Roja vs TDP: మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నగరి నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు రోజాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ శ్రీశైలం బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, వడమాలపేట జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, విజయపురం ఎంపీపీ లక్ష్మీపతిరాజు, నిండ్ర ఎంపీపీ భాస్కర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. శ్రీశైలం బోర్డు మాజీ చైర్మన్ చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ.. నగరిలో మేమే రాజకీయంగా రోజాను నిలబెట్టాం. ఆమె రాజకీయ జీవితం మా వల్లే మొదలైంది. ఎంపీపీ ఎన్నికలు న్యాయబద్ధంగా జరిగాయి. కానీ, ఒక అబ్బాకు పుట్టావా? అంటూ మాట్లాడటం అత్యంత బాధాకరం అన్నారు.. నగరి నియోజకవర్గ చరిత్రలో అత్యంత దారుణంగా ఓడిపోయిన వ్యక్తి రోజానే. ఆమె జీవితంలో నగరిలో స్వయంగా గెలిచిన సందర్భం లేదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తాం అని హెచ్చరించారు.
Read Also: Venkatesh Birthday : వెంకీమామ పుట్టినరోజున అనిల్ రావిపూడి సర్‌ప్రైజ్ వీడియో
వడమాలపేట జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ.. రోజా ఫ్రస్ట్రేషన్‌లో ఉండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోంది. పార్టీలు మారింది మేము కాదు.. ఆమెనే. 2004లో నగరిలో, 2009లో చంద్రగిరిలో టీడీపీ తరఫున ఓడిపోయి పార్టీ మారింది. మా దయ వల్లే నగరి ఎమ్మెల్యేగా గెలిచింది. రోజా పుట్టుక గురించి మాట్లాడటం దారుణం. 2014కు ముందు ఆమె ఆర్థిక పరిస్థితి ఏంటి..? ఇప్పుడు ఏంటి..? అన్నది ప్రజలకు తెలుసు. డీఎన్‌ఏ టెస్ట్‌కు కూడా మేము సిద్ధమే” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీనియర్ నేత అమ్ములు మాట్లాడుతూ మా చరిత్ర ఏంటో తెలుసుకుని మాట్లాడాలి. అబ్బా–అమ్మ అంటే ఏమిటో రోజాకు తెలియదు. ఆమె కష్టకాలంలో మేమే సహాయం చేశాం. కానీ ఆమె కుటుంబం నగరి నియోజకవర్గాన్ని దోచుకుంది. రోజా కారణంగానే మేము పార్టీ మారాల్సి వచ్చింది. నోరు ఉందని నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించం. సత్తా ఉంటే ఎన్నికల్లో గెలిచి చూపించాలి. రోజా మాటల వల్లే వైసీపీ ఈ పరిస్థితికి వచ్చింది” అని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలతో నగరి నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రోజాపై టీడీపీ నేతల దాడి తీవ్ర రాజకీయ చర్చకు దారి తీస్తుండగా, దీనిపై వైసీపీ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది.