Minister UttamKumar Reddy Talks About Rs 500 Gas Cylinder: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో ‘రూ. 500కే గ్యాస్ సిలిండర్’ కూడా ఒకటి. ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రూ. 500కే గ్యాస్ సిలిండర్‌ను 100 రోజుల్లో అమలుచేస్తాం అని తెలిపింది. ఈ మేరకు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. నేడు పౌరసరఫరాలశాఖపై ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ, మిల్లింగ్ సామర్థ్యం, బియ్యం నాణ్యతపై అధికారులు వివరించారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. గత పాలకుల వల్ల పౌరసరఫరాలశాఖలో తప్పిదాలు జరిగాయని, ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు.
‘సివిల్ సప్లై శాఖ రాష్ట్రంలో ముఖ్యమైన శాఖ. రైతుల నుంచి ప్రోక్యూర్మెంట్ చేసే శాఖ. గ్యాస్ సిలిండర్ రూ. 500, ప్యాడి ప్రోక్యూర్మెంట్‌లో రూ. 500 పెంచేది వంద రోజుల్లో అమలు చేస్తాం. 5 కిలోల బియ్యం కేంద్రం ఇస్తుంది. రాష్ట్రం ఇచ్చే కిలో బియ్యం క్వాలిటీ పెరగాలి. ఇప్పటివరకు ఒక కిలోనే ప్రతీ మనిషికి బీఆర్ఎస్ ఇచ్చింది. లబ్ధిదారుల నుంచి పీడీఎస్ రైస్ డైవర్ట్ అయ్యింది. లబ్ధిదారులకు తినగలిగే రైస్ ఇవ్వాలి. 2 కోట్ల 80 లక్షల మంది లబ్ధిదారులున్నారు. ప్రోక్యూర్మెంట్‌కు సివిల్ సప్లై అన్ని చర్యలు తీసుకోవాలి’ అని మంత్రి ఉత్తమ్‌కుమార్ అన్నారు.
‘రైతులకు డబ్బులు వెంటనే అందే విధంగా చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వం ఈ శాఖ, ఆర్థిక శాఖకు సహాయం చేయకపోవడంతో 56 వేల కోట్లు అప్పు చేసింది. సివిల్ సప్లై కార్పొరేషన్ 90 లక్షల మెట్రిక్ టన్నులు. 18వేల కోట్ల విలువైన ప్యాడి రైస్ మిల్లర్ల వద్ద ఉంది. దీనిపై ఏం చేయాలనేది క్యాబినెట్‌లో చర్చిస్తాం. 1.17లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సివిల్ సప్లై వద్ద ఉంది. 11వేల కోట్ల నష్టాల్లో సివిల్ సప్లై కార్పొరేషన్ ఉంది. తొమ్మిదిన్నర ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో లోపాలు ఉన్నాయి. ఉన్న రేషన్ కార్డులో బియ్యం తీసుకున్న వారు 89 శాతం దాటిపోలేదు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ ఉంది. సీఎం దృష్టికి ఆ విషయాన్ని తీసుకువెళ్తా. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఆర్థిక పరిస్థితి బాగోలేదు’ అని ఉత్తమ్ చెప్పారు.
Also Read: Himachal Pradesh: నేడు మంత్రి వర్గ విస్తరణ.. మంత్రులుగా ప్రమాణం చేయనున్న ఇద్దరు ఎమ్మెల్యేలు
‘పేద ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న బియ్యం సరఫరా విషయంలో మనం మరింత పారదర్శకంగా ఉండాలి. 1.8 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రజలకు ఉచితంగా ఇస్తున్నాం. కానీ ప్రజలు వాటిని ఉపయోగించుకుంటున్నారా? అన్నది మనం గమనించాలి. కిలో 39 రూపాయలు పెట్టి సేకరిస్తున్న బియ్యం ప్రజలకు ఉచితంగా ఇస్తున్నాం. కానీ అవి పేదలు తినకపోతే ఇంత పెద్ద గొప్ప ఉచిత బియ్యం పథకం నిరుపయోగం అవుతుంది. మొక్కుబడిగా కాకుండా లోపాలు ఎక్కడ ఉన్నాయో వెతకాలి. బియ్యం పేదలకు ఎలా ఉపయోగకరమైన పథకంగా ఉంటుందో మనం అధ్యయనం చేయాలి. రాష్ట్రంలో బియ్యం లబ్దిదారుల నుంచి రాండం చెక్ చెయ్యాలి. ప్రజల నుంచి సమాచారం సేకరించాలి. పేదలకు ఇస్తున్న బియ్యం వారు తినే విదంగా ఉండాలి తప్ప వేరే విదంగా దుర్వినియోగం కావొద్దు’ అని మంత్రి ఉత్తమ్ సమావేశంలో చెప్పుకొచ్చారు.