Uttar Pradesh: విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఓ టీచర్ బుద్ధి లేకుండా ప్రవర్తించింది. విద్యార్థుులందరిని సమానంగా చూడాల్సిన గురువై ఉండి మత వివక్షను రెచ్చగొట్టేలా చేసింది. మనది లౌకిక రాజ్యం ఇక్కడ అందరికి సమానంగా బతికే హక్కు ఉంది అని చెప్పాల్సిన ఉపాధ్యాయురాలు అడవి మనిషిలా ప్రవర్తించింది. చిన్నారులలో మతం అనే విషం నింపే ప్రయత్నం చేసింది. ఒక ముస్లిం బాలుడిని తోటి హిందూ పిల్లలతో కొట్టించి రాక్షసానందం పొందింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో జరిగింది.
వైరల్ అవుతున్న వీడియోలో ఓ ముస్లిం పిల్లవాడు నిల్చొని ఉంటాడు. అతనిని కొట్టాలని ఓ హిందూ బాలుడిని పిలుస్తుంది టీచర్. ఆ బాలుడి నిలుచున్న ముస్లిం పిల్లవాడి చెంప మీద కొట్టి వెళ్లిపోతాడు. అయితే అప్పుడు ఆ టీచర్ అలాగేనా కొట్టేది నీ బలం మొత్తం పెట్టి కొట్టాలి అని చెబుతుంది. అంతేకాకుండా వేరే పిల్లలను పిలిచి కూడా కొట్టిస్తుంది. నడుము మీద గుద్దండి, కడుపులో తన్నండి, చెంప పగలగొట్టండి గట్టిగా అంటూ తోటి విద్యార్థులకు చెబుతూ ఆ బాలుడిని కొట్టిస్తూ వికృత చేష్టలకు పాల్పడింది. క్లాస్ లో ఉన్న హిందూ పిల్లలందరి చేత ముస్లిం బాలుడిని కొట్టించింది. పిల్లవాడు ఏడుస్తున్న కనికరించలేదు. అయితే ఆమె కొట్టించడమే కాకుండా ముస్లిం పిల్లలు అంటూ మతం గురించి మాట్లాడటం మధ్యలో అసభ్యంగా తిట్టడం కూడా కెమెరాలో రికార్డు అయ్యాయి.
Also Read: Musheerabad PS: సార్ నా మేకపిల్లను కిడ్నాప్ చేశారు.. ప్లీజ్ వెతికి పెట్టండి
వీడియో వైరల్ కావడంతో పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. స్కూల్ ప్రిన్సిపల్ ను కలిసి జరిగిన విషయాన్ని తెలుసుకుంటున్నారు. అయితే ఎక్కాలు సరిగా చెప్పనందుకు టీచర్ కొట్టించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విధంగా ప్రవర్తించడం సరైనది కాదని ఆమెపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై విద్యాశాఖ ఉన్నతాధికారలకు కూడా ఫిర్యాదు అందింది. విద్యాశాఖ ఆ ఉపాధ్యాయురాలిపై దర్యాప్తునకు ఆదేశించింది.ఇక దీనిపై విద్యార్థి తండ్రి మాట్లాడుతూ విషయం తెలియగానే తన కొడుకును స్కూల్ మాన్పించేశానని తెలిపారు. అయితే జరిగిన విషయం గురించి ఎక్కడా చెప్పకూడదని స్కూల్ యాజమాన్యం తనతో అగ్రిమెంట్ చేయించుకుందని చెప్పారు. అంతేకాకుండా తన కొడుకు ఆడ్మిషన్ ఫీజు మొత్తం వెనక్కు ఇచ్చేశారని వెల్లడించారు. అయితే తాను చెప్పకపోయినా సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో విషయం బయటకు వచ్చిందని ఆ బాలుడి తండ్రి తెలిపారు. ఇక వీడియో చూసిన వారందరూ ఆ టీచర్ ను తిట్టిపోస్తున్నారు. ఇక ఈ వీడియోను దీపక్ కుషవాహ్(Dipak Kushwaha) అనే ఎక్స్( ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపై రాహుల్ గాంధీ కూడా స్పందించారు. ఓ టీచర్ దేశానికి ఇంతకు మించి చేసే ద్రోహం మరొకటి ఉండని పేర్కొన్నారు.
— OBC Deepak Patel (@32deepakpatel) August 25, 2023