BCCI Terminates Dream 11 Sponsorship Deal: భారత జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ ‘డ్రీమ్ 11’తో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒప్పందంను రద్దు చేసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన నేపథ్యంలో.. బీసీసీఐ సోమవారం ఈ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులోనూ ఇలాంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకోమని బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా తెలిపారు. కొత్త చట్టం కారణంగా ఒప్పందాన్ని కొనసాగించలేమని డ్రీమ్ 11 ప్రతినిధులకు బీసీసీఐ స్పష్టం చేసింది.
యూఏఈలో జరిగే ఆసియా కప్ 2025కు కేవలం 15 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భారత జట్టుకు ప్రస్తుతం టైటిల్ స్పాన్సర్ లేదు. ఇప్పుడు కొత్త స్పాన్సరర్‌ను వెతుక్కునే అవసరం ఏర్పడింది. టైటిల్ స్పాన్సర్ కోసం త్వరలోనే బీసీసీఐ టెండర్లు ప్రారంభించనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ఆరంభం కానుంది. ఈ రెండు వారాల్లో బీసీసీఐ కొత్త స్పాన్సరర్‌ను తెచ్చుకోవాలి. బీసీసీఐకి ఉన్న డిమాండ్ దృష్టా పలు సంస్థలు పోటీపడే అవకాశాలు ఉన్నాయి. గతంలో పెద్ద సంస్థలు పోటీ పడిన విషయం తెలిసిందే.
జూలై 2023లో బీసీసీఐతో డ్రీమ్ 11 ఒప్పందం చేసుకుంది. బైజూస్ స్థానంలో మూడేళ్ల కాలానికి రూ.358 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు ఇంకో సంవత్సరం ఒప్పందం మిగిలుంది. అయినప్పటికీ బీసీసీఐపై డ్రీమ్ 11 ఎలాంటి జరిమానా విధించడం లేదు. ఎందుకంటే బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందింది. మరోవైపు పలు ఐపీఎల్ ఫ్రాంఛైజీలకూ డ్రీమ్ 11 స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఇప్పుడు ఆ టీమ్స్ కూడా సంబంధాలు తెంచుకునే అవకాశాలు ఉన్నాయి. మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా వంటి అనేక మంది అగ్రశ్రేణి ఆటగాళ్లను డ్రీమ్ 11 తమ బ్రాండ్ అంబాసిడర్లుగా తీసుకున్న విషయం తెలిసిందే.