక్కడికి అనే విషయం తెలియాలంటే ముగ్గురు దొరికితే కానీ అసలు విషయం బహిర్గతం కాదని అంటున్నారు. ఇదిలా ఉంటే తెలుగు అకాడమీ కి సంబంధించిన యాభై నాలుగు కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లను కాజేసిన ముఠా… కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన డబ్బులు కూడా కొట్టేశారు. ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్ల కు సంబంధించి తొమ్మిది కోట్ల రూపాయలు డబ్బులను దోచుకున్నమని మస్తాన్వలి విచారణలో బయట పడింది. ఇప్పుడు పోలీసులు ప్రైవేట్ వ్యక్తుల డిపాజిట్లు గల్లంతు పైన దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో యూనియన్ బ్యాంక్ తో పాటుగా చందానగర్ బ్యాంకు అధికారులను పోలీస్ విచారిస్తున్నారు. మరోవైపు తెలుగు అకాడమీ డైరెక్టర్ పదవి నుంచి ఇటీవల వేటు పడిన సోమిరెడ్డి ని కూడా సిసిఎస్ పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు తెలుగు అకాడమీ అకౌంట్ సెక్షన్ లో కీలక అధికారి కూడా సిసిఎస్ పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసిన మస్తాన్వలి, సత్యనారాయణ, మోహినుద్దీన్, పద్మావతి లను తిరిగి తమ కస్టడీకి ఇవ్వాలని సిసిఎస్ పోలీసులు కోర్టును ఆశ్రయించారు. పది రోజుల పాటు తమ కస్టడీకి నలుగురిని ఇచ్చినట్లయితే మరిన్ని విషయాలు వెలికి తీస్తామని పోలీసులు అంటున్నారు.
: రమేష్ వైట్ల