Komatireddy Venkat Reddy Inspected AP Bhavan in Delhi: ఢిల్లీలోని ఉమ్మడి ఏపీ భవన్ విభజనపై నేడు సమీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో అధికారులతో కలిసి ఏపీ భవన్ ప్రాంగణాన్ని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఏపీ తెలంగాణ భవన్ విభజనలో ఇప్పటికే చాలా ఆలస్యం అయిందన్నారు. రెండు రాష్ట్రాల మధ్య విభజనలు వివాదం కూడా పెద్దగా ఏమీ లేదని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. కొత్త భవనం కోసం మార్చి లోగా శంకుస్థాపన చేస్తామని చెప్పారు.
ఏపీ భవన్ ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ… ‘ఉమ్మడి భవన్ ప్రాంగణంలో సైట్ ఇన్స్పెక్షన్ చేశా. ఏపీ తెలంగాణ భవన్ విభజనలో ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. విభజనలపై వివాదం కూడా పెద్దగా ఏమీ లేదు. దీని గురించి హైదరాబాద్ వెళ్లాక సీఎం రేవంత్ రెడ్డి గారితో కూర్చుని చర్చిస్తాను. త్వరగా విభజన పూర్తి చేసి కొత్త భవనం కోసం మార్చి లోగా శంకుస్థాపన చేయాలన్నది మా ఉద్దేశం. ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేయాలన్నదే మా లక్ష్యం’ అని అన్నారు.
Also Read: Anjani Kumar: అంజనీకుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేత!
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఉమ్మడి ఏపీ భవన్ విభజన అంశం అపరిష్కృతంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో ఏపీ భవన్ విభజన వివాదం అపరిష్కృతంగానే ఉంది. ఈ వివాదాన్ని పరిష్కరించి ఉమ్మడి భవన్ ఆస్తులను పంచుకోవాలని తాజాగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ వెళ్లి ఉమ్మడి ఏపీ భవన్ ప్రాంగణాన్ని పరిశీలించారు.