MP Appalanaidu: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి టీడీపీ ఎంపీ అప్పల నాయుడు ఓ అపురూప కానుకను అందజేశారు. ప్రధానిగా హ్యాట్రిక్ సాధించిన సందర్భంగా చేనేత వస్త్రంపై ఒక చేనేత కుటుంబంలోని దంపతులతో మోడీ లఘు చిత్రాన్ని నేయించారు. చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపీ స్వయంగా ప్రధానికి బహుకరించారు. ఎంపీ సూచనల మేరకు విజయనగరం పార్లమెంట్ పరిధిలోని లావేరు మండలంలో గల చేనేత కుటుంబమైన బాసిన నాగేశ్వరరావు, లక్ష్మి దంపతులు ఈ ఏడాది జూన్ నెల మొదటి వారంలో ప్రారంభించి.. మూడు అడుగుల వెడల్పు, ఆరడుగుల పొడవు గల చేనేత వస్త్రంపై మోడీ లఘు చిత్రాన్ని నేశారు. 40 రోజుల పాటు శ్రమించి ఈ పనిని పూర్తి చేశారు. ఆ వస్త్రాన్ని చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధానిని కలిసి ఎంపీ అందజేయగా.. మోడీ చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఆ వస్త్రంపై తన రూపాన్ని చూసి ‘చాలా ధన్యవాదాలు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also: GVMC Standing Committee Elections: జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి హవా
జాతీయ చేనేత దినోత్సవం నాడు లఘు చిత్రాన్ని అందుకోవడం స్వీట్ మెమరీగా భావిస్తున్నానని మోడీ పేర్కొన్నారు. 40 రోజులపాటు ఎంతో కష్టపడి తన లఘు చిత్రాన్ని చేనేత వస్త్రంపై నేచిన శ్రీ బాసిన నాగేశ్వరరావు, లక్ష్మి దంపతులకు అభినందనలు తెలపాలని ఎంపీ అప్పలనాయుడికి ప్రధాని మోడీ సూచించారు. అంతే కాకుండా పీవీజీ రాజు జీవిత చరిత్ర పుస్తకాన్ని కూడా అప్పలనాయుడు ప్రధానికి అందజేశారు.ఈ సందర్భంలో ‘అశోక్ గజపతి రాజు ఎలా ఉన్నారు? ఆయన హెల్త్ ఓకేనా?’ అని కుశల ప్రశ్నలను మోడీ అడిగారు. పీవీజీ రాజు జీవిత చరిత్ర పుస్తకాన్ని అందజేయగానే.. ఆ పుస్తకాన్ని పట్టుకొని నాలుగైదు పేజీలు తిరగేసి పీవీజీ ఫోటోలను మోడీ పరిశీలనగా చూశారు. గుడ్.. గుడ్.. అని ప్రశంసించారు. పీవీజీ రాజు ఒక సామాజిక చైతన్య వేత్త అని మోడీ వ్యాఖ్యానించారు. అశోక్ గజపతి రాజుని అడిగానని చెప్పాలని.. ఆయనను ఒకసారి రావాలని కూడా చెప్పమని ప్రధాని ఎంపీ అప్పలనాయుడుకు సూచించారు. అలాగే ప్రధానికి చేనేత వస్త్రాలను కూడా అందజేశారు.