Telangana Budget : తెలంగాణ అసెంబ్లీ 2023–24 వార్షిక బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు మధ్యాహ్నం 12.10 గంటలకు సభ ప్రారంభం కానుంది. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగ పాఠం బుధవారం రాత్రి ప్రభుత్వం నుంచి రాజ్‌భవన్‌కు చేరింది. దాన్ని పరిశీలించిన గవర్నర్.. కొన్ని అంశాల్లో మరిన్ని వివరాలు కోరడంతో పాటు కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. ప్రభుత్వం కూడా గవర్నర్ సూచనలను పరిగణనలోకి తీసుకుని, ప్రసంగ పాఠంలో పలు మార్పులు చేసి తుదిరూపు ఇచ్చినట్లు తెలిసింది.
Read Also: Director K Viswanath Is No More Live: కళాతపస్వి కె.విశ్వనాథ్ ఇక లేరు.. విషాదంలో టాలీవుడ్
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఫిబ్రవరి 5న సమావేశం కానుంది. ఆదివారం ఉదయం 10.30గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ కానుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఎన్నికల ఏడాది బడ్జెట్ కావడంతో ప్రాధాన్యాలు, కేటాయింపులు, ప్రతిపాదనలపై సమావేశంలో కీలకంగా చర్చిస్తారు. ఈ భేటీలో మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ప్రభుత్వం తరపున చర్చ, విపక్షాలను ధీటుగా ఎదుర్కోవడం సహా సంబంధిత అంశాలపై కేబినెట్‌లో మార్గదర్శనం చేస్తారు.
Read Also:Telangana Cabinet Meeting: ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ మీటింగ్.. బడ్జెట్ ఆమోదం..
ఎన్నికల సంవత్సరం కావడంతో అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ పాలన తీరును ఎండగట్టేందుకు విపక్షాలు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. విపక్షాలను ఎదు ర్కొనేందుకు ప్రభుత్వం కూడా సన్నద్ధమవుతోంది. రాష్టాన్ని ఆర్థికంగా దిగ్బంధిస్తూ కేంద్రం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టేందుకు గత ఏడాది డిసెంబర్‌లోనే ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే డిసెంబర్‌లో సమావేశాలు వీలు కాలేదు. దీంతో ప్రస్తుత సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని, కేంద్రం వైఖరిని ఎండగట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. 3 రోజుల క్రితం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి రిక్తహస్తం చూపడంపై ఇప్పటికే మంత్రి హరీశ్ సహా బీఆర్‌ఎస్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం, బడ్జె ట్‌పై చర్చకు సమాధానం, ఇతర పద్దులపై చర్చ సందర్భంగా కేంద్ర విధానాలను కేసీఆర్ ఎండగడతారని బీఆర్‌ఎస్ శాసనసభా పక్షం వర్గాలు వెల్లడించాయి.