SSC Exams : తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,650 పరీక్షా కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఈ సంవత్సరం టెన్త్ పరీక్షలకు మొత్తం 5,09,403 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
ఈసారి తెలంగాణ టెన్త్ పరీక్షల్లో ఒక కీలక మార్పును చేపట్టారు. విద్యార్థులకు తొలిసారిగా 24 పేజీల బుక్‌లెట్ అందించనున్నారు. ఇంతకు ముందు అదనపు పేజీలు అందించే విధానాన్ని ఈసారి రద్దు చేశారు. దీంతో విద్యార్థులు అందించిన బుక్‌లెట్‌లోనే సమాధానాలను పూర్తిచేయాల్సి ఉంటుంది. అధికారులు ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాలను వివరిస్తూ, ఇది విద్యార్థులకు సమయ పరిమితులను గమనిస్తూ సమర్థవంతమైన సమాధానాల రచనకు సహాయపడుతుందని తెలిపారు.
పరీక్షల నిర్వహణలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. ప్రశ్నపత్రాల భద్రతను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుని, పరీక్షలు నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి.
విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లను తప్పనిసరిగా పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లాలని, అలాగే పరీక్షా సమయానికి ముందుగానే హాజరుకావాలని సూచించారు. పరీక్షల సజావుగా సాగేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకరించాలని విద్యాశాఖ కోరుతోంది.
Off The Record: పదవుల పరంగా TDPలో కాపులు కంఫర్ట్గా లేరా..?