Godavari River: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరిలో వరద ప్రవాహం భారీగా పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరి 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల వల్ల గోదావరికి వరద నీరు చేరుకుంటోంది. అదేవిధంగా భద్రాచలం ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి భారీ ఎత్తున గోదావరిలోకి నీరు చేరుతోంది. ఈ నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి 43 అడుగులకు చేరుకుంది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయగా.. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ముంపు ప్రాంతాల బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరికి వరద పోటెత్తడంతో ఇప్పటికే పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు భద్రాద్రి రామయ్య ఆలయ పరిసరాల్లోనూ కుండపోత వర్షాలకు నీరు చేరడంతో.. భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అన్నదాన సత్రం వద్ద వరద నీరు చేరడంతో అన్నదాన కార్యక్రమాన్ని నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read: TSSPDCL CMD: వర్షాకాలంలో విద్యుత్‌తో జాగ్రత్త.. పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..
భద్రాచలం పట్టణంలో భారీ వర్షం కురిసింది. వర్షపు నీళ్లన్నీ సీతారామచంద్ర స్వామి దేవాలయం పక్కనే ఉన్న పడమర మెట్ల వద్దకు చేరుకున్నాయి. డ్రైనేజీ నీరు, వర్షపు నీరు కలిసి ఆలయం పడమర వీధుల్లోకి చేరుకున్నాయి. పడమర మెట్లు ఎక్కి టెంపుల్‌లోకి వెళ్లడానికి వీలు లేకుండా నీళ్లు చేరుకున్నాయి. అదేవిధంగా అన్నదాన సత్రం చుట్టూ కూడా నీళ్లు చేరడంతో అన్నదాన సత్రంను మూసివేశారు . అదేవిధంగా దుకాణ సముదాయాలకి చుట్టూ నీళ్లు చేరటంతో దుకాణాలు మూసివేశారు.
భద్రాచలం వద్ద గోదావరి 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. గోదావరికి వరద పోటెత్తిన నేపథ్యంలో.. జిల్లా కలెక్టర్ ప్రియాంక ఎప్పటికప్పుడు పరిసర గ్రామాల పరిస్థితిపై అధికారులతో సమీక్షిస్తున్నారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండేలా.. కలెక్టరేట్‌తో పాటు కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీఓ కార్యాలయాలు, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ప్రాణహాని జరగకుండా తగు రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. జాలర్లు నదిలో చేపలవేటకు వెళ్లొద్దని, ప్రజలు కూడా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న రహదారులపై ప్రయాణించవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.