DGP Shivadhar Reddy: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సన్నాహాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ రాణి కుమిదిని, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డిలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులు, సంబంధిత అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ… గత ఎన్నికల నిర్వహణలో ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకుని, శాంతిభద్రతల నిర్వహణ సులభతరం చేయడానికి ప్రతి జిల్లాలో ఎన్నికలను మూడు దఫాలుగా నిర్వహించాలని ప్రతిపాదించారు. అంతేకాకుండా ఒక ప్రాంతంలోని ఎన్నికలు పూర్తయిన తర్వాత, మరొక ప్రాంతంలో ఎన్నికలకు మధ్యలో రెండు రోజుల విరామం ఉండాలని డీజీపీ అభిప్రాయపడ్డారు. ఈ విరామం వలన సిబ్బందికి, భద్రతా బలగాలకు తగిన సమయం లభిస్తుందని, బందోబస్తు నిర్వహణ మరింత సమర్థవంతంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికలు పూర్తయిన రోజు ఫలితాలు సాయంత్రం ప్రకటిస్తున్న నేపథ్యంలో ర్యాలీలు నిర్వహించే అవకాశం ఉన్నందున రెండు రోజుల విరామం అవసరమని స్పష్టం చేశారు.
READ MORE: Priyanka Mohan ; కన్నడకు రీఎంట్రీ ఇచ్చిన ప్రియాంక మోహన్ – 1970 బ్యాక్‌డ్రాప్‌లో భారీ ప్రాజెక్ట్!
రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ఎన్నికల సందర్భంగా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తామని డీజీపీ హామీ ఇచ్చారు. ముఖ్యంగా, సమస్యాత్మక ప్రాంతాల పట్ల, అలాగే అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తుల పట్ల అప్రమత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.. డీజీపీ సూచనలు, భద్రతా అంశాల చర్చానంతరం, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు వీలుగా, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించి, త్వరితగతిన చర్యలు తీసుకోవడానికి రాష్ట్రస్థాయి రివ్యూ కమిటీని ఏర్పాటు చేయాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈ సందర్భంగా అధికారులకు సూచించింది.