Minister Harish Rao Public Meet at Utnoor: అసెంబ్లీ ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు వరుస సభలలో పాల్గొంటూ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. నేడు మంత్రి హరీష్ రావు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సభలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై మంత్రి నిప్పులు చెరిగారు. బీజేపీకి ఓటు వేస్తే మోటర్లకు మీటర్లు వస్తాయని, కాంగ్రెస్‌కే ఓటు వేస్తే మూడు గంటల కరెంట్ మాత్రమే అని విమర్శించారు.
‘బీఆర్ఎస్ పార్టీతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం ఆగమవుతుంది. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మూడు గంటల త్రీ పేస్ కరెంట్ ఇస్తది.. అదే బీజేపీకి ఓటు వేస్తే మోటర్లకు మీటర్లు వస్తాయి. అందుకే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే 24 గంటల కరెంట్ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీతోనే రైతులు అభివృద్ధి పథంలో ఉన్నారు. బీజేపీకి ఓటు వేస్తే సిలిండర్ ధర పెరుగుతుంది. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రూ. 400కే గ్యాస్ సిలిండర్ దొరుకుతుంది. కళ్యాణ లక్ష్మి ఆర్థిక సహాయంతో పేద ఇంటి కుటుంబానికి బీఆర్ఎస్ ఆసరాగా ఉంది’ అని హరీష్ రావు అన్నారు.
Also Read: Janga Ragava Reddy: కంటతడి పెట్టిన జంగా రాఘవ రెడ్డి.. పార్టీ మారే యోచనలో జంగా!
‘మరో మారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. రైతు బీమా పథకంతో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుంది. ఈసారి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీని 15 లక్షలకు పెంచుతాం. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి అందరికీ పట్టాలను అందజేస్తాం. గత నాయకుల పాలనలో ఖానాపూర్ అభివృద్ధిలో వెనకకపడింది. కడెం పాజెక్ట్ గేట్లు పెంచి నుతన టెక్నాలజీతో అభివృద్ధి చేపడుతాం. ఉట్నూర్ మండల కేంద్రంలో ఫోర్ వే లైన్ తో సెంట్రల్ లైటింగ్ వేసి అభివృద్ధి చేస్తాం’ అని హరీష్ రావు హామీ ఇచ్చారు.