టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎట్టకేలకు దిగొచ్చారు. సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లతకు ఆయన క్షమాపణలు చెప్పారు. ‘సినీ నటి మాధవీ లత గురించి ఆవేశంలో అలా మాట్లాడటం తప్పే. ఆమెకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నాను. 72 సంవత్సరాల వయసున్న నేను ఆవేశంలో అలా మాట్లాడానే తప్ప.. కించపరచాలనే ఉద్దేశం లేదు’ అని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఇక జేసీ, మాధవీ లత మధ్య వివాదంకు తెరపడనుంది.
మంత్రి సత్యకుమార్, ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి సహా ఇతర బీజేపీ నేతల వ్యాఖ్యలకు జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నాపై విమర్శలు చేసిన వాళ్లంతా ఫ్లెక్సీ గాళ్లే అని ఘాటుగా విమర్శించారు. ‘రెండు సంవత్సరాల్లో తాడిపత్రి పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా. తాడిపత్రి పట్టణ ప్రజల కోసం ఎన్ని త్యాగాలు అయినా చేస్తా, ఎన్ని మెట్లైనా తగ్గుతా. తాడిపత్రి నియోజకవర్గం ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటా. నన్ను పార్టీ మారమని అనడానికి బీజేపీ నాయకులకు ఏ అర్హత ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడు కాబట్టే టీడీపీలోనే ఉన్నా’ అని జేసీ పేర్కొన్నారు.
న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేక ఈవెంట్‌ను టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించారు. జేసీ ఈవెంట్‌కు వెళ్లొదంటూ సినీ నటి మాధవీ లత సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. దాంతో ఆమెపై జేసీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మాధవీ లత ఒక వ్యభిచారి అని, ఆమెను బీజేపీలో ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారో తెలియడం లేదంటూ జేసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జేసీకి మాధవీ లత కౌంటర్ ఇస్తూ.. సినిమాల్లో నటించే వారంతా క్యారెక్టర్ లేనివాళ్లు అనుకోవటం జేసీ మూర్ఖత్వమని, జేసీ వయస్సుకు గౌరవం ఇస్తా కానీ అసభ్య భాషకు కాదని, రాజ్యాంగ బద్ధంగా మహిళల రక్షణ కోసం మాట్లాడితే తప్పా?, జేసీ ఒళ్లంతా విష నాలుకలు కలిగిన వ్యక్తి అని అన్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జేసీపై విమర్శలు రావడంతో చివరకు మెట్టుదిగొచ్చి సారీ చెప్పారు.