Ganta Srinivasa Rao Resignation Accepted: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించి.. ఆ పార్టీకి షాక్ ఇచ్చారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. దాదాపు మూడేళ్ల కిందట.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు గంటా.. అయితే, సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు రాజీనామాను ఆమోదించడం హాట్ టాపిక్‌గా మారింది.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ 2021, ఫిబ్రవరి 6న తన ఎమ్మెల్యే పదవికి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు.. అయితే, ఈనెల 22న ఆ రాజీనామాను ఆమోదించినట్టు అసెంబ్లీ జనరల్ డాక్టర్ పీపీకే రామాచార్యులు ఈ రోజు ప్రకటించారు.
కాగా, గంటా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పుడు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. దానిపై విమర్శలు గుప్పించింది.. స్పీకర్ ఫార్మేట్‌లో రాజీనామా ఇవ్వలేదని ఆరోపించారు.. దీంతో.. 2021, ఫిబ్రవరి 12వ తేదీన విశాఖలోని కూర్మనపాలెం గేట్ దగ్గర కార్మిక సంఘాల రిలే నిరాహారదీక్షకు మద్దతు ప్రకటించిన గంటా శ్రీనివాసరావు.. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్ తమ్మినేని సీతారాంకు విన్నవించారు. అయితే, ఆ రాజీనామాపై నిర్ణయాన్ని ఇంత కాలం పెండింగ్‌లో ఉంచిన స్పీకర్.. ఇప్పుడు విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా రాజీనామాను ఆమోదించింది.. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. వచ్చే నెలలో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో వ్యూహాత్మకంగా టీడీపీ ఎమ్మెల్యే రాజీనామాపై ఆమోద ముద్ర వేసినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. కాగా, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు.. టీడీపీ నుంచి బరిలోకి దిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. మొత్తంగా రాజ్యసభ ఎన్నికలకు ముందు.. టీడీపీకి షాక్ ఇచ్చింది వైసీపీ.