Palakurthi Thikka Reddy: కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం నుండి కౌతాళం మండలం హాల్వి గ్రామం వరకు అధ్వాన్నంగా తయారైన రోడ్డును చూసి, నిరసన వ్యక్తం చేశారు మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జి పాలకుర్తి తిక్కారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ళ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో పాతాళానికి కూరుకుపోయిందని, రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా తయారైందని ఆయన విమర్శించారు.
కనీసం రోడ్లమీద ఉన్న గుంతలను కూడా పూడ్చలేని దయనీయమైన స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం, నియోజకవర్గం ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి ఉన్నారని ఆరోపణలు చేశారు. ఏమాత్రం అభివృద్ధి చేయకుండా వై నాట్ 175 అంటున్నారని,ఈ సారి వై నాట్ పులివెందుల అని మేమంటున్నామని, అదే విధంగా ఆడుదాం ఆంధ్ర అని వందల కోట్లు దోచుకోవడానికి.. పెట్టిన దాంట్లో అంతా వైసీపీ నాయకుల దోపిడికి గురైన విషయం అందరికీ తెలుసన్నారు. అందుకే మీరు ఆడుదాం ఆంధ్ర అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మార్చుదాం ఆంధ్రప్రదేశ్ అని, మారుస్తాం జగన్ రెడ్డిని అంటున్నారని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కోసిగి మండలం, కౌతాళం మండలం కన్వీనర్లు, సీనియర్ నాయకులు, అన్నీ గ్రామాల నాయకులు, సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, కార్యకర్తలు, ఐటీడీపీ సభ్యులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.