Jyothula Nehru: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి.. ఇప్పటి వరకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉన్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం.. క్రమంగా దూరం జరుగుతున్నారా? అనే చర్చ సాగుతోంది.. నిన్న జనసేన నేతలు ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరపగా.. ఈ రోజు సీనియర్ పొలిటీషియన్, టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ.. ముద్రగడ నివాసానికి వెళ్లడం చర్చగా మారింది. కాపు సామాజిక వర్గం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ముద్రగడ దృష్టికి తీసుకెళ్లారట నెహ్రూ.. కాపు నేతగానే తాను ముద్రగడ దగ్గరకు వచ్చానని క్లారిటీ ఇచ్చారు. ముందు నా నియోజకవర్గంలో కాపులను కలపాలి.. కాబట్టి ఇక్కడికి వచ్చానని తెలిపారు.. ఇప్పటివరకు ఐక్యత లేకపోవడం వలన ఈ పరిస్థితి వచ్చిందని సమావేశంలో చర్చ నడిచిందట.. అయితే, టీడీపీ-జనసేన కూటమిలో కాపులకి అధిక ప్రాధాన్యత ఉంటుందని పద్మనాభం దృష్టికి తీసుకెళ్లారట.. జాతికి ప్రయోజనాలు ఉన్నాయంటే కలిసి ప్రయాణం చేద్దామని తెలిపిన ముద్రగడ చెప్పినట్టుగా తెలుస్తోంది.
Read Also: Priyanka Singh: కొత్త కారు కొన్న బిగ్ బాస్ ప్రియాంక.. ఎన్ని లక్షలో తెలుసా?
ఇక, ముద్రగడ పద్మనాభంతో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన జ్యోతుల నెహ్రూ.. ముద్రగడ, నేను ఇద్దరం కలిస్తే కచ్చితంగా రాజకీయాలు మాట్లాడుకుంటాం అన్నారు. నాకు మద్దతు ఇమ్మని అడిగానని తెలిపారు. పార్టీ అడిగితే కచ్చితంగా మళ్లీ వస్తాను.. ముద్రగడను కలుస్తానని తెలిపారు. ముద్రగడ రాజకీయాల్లోకి వస్తే.. కచ్చితంగా నేను ఉన్న (టీడీపీ) పార్టీలోకి రావాలని కోరుకుంటాను అని స్పష్టం చేశారు. అయితే, ఈ రోజు వ్యక్తిగతంగా మాత్రమే వచ్చాను.. ముద్రగడను కలిసినట్టు వెల్లడించారు టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ.