Telangana Cabinet : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో అనేక కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్టుపై ఏ చర్యలు తీసుకోవాలనే దానిపై సుదీర్ఘ చర్చ సాగనుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు అధికారులు, మంత్రులతో కూడిన ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తోంది. అనంతరం రెండు రాష్ట్రాల సీఎంల మధ్య సమావేశం ఏర్పాటు చేసే అవకాశమూ ఉన్నట్టు సమాచారం.
Donald Trump: ఇరాన్లో పాలన మార్పు రావాలి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
ఈ సమావేశంలో మరో ప్రధాన అంశం స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత ఇవ్వడం. జూలైలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయితీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. కేబినెట్ ఈ ప్రక్రియకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం అలైన్‌మెంట్‌కు ఆమోదం తెలిపే అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు రానుంది. బాగ్‌లింగంపల్లి హౌసింగ్ బోర్డు భూములపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పలు సంక్షేమ పథకాల అమలు విషయాలను సమీక్షించే యోచన కూడా ఉంది.
వానకాలం పంటల కోసం రైతులకు రైతు భరోసా నిధులు విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే, రాష్ట్ర స్పోర్ట్స్ పాలసీపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశమూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై మంత్రివర్గ ఆమోదం ఉందా అనే అంశంపై ఈ నెల 30 లోగా వివరణ ఇవ్వాలంటూ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వం నుంచి నివేదిక కోరిన విషయం తెలిసిందే. ఈ అంశం కూడా కేబినెట్ సమావేశంలో ప్రాధాన్యత కలిగే అంశంగా భావిస్తున్నారు. ఈ సమావేశానికి కొత్తగా నియమితులైన ముగ్గురు మంత్రులు – వివేక్, వాకిటి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హాజరుకానున్నారు. వారికి అధికారికంగా పరిచయ కార్యక్రమం కూడా జరగనుంది.
AP Governance: సుపరిపాలనలో తొలి అడుగు.. నేడు ఏడాది పాలనపై కూటమి ప్రభుత్వం సమావేశం..!