Panchayat Elections : పంచాయితీ ఎన్నికలపై సర్కార్‌ కసరత్తు..!

  • పంచాయితీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ సర్కార్ కసరత్తు
  • డెడికేషన్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాతే తుది నిర్ణయం
  • ఫిబ్రవరి 2 లోపు ఈ నివేదిక సమర్పించబడుతుందని కమిషన్ హామీ
Revanth Reddy

Revanth Reddy

Panchayat Elections : తెలంగాణ ప్రభుత్వం పంచాయితీ ఎన్నికల నిర్వహణపై తర్జనభర్జనలో ఉంది. డెడికేషన్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఫిబ్రవరి 2 లోపు ఈ నివేదిక సమర్పించబడుతుందని కమిషన్ హామీ ఇచ్చింది. నివేదిక అందిన వెంటనే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వం ఫిబ్రవరిలోనే పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే బుధవారం, ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Venkatrami Reddy: గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే గురించి చర్చించబడింది. ఇంటింటి సర్వే విజయవంతంగా పూర్తయిందని గుర్తించిన సీఎం, దీని నిర్వహణలో భాగమైన అధికారులను అభినందించారు. అయితే, పంచాయితీ ఎన్నికల నిర్వహణపై ఏదైనా స్పష్టమైన నిర్ణయం వస్తుందని అనుకున్నప్పటికీ, ప్రభుత్వం ఇంకా తర్జనభర్జనలోనే ఉంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల పెంపు అవకాశాలను పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ, ఈ రిజర్వేషన్లను అమలు చేయాలంటే న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే, పాత విధానాన్ని కొనసాగించాలా లేదా కోర్టుల అనుమతి తీసుకుని రిజర్వేషన్ల శాతం పెంచాలా అనే అంశంపై ప్రభుత్వం చర్చిస్తోంది. న్యాయ నిపుణుల సలహాలను తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.

2024 ఫిబ్రవరి 1 న పంచాయతీల్లో సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం ప్రత్యేక అధికార పాలన కొనసాగుతోంది. ప్రభుత్వం త్వరగా రిజర్వేషన్లపై స్పష్టత తీసుకొస్తే, 15 రోజుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.

మొత్తం మీద, పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునేందుకు డెడికేషన్ కమిషన్ నివేదిక వేచిచూస్తోంది. రిజర్వేషన్ల వ్యవహారం, న్యాయపరమైన సమస్యలతో ప్రభుత్వం తర్జనభర్జనకు గురవుతోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రావచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Central Cabinet Decisions: నేషనల్ క్రిటికల్ మిషన్‌కు కేబినెట్ ఆమోదం.. ఎన్ని కోట్లు కేటాయించారంటే..!