After Cheteshwar Pujara retirement Who’s Next in Team India: ‘నయా వాల్’ ఛెతేశ్వర్ పుజారా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. పదిహేనేళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు పుజారా ఆదివారం (అగస్టు 24) స్వస్తి పలికాడు. ఇదే ఏడాదిలో ఆర్ అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కూడా రిటైర్మెంట్ అయ్యారు. ప్రస్తుతం క్రికెట్ ప్రేమికుల మనస్సుల్లో ఉన్న అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే.. భారత జట్టులో తదుపరి ఎవరు రిటైర్మెంట్ తీసుకుంటారు?. వయసు రీత్యా చూస్తే.. రిటైర్మెంట్ జాబితాలో నలుగురు ఉన్నారు. అజింక్య రహానే, రవీంద్ర జడేజా, ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ లాంటి సీనియర్లు ఉన్నారు.
అజింక్య రహానే:
అజింక్య రహానే (36) చాలా కాలంగా టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా అతడు పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. విదేశీ పర్యటనలలో కొన్ని ఇన్నింగ్స్‌లలో తన సత్తా చూపించాడు కానీ.. స్థిరమైన ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. దాంతో జింక్స్ జట్టులోకి వస్తూ పోతున్నాడు. ఈ మద్య కాలంలో అతడి స్ట్రైక్ రేట్, సగటు పడిపోయాయి. యువ బ్యాట్స్‌మెన్‌లు సత్తా చాటుతున్న ఈ సమయంలో మరలా రహానే జట్టులో చోటు సంపాదించడం కష్టమే. ఇటీవల ముంబై కెప్టెన్సీని కూడా విడిచిపెట్టడంతో రహానే త్వరలో వీడ్కోలు పలకొచ్చాడనే హింట్ ఇచ్చాడు.
మహమ్మద్ షమీ:
మహమ్మద్ షమీ (35) భారత జట్టులో సీనియర్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. కానీ గాయాలు అతని కెరీర్‌ను నాశనం చేశాయనే చెప్పాలి. గాయాల కారణంగా ఏడాదిగా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఫామ్‌లో ఉంటే ఇప్పటికీ అతడికి మ్యాచ్ విన్నర్ అయినా.. ఫిట్‌నెస్ అతడికి పెను సవాల్. ఎంతో ప్రతిభ ఉన్నా.. ఫిట్‌నెస్ కారణంగా కెరీర్‌ను సాఫీగా సాగించలేకపోతున్నాడు. గత 6 నెలలుగా షమీ జట్టులో ప్రణాళికలో లేడు. ఫిట్‌నెస్ రిటైర్మెంట్ వైపు అడుగులు వేయమని పరోక్షంగా చెబుతోంది.
Also Read: BCCI-Dream 11: డ్రీమ్ 11తో బీసీసీఐ ఒప్పందం రద్దు.. ఐపీఎల్‌కూ రాంరాం!
రవీంద్ర జడేజా:
రవీంద్ర జడేజా (36) ఇప్పటికీ టీమిండియాకు ముఖ్యమైన ఆల్ రౌండర్. కానీ ఇటీవలి కాలంలో జడ్డు గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. మోకాలి సమస్యలు అతడిని వెంటాడుతున్నాయి. ప్రస్తుతం బౌలింగ్ ప్రభావం తగ్గింది. బ్యాటింగ్‌లో రాణిస్తున్నా.. అతడి వయసు కారణంగా బీసీసీఐ యాజమాన్యం తదుపరి తరం ఆల్‌రౌండర్ కోసం వెతకాల్సిన సమయం ఆసన్నమైంది.
ఉమేష్ యాదవ్:
ఉమేష్ యాదవ్ (37) ఒకప్పుడు స్టార్ పేసర్లలో ఒకడిగా ఉన్నాడు. కానీ వయసు పెరిగే కొద్దీ అతని బౌలింగ్‌లో వేగం, పదును తగ్గాయి. మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ వంటి యువ బౌలర్లు నిలకడగా మంచి ప్రదర్శన ఇస్తున్నారు. ఈ పరిస్థితిలో ఉమేష్ భారత జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఈ నలుగురి ఆటగాళ్ల కెరీర్‌లు దాదాపుగా ముగిసినట్లే. ఈ సంవత్సరం చివరి నాటికి రహానే, ఉమేష్ లేదా షమీలలో ఒకరు రిటైర్మెంట్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.